Anurag Kashyap: బ్రాహ్మణులపై సంచలన కామెంట్స్ - క్షమాపణలు చెప్పిన అనురాగ్ కశ్యప్
Anurag Kashyap Comments: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇటీవల బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రాగా.. ఆయన సారీ చెప్పారు.

Anurag Kashyap Apologised For His Controversial Comments: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap).. ఇటీవల ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసిని సంగతి తెలిసిందే. 'పూలే' సినిమా విడుదల క్రమంలో ఆయన బ్రాహ్మణులపై అనుచిత కామెంట్స్ చేశారు. దీంతో వివాదం నెలకొనగా తాజాగా ఆయన క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ నోట్ పంచుకున్నారు.
'కుటుంబానికి బెదిరింపులు.. సారీ చెబుతున్నా'
తాను చేసిన కామెంట్స్ కొందరి మనోభావాలు దెబ్బతీశాయని.. తన కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని అనురాగ్ చెప్పారు. 'నేను క్షమాపణలు చెబుతున్నా. నా ఫ్యామిలీని చంపేస్తామంటున్నారు. నా కుమార్తెపై కూడా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కంటే నాకు ఏదీ విలువైనది కాదు. నన్ను నిందించండి. కానీ, నా కుటుంబాన్ని ఈ వివాదంలోకి తీసుకురావొద్దు. మీరు నా నుంచి క్షమాపణలు కోరారు. నేను మీ అందరికీ బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాను.' అని తెలిపారు.
షారుఖ్ కంటే బిజీగా ఉన్నా
బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో విషపూరితంగా మారిందని అనురాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే తాను దక్షిణాదికి వెళ్లిపోతున్నానని.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలిపారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కంటే తాను బిజీగా ఉన్నట్లు చెప్పారు. అయితే, తాను బాలీవుడ్ వీడుతున్నట్లు ఇటీవలే ఆయన ప్రకటించారు.
అసలు వివాదం ఇదీ
అనురాగ్ కశ్యప్ అటు దర్శకుడిగానే కాకుండా ఇటు నిర్మాతగానూ పలు సినిమాలు నిర్మించారు. ఆయన ఇటీవల సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు, సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్రతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెన్సార్‌కు సంబంధించి ఆయనకు సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC), బ్రాహ్మణ సమాజంలోని ఓ వర్గంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'బ్రాహ్మణులపై నేను మూత్రం పోస్తాను' అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
తీవ్ర విమర్శలు
అనురాగ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి. సమాజాన్ని రెచ్చగొట్టేలా బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానిస్తున్నారని పలువురు నెటిజన్లు ఆయనపై మండిపడ్డారు. సినిమాలో బ్రాహ్మణులను అవమానించే అంశాలు ఉన్నాయని.. అందుకే సీబీఎఫ్‌సీ సెన్సార్ చేయడం లేదని అంటున్నారు. మరోవైపు.. అనురాగ్ కామెంట్స్‌పై బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
మూవీకి సెన్సార్ బోర్డ్ సవరణలు
నిజానికి ఈ నెల 11నే 'ఫూలే' మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా.. సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ రాకపోవడంతో రిలీజ్ కాలేదు. 'మాంగ్', 'మహర్', 'పేష్వాయి' వంటి పదాలు తొలగించాలని.. అలాగే '3 వేల సంవత్సరాల గులామీ' అనే డైలాగ్‌ను 'కొన్ని సంవత్సరాలు గులామీ'గా మార్చాలని ఆదేశించింది. దీనికి అనురాగ్ అంగీకరించకపోవడంతో ఈ సినిమా విడుదల ఆపాలంటూ బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సినిమాలో ఫూలే పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ నటిస్తుండగా.. అతని భార్య సావిత్రి బాయి ఫూలే పాత్రలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు భార్య పత్రలేఖ నటించారు.






















