Actress : భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి హీరోయిన్ ఎవరో తెలుసా? జయలలిత మాత్రం కాదండోయ్
Actress : ఒక పాపులర్ హీరోయిన్ సీఎంగా గద్దెనెక్కి చరిత్ర సృష్టించింది. సీఎం పదవిని చేపట్టింది కొన్ని రోజులే అయినప్పటికీ, భారతీయ చరిత్రలోనే సీఎం అయిన మొట్టమొదటి నటిగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

భారతీయ రాజకీయ, సినీ చరిత్రలో సీఎం పదవిని చేపట్టిన నటీమణులు ఇద్దరే ఇద్దరు ఉన్నారు. అందులో తమిళనాడు రాష్ట్రంలో చాలా కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన దివంగత నటి జయలలిత ఒకరు. ఆమె 14 సంవత్సరాల 124 రోజుల పాటు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. షీలా దీక్షిత్ తర్వాత భారత దేశంలో ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పని చేసిన రెండవ మహిళగా ఆమె చరిత్రను సృష్టించారు. అయితే జయలలిత సీఎంగా పదవిని చేపట్టక ముందే మరో హీరోయిన్ ఆ పదవిని చేపట్టి, ఇండియన్ హిస్టరీలో అత్యంత అరుదైన రికార్డును తన పేరున లిఖించుకుంది. ఆమె కూడా తమిళనాడుకు చెందినవారే కావడం విశేషం. మరి ఇప్పటికైనా ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? ఆవిడ మరెవరో కాదు వి.ఎన్. జానకి రామచంద్రన్.
వి.ఎన్. జానకి ఎవరు ?
వి.ఎన్. జానకి ఒక పాపులర్ నటి, తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు-రాజకీయ నాయకుడు ఎం.జి.ఆర్. భార్య. వైకోమ్ నారాయణి జానకి 1924 సెప్టెంబర్ 23న కేరళలో జన్మించారు. కళా నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగిన జానకికి సంగీతం, నృత్యం అంటే చాలా ఇష్టం. ఆమె మామ పాపనాశం శివన్ ప్రఖ్యాత కర్ణాటక మ్యూజిషియన్.
1936లో జానకి తండ్రి రాజగోపాల్ అయ్యర్ కూడా పాపులర్ మ్యూజిషియన్ గా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆయనకు 'మద్రాస్ మెయిల్' చిత్రానికి పాటలు రాసే అవకాశం లభించింది. ఫలితంగా ఆ కుటుంబం మద్రాసు, ఇప్పటి చెన్నైకి మకాం మార్చింది. జానకి శాస్త్రీయ సంగీతం, నృత్యం రెండింటిలోనూ శిక్షణ పొంది, చివరికి సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. ఆమె సినీ కెరీర్లో ఎక్కువగా తమిళనాడులోని అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకులలో ఒకరిగా ఎదిగిన మరుత్తూర్ గోపాలన్ రామచంద్రన్ (MGR)తో కలిసి నటించింది. తరువాత ఆయననే పెళ్లాడింది.
Also Read: 'కోర్టు' రివ్యూ: థియేటర్లలో వాదనలు నిలబడతాయా? పడిపోతాయా? నాని సమర్పణలో వచ్చిన సినిమా ఎలా ఉందంటే?
జానకి రామచంద్రన్ కు ముఖ్యమంత్రి పగ్గాలు
1987లో ఎంజీఆర్ మరణం తరువాత ఆయన రాజకీయ వారసురాలు ఎవరు అన్న విషయం తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. అప్పటికే 'ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం' పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రి హోదాలో కన్నుమూసిన ఎంజీఆర్ కు సన్నిహితంగా ఉన్న సహచరురాలు జయలలిత. ఆమెతో జానకి రాజకీయ పోరాటం గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే ఎట్టకేలకు ఎంజీఆర్ సతీమణి అయిన జానకికే ఆయన తదనంతరం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే భాగ్యం దక్కింది. దీంతో జానకి కొంతకాలం తమిళనాడుకు తొలి మహిళా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. అయితే ఆమె పదవీకాలం కేవలం 23 రోజులు మాత్రమే కొనసాగింది. 1988 జనవరి 7 నుండి 1988 జనవరి 30 వరకు మాత్రమే జానకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. జానకి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం స్వల్పకాలికమే అయినప్పటికీ, ఆమె పాత్ర భారత రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆమె భారత చరిత్రలో ముఖ్యమంత్రి అయిన మొట్ట మొదటి నటి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

