Mobile Banking Virus Alert: సొమ్మంతా కొల్లగొడుతున్న SOVA బ్యాంకింగ్ మాల్వేర్, బీ కేర్‌ఫుల్
బ్యాంకింగ్ యాప్‌లు, క్రిప్టో వాలెట్‌లు సహా 200 పైగా ఎక్కువ మొబైల్ అప్లికేషన్లను SOVA కొత్త వెర్షన్ లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.
Mobile Banking Virus Alert: స్మార్ట్ ఫోన్లలోకి కొత్త రకం మొబైల్ బ్యాంకింగ్ మాల్వేర్ చొరబడుతోంది. దాని పేరు సోవా ఆండ్రాయిడ్ ట్రోజన్ (SOVA Android Trojan). దీని లక్ష్యం మీ బ్యాంక్ వివరాలు తెలుకుని స్కామర్‌కు (Scammer) చేరవేయడం. ఫైనల్‌గా మీ బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేయడం.
ఈ ట్రోజన్ గురించి చాలా బ్యాంకులు బ్యాంకులు ఇప్పటికే తమ ఖాతాదారులను అప్రమత్తం చేశాయి. అధికారిక యాప్ స్టోర్ల నుంచి తప్ప, మరే ఇతర మార్గాల్లో యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని సూచించాయి.
SMS ద్వారా
ఈ మాల్వేర్ SMS ద్వారా మీ ఫోన్‌లోకి జొరపడుతుంది. బ్యాంక్ పేరిటో, ఇతర పద్ధతిలోనో ఆశ పెడుతూ మీ ఫోన్‌కు స్కామర్లు ఒక మెసేజ్ పంపుతారు. అందులోని లింక్‌ను క్లిక్ చేయమని పేర్కొంటారు. ఆ లింకే మీ బ్యాంక్ బ్యాలెన్స్‌కు ఉరితాడు. ఆశపడో, తొందరపడో సదరు లింక్ మీద మీరు క్లిక్ చేసిన ఒక్క సెకనులోపే, మాల్వేర్ మీ ఫోన్‌లోకి దూరిపోతుంది.
వినియోగదారులు తమ నెట్ బ్యాంకింగ్ యాప్‌లకు లాగిన్ అయినప్పుడు, బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేసినప్పుడు ఈ మాల్వేర్ మన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర ఆధారాలను తస్కరిస్తుంది. ఆ వివరాలను చక్కగా హ్యాకర్ చేతికి పంపుతుంది. బ్యాంకింగ్ యాప్‌లు, క్రిప్టో వాలెట్‌లు సహా 200 పైగా ఎక్కువ మొబైల్ అప్లికేషన్లను SOVA కొత్త వెర్షన్ లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ మాల్వేర్ చాలా చేస్తుంది
కీ స్ట్రోక్స్‌ను ( కీ ప్యాడ్ మీద మీరు నొక్కే 'కీ'స్) సేకరించడం, కుకీలను దొంగిలించడం, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (MFA) టోకెన్లు మీకు రాకుండా ఆపడం, వెబ్ క్యామ్ నుంచి స్క్రీన్‌షాట్లను తీయడం, వీడియో రికార్డ్ చేయడం, ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ సర్వీస్‌ను ఉపయోగించి స్క్రీన్ క్లిక్, స్వైప్ మొదలైనవి చేయడం, కాపీ, పేస్ట్ చేయడం, 200 పైగా బ్యాంకింగ్, పేమెంట్ అప్లికేషన్లను అనుకరించడం వంటివి ఈ మాల్వేర్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లోని మొత్తం డేటాను ఎన్‌క్రిప్ట్ చేసే సత్తా కూడా ఈ మాల్వేర్‌కు ఉంది. అంటే, మీ ఫోన్‌ను సదరు స్కామర్ బ్లాక్ చేస్తాడు, తాను అడిగిన డబ్బు ఇస్తేనే లాక్ రిలీజ్ చేస్తాడు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank), కరూర్ వైశ్యా బ్యాంక్ (Karur Vysya Bank) సహా చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు అలెర్ట్స్ పంపుతున్నాయి లేదా ఈ మాల్వేర్‌కు సంబంధించి సలహాలు జారీ చేసే పనిలో ఉన్నాయి.
జాగ్రత్త ఎలా?
థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌ల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోకూడదు.
ఆండ్రాయిడ్ డివైజెస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.
మనకు తెలీని వెబ్‌సైట్ల జోలికి వెళ్లవద్దు.
అనుమానాస్పద లింక్‌లను అస్సలు క్లిక్ చేయవద్దు.
నకిలీ-నిజమైన SMSకు తేడా
మీ ఫోన్‌కు ఏదైనా అపరిచిత నంబర్ నుంచి మెసేజ్ వస్తే, ముందు ఆ నంబర్‌ను పరిశీలించండి. అది ఫోన్ నంబర్‌లాగే కనిపిస్తోంది గానీ ఫోన్ నంబర్ కాదు అనుకుంటే అది కచ్చితంగా ఫిషింగే. ఎందుకంటే స్కామర్లు వాళ్ల అసలు ఫోన్ నంబర్‌ను బహిర్గతం చేయరు. ఈమెయిల్-టు-టెక్ట్స్ సర్వీస్‌ను ఉపయోగించి వాళ్ల గుర్తింపు బయటపడకుండా జాగ్రత్త పడతారు. నిజంగా బ్యాంకుల నుంచే SMS వస్తే, ఫోన్ నంబర్‌కు బదులుగా బ్యాంక్ చిహ్నం లేదా సెండర్ ఐడీ (బ్యాంక్ పేరు చిన్నగా ఉంటుంది) కనిపిస్తుంది.
మీ ఫోన్‌లో యాంటీ వైరస్, యాంటీ స్పైవేర్ సాఫ్ట్‌వేర్ తప్పనిసరిగా ఉండడమే మీ సొమ్ముకు శ్రీరామరక్ష. ఈ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండడం కూడా తప్పనిసరి. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్‌లో అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే, తక్షణం బ్యాంక్ అధికారులను సంప్రదించండి.