నేటి నుంచి జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు, విద్యార్థులకు ముఖ్య సూచనలు!
దేశవ్యాప్తంగా మొత్తం 330 నగరాలు/పట్టణాలతో పాటు ఇతర దేశాల్లోని 15 నగరాల్లో ఆన్‌లైన్ విధానంలో జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి.
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6 నుంచి రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6, 8,10,11,12,13, 15 తేదీల్లో జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది.
దేశవ్యాప్తంగా మొత్తం 330 నగరాలు/పట్టణాలతో పాటు ఇతర దేశాల్లోని 15 నగరాల్లో ఆన్‌లైన్ విధానంలో జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. బీటెక్‌లో ప్రవేశానికి పేపర్-1 పరీక్ష; బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇప్పటికే జేఈఈ మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లను ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
జేఈఈ మెయిన్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. మార్చి 12 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇక రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. రెండు విడతల్లో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసేవారి సంఖ్య లక్షన్నర వరకు ఉంటుంది. తెలుగు సహా 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ చూపినవారిలో 2.50 లక్షల మంది మాత్రమే జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హులవుతారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు.
పరీక్ష విధానం:
➥ జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సులో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు.
➥ ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.
➥ బీఈ, బీటెక్, బీఆర్క్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.
➥ ప్రశ్నపత్రాన్ని రెండు విభాగాలుగా విభజించారు. పేపర్-1లో 90 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థి 75 ప్రశ్నలకు మాత్రమే రాయాలి. 15 ఐచ్ఛిక ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు ఉండవు.
➥ బీఈ/బీటెక్(పేపర్-1 నాలుగు సెషన్‌సలో ఉంటుంది): ప్రతి సబ్జెక్టు రెండు సెక్షన్లుగా ఉంటుంది. సెక్షన్-ఏలో అన్ని ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్‌లో ఉంటాయి, సెక్షన్-బిలో ఇచ్చిన 10 ప్రశ్నల్లో ఏవైనా ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాలి, ఈ విభాగంలో నెగిటివ్ మార్కులు ఉండవు.
➥ బీఆర్క్(పేపర్ 2ఏ)- పార్ట్-1లో రెండు విభాగాలు ఉంటాయి. సెక్షన్-ఏ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, సెక్షన్-బీలో ఇచ్చిన 10 ప్రశ్నల్లో ఐదింటికి సమాధానాలు రాయాలి. వీటికి నెగిటివ్ మార్కులు ఉండవు.
➥ బీ-ప్లానింగ్(పేపర్ 2బీ) ఇందులోని పార్ట్-1లో రెండు విభాగాలు ఉంటారుు. సెక్షన్-ఏ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, సెక్షన్-బీలో 10 ప్రశ్నలు ఉంటారుు. వాటిలో ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాలి, వీటికీ నెగిటివ్ మార్కులు ఉండవు.
➥ సెక్షన్-బి లో ఇచ్చిన 10 ప్రశ్నల్లో అభ్యర్థి ఏవైనా ఐదు ప్రశ్నలను ఎంచుకుని జవాబులు రాయవచ్చు.
విద్యార్థులకు ముఖ్య సూచనలు...
➥ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి. అడ్మిట్ కార్డులో పేర్కొన్న సమయానికి మీకు కేటాయించిన పరీక్ష కేంద్రం వద్ద రిపోర్టు చేయాలి.
➥ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా హాల్‌టికెట్‌ను వెంట తీసుకొని వెళ్లాలి. ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్‌కార్డు లేకపోతే పరీక్ష హాలులోకి అనుమతించరు.
➥ పరీక్ష రాసే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంటతీసుకెళ్లాలి. పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డు, అభ్యర్థి ఫొటో ఉన్న బ్యాంకు పాసు పుస్తకం.. వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు చేసినప్పుడు అప్‌లోడ్ చేసిన ఫొటోను ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే దాన్ని అటెండెన్స్ షీట్‌పై అతికించాల్సి ఉంటుంది.
➥ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్లాలి.
➥ దివ్యాంగులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తమ వెంట మెడికల్ ఆఫీసర్ ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
➥ పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్/ఇయర్ ఫోన్/మైక్రోఫోన్/ పేజర్, కాలిక్యులేటర్, డాక్యుపెన్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు/గ్యాడ్జెట్లు/పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
➥ చాక్లెట్లు/క్యాండీ/శాండ్‌విచ్ వంటి ప్యాక్ చేసిన ఆహారపదార్థాలు, చిరుతిళ్ళు, జామెట్రీ/పెన్సిల్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, పర్సు, పేపర్లు/స్టేషనరీ, ప్రింటెడ్ మెటీరియల్, వాటర్ బాటిళ్లను కూడా అనుమతించరు.
➥ డయాబెటిక్ విద్యార్థులు షుగర్ టాబ్లెట్స్/పండ్లు వంటివి తీసుకెళ్లడానికి వెసులుబాటు ఉంది. ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్‌ను తీసుకెళ్లొచ్చు.
➥ పరీక్ష కేంద్రంలో ఏమైనా టెక్నికల్ సమస్యలు, ఇతర ఏదైనా ఇబ్బందులు ఎదురైతే పరీక్ష సెంటర్ సూపరింటెండెంట్ లేదా ఇన్విజిలేటర్‌ను సంప్రదించవచ్చు.
➥ పరీక్ష కేంద్రంలో ఇచ్చే రఫ్ షీట్లపైనే కాలిక్యులేషన్సు/రైటింగ్ వర్కు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రఫ్ షీట్లను కచ్చితంగా ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.