(Source: ECI/ABP News/ABP Majha)
Harish Shankar: వారితో మాత్రమే గట్టిగా మాట్లాడతా, నచ్చిన రివ్యూలు రాసుకోండి - హరీష్ శంకర్
Mr Bachchan Pre Release Event: ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు మేకర్స్. అందులో ఈ సినిమా పూర్తవ్వడానికి కారణమయిన ప్రతీ ఒక్కరి గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు హరీష్ శంకర్
Harish Shankar At Mr Bachchan Pre Release Event: హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒక సూపర్ హిట్ కాగా మరొకటి ఫ్లాప్‌గా నిలిచింది. అయినా కూడా ఈ కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. అందుకే వీరి హ్యాట్రిక్ సినిమా అయిన ‘మిస్టర్ బచ్చన్’పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆగస్ట్ 15న ఎన్నో సినిమాలు పోటీగా ఉన్నా కూడా ఈ మూవీని కూడా అదే రోజు విడుదల చేయాలని డిసైడ్ చేశారు మేకర్స్. తాజాగా ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయగా అందులో ఈ సినిమా చేయడంలో తనకు సహాయపడిన అందరికీ థాంక్యూ చెప్పుకున్నాడు దర్శకుడు హరీష్ శంకర్.
రెండూ హిట్ అవ్వాలి..
ముందుగా ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటులో సహాయం చేసిన అందరికీ థాంక్యూ చెప్పుకున్నాడు హరీష్ శంకర్. ఆ తర్వాత తన రైటింగ్ టీమే తన బలం అంటూ అందరికీ పేరుపేరునా థాంక్యూ తెలిపాడు. ‘మిస్టర్ బచ్చన్’ ఆగస్ట్ 15న విడుదల కాదని ఆగస్ట్ 14 సాయంత్రం నుండే ప్రీమియర్స్ ప్రారంభమని, ఆన్‌లైన్‌లో బుకింగ్స్ కూడా మొదలయ్యాయని గుర్తుచేశాడు. ‘మిస్టర్ బచ్చన్’తో పాటు తన గురువు పూరీ జగన్నాధ్, రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా విడుదల అవుతుందని, మొహమాటపడకుండా రెండు సినిమాలు చూసి బ్లాక్‌బస్టర్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపాడు. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్ శిరీష్‌ను వేదికపై విమర్శించారని కానీ ‘మిస్టర్ బచ్చన్’కు తను సరిపడా థియేటర్లు ఇచ్చినందుకు వేదికపైనే థ్యాంక్స్ చెప్పాలని చెప్పాడు.
ట్విటర్‌లో బ్లాక్..
‘మిస్టర్ బచ్చన్’ నిర్మాత తాను అడిగినదానికంటే ఎక్కువే ఇచ్చాడని వ్యాఖ్యలు చేశాడు హరీష్ శంకర్. ‘గద్దలకొండ గణేశ్’ వచ్చి చాలారోజులు అయ్యింది కాబట్టి ‘మిస్టర్ బచ్చన్’ బ్లాక్‌బస్టర్ చేయమని ప్రేక్షకులను కోరాడు. భాగ్యశ్రీ భోర్సే గురించి మాట్లాడుతూ.. ‘‘చాలా కష్టపడే అమ్మాయి. మొదటి సినిమాకే పొగడకండి. ఇప్పటికే చాలా దిష్టి తగిలేసింది. నేను కలిసి పనిచేసిన హీరోయిన్స్‌లో తనంత ఎవరూ కష్టపడలేదు. చాలా దూరం వెళ్తుంది’’ అని ప్రశంసించాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని ప్రేక్షకులు కోరగా.. ‘‘మొన్న జూన్‌లో వచ్చిన ఫలితాల ద్వారా ఆయనేంటో మీరే చెప్పారు’’ అన్నాడు. ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్ రవితేజనే పెట్టారని చెప్తూ.. ‘‘జీవితాన్ని ఇచ్చి, సినిమాలు ఇచ్చి, ఆఖరికి టైటిల్స్ కూడా ఇస్తున్నావు. ఇంకేం ఇవ్వాలనుకుంటున్నావో ఇచ్చేయ్’’ అని రవితేతో అన్నాడు హరీష్. తను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక వ్యక్తి డిస్టర్బ్ చేయగా ట్విటర్‌లో బ్లాక్ చేస్తాను అని ఓపెన్‌గా వార్నింగ్ కూడా ఇచ్చాడు.
పునర్జన్మను ఇచ్చారు..
‘‘నా జీవితంలో ఒక్కటే హోప్ రవితేజ. జీవితంలో నేను ఈ స్టేజ్‌కు వచ్చినందుకు ఆయనే కారణం. తల్లి కూడా ఒకేసారి జన్మనిస్తుంది. కానీ నాకు షాక్ ద్వారా జన్మ, మిరపకాయ్ ద్వారా పునర్జన్మను ఇచ్చారు. చాలాకాలం తర్వాత ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడాలేని ప్రశాంతత వచ్చింది. ఆయన పెద్దగా గుళ్లకు వెళ్లరు, పూజలు చేయరు. రవితేజ లేకుండా నా సినిమా కెరీర్ ఊహించుకోలేను’’ అని రవితేజ గురించి తెలిపాడు హరీష్ శంకర్. చివరిగా ‘‘పాత్రికేయలు గురించి మాట్లాడకపోతే నాకు నిద్రపట్టదు. వాళ్లకు నిద్రపట్టదు’’ అని మొదలుపెట్టాడు. ‘‘నా శ్రేయోభిలాషులు ఎందుకంతా ఓపెన్‌గా, గట్టిగా మాట్లాడుతున్నావని అంటున్నారు. మీరు వేరు, నేను వేరు కాదు. ఆత్మాభిమానం దెబ్బతినే వ్యక్తుల దగ్గర మాత్రమే నేను గట్టిగా మాట్లాడాను. మీకు నచ్చిన రివ్యూలు రాసుకోండి’’ అని ముగించాడు హరీష్ శంకర్.
Also Read: ‘కంగువా’ ట్రైలర్‌లో ఇవి కనిపెట్టారా? సూర్య సినిమాలో స్పార్టన్లు, ఏం ప్లాన్ చేశారయ్యా?