AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Andhra News: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరానికి కేంద్రీకృతమై ఉన్నందున ఏపీలో రాబోయే 2 రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
AP Latest Weather Report: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి తీరానికి సమీపంలోనే కేంద్రీకృతమై ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో మరో 2 రోజులపాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని.. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది. అటు, విశాఖ పోర్టులో మూడో నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని.. సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
ఉత్తర కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సోమ, మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. మరోవైపు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
పశ్చిమగాలుల ప్రభావంతో..
ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా.. తర్వాత వాయుగుండంగా బలపడి తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని వాతావరణ శాఖ నిపుణులు భావించారు. అనంతరం 2 రోజులకు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఏపీ తీరం వైపు వచ్చింది. మరో 2 రోజులకు వాయుగుండంగా మారింది. శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి.. దాదాపు వారం రోజులుగా కొనసాగుతోంది. ఉత్తర భారతం నుంచి వీచే పశ్చిమగాలుల ప్రభావంతో వాయుగుండం ఉత్తర కోస్తా తీరం వెంబడి ప్రయాణించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వాటి ప్రభావం తగ్గడంతో దిశ మార్చుకుందని అందుకే ఆకాశం ఇంకా మేఘావృతమై ఉందని పేర్కొంటున్నారు. కాగా, అల్పపీడనం ప్రభావంతో గత 5 రోజులుగా మత్స్యకారుల పడవలు ఒడ్డుకే పరిమితమయ్యాయి.