Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Tollywood Celebs Meet Telangana CM: తెలుగు సినిమా పెద్దలతో జరిగిన భేటీలో బెనిఫిట్ షోస్ గురించి తన వైఖరిని ముఖ్యమంత్రి మరోసారి తేల్చి చెప్పారు. ఆ భేటీలో ఏం జరిగిందంటే...
టాలీవుడ్ ఇకపై బెనిఫిట్ షోల్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు చిత్రసీమ పెద్దలు ఈ రోజు సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ భేటిలో బెనిఫిట్ షోల గురించి చర్చకు రాగా... తన వైఖరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సూటిగా స్పష్టంగా చెప్పారు.
అసెంబ్లీలో మాటకు కట్టుబడి ఉన్నా...
శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదు! - రేవంత్ రెడ్డి
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి మరణం గురించి తెలంగాణ అసెంబ్లీలో చర్చకు వచ్చింది. తమ ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడేది లేదని, ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలతో జరిగిన భేటీలోనూ తన వైఖరి గురించి మరొక సారి సుస్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లు ఆయన వివరించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి మరణాన్ని తమ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, అందువల్లే బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం లేదని, రేవతి మృతి బాధాకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ... ''ఇండస్ట్రీతోనే మేం ఉన్నామని ప్రభుత్వం తరఫున భరోసా ఇస్తున్నాను. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను సెలబ్రెటీలు ప్రమోట్ చేయడంతో పాటు డ్రగ్ క్యాంపెయిన్, మహిళా భద్రత అంశాల విషయంలో చొరవ చూపించాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి. బౌన్సర్స్ విషయంలో మేం ఇకమీదట సీరియస్ గా ఉంటాం. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే'' అని చెప్పారు.
ప్రభుత్వం మీద చిత్రసీమకు నమ్మకం ఉంది - సురేష్ బాబు
రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం మీద తమకు నమ్మకం ఉందని అగ్ర నిర్మాతలలో ఒకరైన దగ్గుబాటి సురేష్ బాబు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''హైదరాబాద్ సిటీని ఇంటర్నేషనల్ ఫిలిం డెస్టినేషన్ చేయాలనేవి మా కల. ఆ రోజుల్లో ప్రభుత్వ సాయంతోనే చెన్నై నుంచి హైదరాబాద్ నగరానికి టాలీవుడ్ ఇండస్ట్రీ వచ్చింది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా ఉండాలని మేం కోరుకుంటున్నాం'' అని ఆయన చెప్పారు.
Also Read: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే... ఎవరెవరు ఉన్నారో తెలుసా
చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలి - రాఘవేంద్రరావు
ముఖ్యమంత్రులు అందరూ చిత్రసీమను భాగాన్ని చూసుకున్నారని, ఈ ప్రభుత్వం సైతం మమ్మల్ని బాగా చూసుకుంటుందని దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''చంద్రబాబు హయాంలో హైదరాబాద్ వేదికగా చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇప్పుడు కూడా నిర్వహించాలని కోరుతున్నాను'' అని అన్నారు. యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలని నాగార్జున పేర్కొన్నారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది తమ కోరిక అని నాగార్జున అన్నారు.
ప్రభుత్వానికి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దని నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సంధ్య థియేటర్ ఘటన తమను కూడా బాధించిందని మురళీ మోహన్ అన్నారు.
Also Read: బేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?