Medicines More Expensive: మన దేశంలో మందుల రేట్లను నిర్ణయించే అధికారం ఎవరిది, ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు?
Medicine Prices Goes Up: కొంత మంది రోగులు ప్రతి రోజూ వేసుకోవాల్సిన ఔషధాల ధరలు పెరుగుతున్నాయి. ఇది, ఆరోగ్య ఖర్చుల బడ్జెట్‌పై నేరుగా ప్రభావం చూపుతుంది.

Medicines Will Become More Expensive: రక్తపోటు (Blood Pressure లేదా BP), మధుమేహం (Diabetes), గుండె జబ్బులు (Heart Disease) లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ చికిత్స కోసం మందులు వాడుతుంటే, ఇకపై మరింత ఎక్కువ బడ్జెట్ కేటాయించుకోండి. 2025 మార్చి 31 వరకు ఉన్న రేట్లు ఇక కనిపించకపోవచ్చు. 2025 ఏప్రిల్ 01 నుంచి, అవే మందుల కోసం మీరు ఎక్కువ డబ్బు చెల్లించాల్సి రావచ్చు. 900 రకాలకు పైగా కీలక ఔషధాల ధరలు 1.74 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
మందుల రేట్లను ఎవరు నిర్ణయిస్తారు?
మన దేశంలో, అత్యవసర మందుల ధరలను 'జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ' (National Pharmaceutical Pricing Authority - NPPA) నిర్ణయిస్తుంది. ఇది, కేంద్ర రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలో, స్వతంత్ర సంస్థగా పని చేస్తుంది. ఔషధాల ధరలకు సంబంధించిన పార్లమెంటరీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు అందిస్తుంది. కేంద్ర రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ, నిత్యావసర వస్తువుల చట్టం (ECA) కింద ఔషధాల ధరల నియంత్రణ ఉత్తర్వులు (DPCO) జారీ చేస్తుంది. అవసరమైన & ప్రాణాధార ఔషధాల గరిష్ట ధరలను ఈ ఉత్వర్వులు ప్రకటిస్తాయి. అంటే, DPCOలో పేర్కొన్న ధరకు మించి ఆ ఔషధాన్ని విక్రయించకూడదు.
మందుల రేట్లను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు?
NPPA, టోకు ధరల సూచిక (WPI) ఆధారంగా ప్రతి సంవత్సరం ఔషధాల రేట్లను సవరిస్తుంది. 2024 సంవత్సరానికి WPIలో 1.74 శాతం పెరుగుదల నమోదైంది. అందువల్ల, ఫార్మా కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండానే ధరలు పెంచుకోవచ్చు. NPPA స్టేట్‌మెంట్ ప్రకారం, "2024 క్యాలెండర్ సంవత్సరంలో WPI 1.74 శాతం పెరిగింది కాబట్టి, ఔషధ కంపెనీలు ఔషధాల రిటైల్ ధరలను అదే రేటుతో పెంచవచ్చు."
ఏ మందుల ధరలు ఎక్కువగా ఉంటాయి?
యాంటీబయాటిక్స్ (Antibiotics)
అజిత్రోమైసిన్ (Azithromycin) (250 mg) – టాబ్లెట్‌కు రూ. 11.87
అజిత్రోమైసిన్ (Azithromycin) (500 mg) – టాబ్లెట్‌కు రూ. 23.98
అమోక్సిసిలిన్ + క్లావులానిక్ యాసిడ్ డ్రై సిరప్ (Amoxicillin + Clavulanic Acid Dry Syrup) – 1 మి.లీ.కు రూ. 2.09
యాంటీవైరల్ మందులు (Antiviral Medicines)
అసైక్లోవిర్ (Acyclovir) (200 mg) – టాబ్లెట్‌కు రూ. 7.74
అసైక్లోవిర్ (Acyclovir) (400 mg) – టాబ్లెట్‌కు రూ. 13.90
మలేరియా మందులు (Malaria Medicines)
హైడ్రాక్సీక్లోరోక్విన్ (Hydroxychloroquine) (200 mg) – టాబ్లెట్‌కు రూ. 6.47
హైడ్రాక్సీక్లోరోక్విన్ (Hydroxychloroquine) (400 mg) – టాబ్లెట్‌కు రూ. 14.04
నొప్పి నివారణ మందులు (Painkillers)
డైక్లోఫెనాక్ (Diclofenac) - టాబ్లెట్ కు రూ. 2.09
ఇబుప్రోఫెన్ (Ibuprofen) (200 mg) – టాబ్లెట్‌కు రూ. 0.72
ఇబుప్రోఫెన్ (Ibuprofen) (400 mg) – టాబ్లెట్‌కు రూ. 1.22
డయాబెటిస్ మందులు (Diabetes Medicines)
డపాగ్లిఫ్లోజిన్ + మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ + గ్లిమెపిరైడ్ (Dapagliflozin + Metformin Hydrochloride + Glimepiride) – టాబ్లెట్‌కు రూ. 12.74
పెరగనున్న స్టెంట్ల రేట్లు (Stent Rates Increased)
హార్ట్ పేషెంట్లకు వేసే కరోనరీ స్టెంట్ల ధరలు కూడా WPI ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి పెరగవచ్చు.
బేర్-మెటల్ స్టెంట్ (Bare-metal stent) - రూ. 10,692.69
డ్రగ్-ఎల్యుటింగ్ స్టెంట్ (Drug-eluting stent) - రూ. 38,933.14
కొత్త రేట్లు వచ్చే వరకు పాత రేట్లు
నిత్యావసర మందుల ధరల పెరుగుదల సామాన్యుడి జేబుపై నేరుగా ప్రభావం చూపుతుంది. అయితే, పెరుగుతున్న వ్యయాల నేపథ్యంలో ఔషధ కంపెనీలు ఉత్పత్తిని కొనసాగించాలంటే రేట్ల పెరుగుదల అవసరమని ప్రభుత్వం చెబుతోంది. మెడిసిన్ లేబల్ మీద కొత్త MRP ముద్రించిన ఔషధాలు మార్కెట్‌లోకి వచ్చే వరకు పాత రేట్లే అమలవుతాయి.





















