Trisha Krishnan: 'పెళ్లిపై మీ ఒపీనియన్ ఏంటి?' - నటి త్రిష ఏం చెప్పారో తెలుసా?
Trisha: ప్రముఖ నటి త్రిష పెళ్లి గురించి తాజాగా స్పందించారు. తనకు పెళ్లిపై నమ్మకం లేదని.. అది జరిగినా పర్వాలేదని.. జరగకపోయినా పర్వాలేదని అన్నారు.

Trisha About Marriage: ప్రముఖ నటి త్రిష (Trisha) తమిళంలో వరుస సినిమాలతో బిజీగా మారారు. తాజాగా, కోలీవుడ్ స్టార్ అజిత్‌తో కలిసి నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. స్టార్ హీరో కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ 'థగ్ లైఫ్'లోనూ ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'థగ్ లైఫ్' (Thug Life) మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'జింగుచ్చా' లాంఛ్ శుక్రవారం చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్‌లో కమల్ హాసన్‌తో పాటు త్రిష సైతం పాల్గొన్నారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమె పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'పెళ్లిపై మీ ఒపీనియన్ ఏంటి?' అని యాంకర్ ప్రశ్నించగా.. 'నాకు వివాహంపై నమ్మకం లేదు. అది జరిగినా పర్వాలేదు. జరగకపోయినా పర్వాలేదు.' అంటూ సమాధానం ఇచ్చారు.
అయితే, గతంలో త్రిష పెళ్లిపై రూమర్లు వినిపించాయి. తెలుగు, తమిళ హీరోలతో డేటింగ్ వార్తలు సైతం హల్చల్ చేశాయి. ఓ కోలీవుడ్ స్టార్‌తో ఆమె ప్రేయామణం సాగించారని.. పెళ్లి పీటలు కూడా ఎక్కేందుకు రెడీ అయ్యారనే టాక్ వినిపించింది. అప్పట్లో పెళ్లిపై స్పందించిన త్రిష.. తన పెళ్లి ఎప్పుడో తనకే తెలియదని.. తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానంటూ స్పష్టం చేశారు.
తన అందం, అభినయం, నటనతో అటు తమిళం, ఇటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు త్రిష. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో హిట్స్ అందుకున్న ఆమె దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించారు. మోడలింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో 'జోడీ' అనే సినిమాలో నటించి మెప్పించారు. తెలుగులో 'వర్షం'తో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా మారారు.
'ఒక్కరూ ఐలవ్యూ చెప్పలేదు'
మరోవైపు, 'థగ్ లైఫ్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'జింగుచ్చా' లాంఛ్ ఈవెంట్‌లో స్టార్ హీరో కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో తనకు ఇద్దరు హీరోయిన్లున్నా ఒక్కరూ 'ఐ లవ్ యూ' చెప్పలేదని సరదాగా కామెంట్స్ చేశారు. దర్శకుడు మణిరత్నం సమయపాలన పాటిస్తారని.. ఈ విషయంలో ఆయనలో దర్శకుడు బాలచందర్‌ను చూశానని అన్నారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
జూన్ 5న 'థగ్ లైఫ్' రిలీజ్
ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఈ మూవీని తెరకెక్కించారు. సినిమాలో తమిళ స్టార్ హీరో శింబు, త్రిష, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కమల్ మణిరత్నం కాంబో అంటేనే భారీ అంచనాలు నెలకొన్నాయి.






















