Income Tax: ఇన్‌కమ్ టాక్స్ కట్టడంలో వీళ్లు తోపులు - ఖజానాలో పెద్ద షేర్ వాళ్లదే
Direct Tax: ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో దేశంలోని రాష్ట్రాలు, యూటీల నుంచి రూ. 19.62 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను ఖజానాకు వచ్చింది. ఇందులో మహారాష్ట్ర వాటా 39 శాతం.
Direct Tax Collection Data: ఉత్తరప్రదేశ్ జనాభా పరంగా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా ఉన్నప్పటికీ, ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో దేశంలోని చాలా రాష్ట్రాల కంటే వెనుకబడి ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) విడుదల చేసిన టాక్స్ కలెక్షన్ డేటా ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో (Direct Tax Collections) ఉత్తరప్రదేశ్ కేవలం రూ. 48,333.44 కోట్లు మాత్రమే అందించింది. జనాభా పరంగా దేశంలో రెండో అతి పెద్ద రాష్ట్రమైన బీహార్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,692.73 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నును వసూలు చేసింది. ఇది, 2022-23 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ. 6,845.32 కోట్ల కన్నా తక్కువ.
ప్రత్యక్ష పన్నుల్లో ఆదాయ పన్ను (Income Tax), కార్పొరేట్ పన్ను (Corporate Tax), మినిమమ్ ఆల్టర్‌నేట్ టాక్స్ (MAT), ఆల్టర్‌నేట్ మినిమమ్ టాక్స్ (AMT), కార్పొరేట్ గెయిన్స్ టాక్స్ (CGT), సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ టాక్స్ (STT), డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ (DDT), సంపద పన్ను (Wealth Tax) వంటివి ఉంటాయి.
పన్నులు చెల్లించడంలో మహారాష్ట్రది మొదటి స్థానం
ప్రత్యక్ష పన్ను వసూళ్ల డేటా ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో (FY23) అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 19.62 లక్షల కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్ను వసూలైంది. ఇందులో అత్యధిక భాగం మహారాష్ట్రది. ఆ ఫైనాన్షియల్ ఇయర్‌లో, మహారాష్ట్ర నుంచి ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.7.62 లక్షల కోట్లు వచ్చాయి. అంటే, మొత్తం డైరెక్ట్ టాక్స్ కలెక్షన్స్‌లో ఒక్క మహారాష్ట్ర వాటానే 39 శాతం. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌తో పోలిస్తే, కేంద్ర ప్రభుత్వ ఖజానాలోకి మహారాష్ట్ర 15 రెట్ల ఎక్కువ డబ్బు తీసుకొచ్చింది.
రెండో స్థానంలో కర్ణాటక, మూడో స్థానంలో దిల్లీ
ప్రత్యక్ష పన్నుల చెల్లింపులో మహారాష్ట్ర తర్వాత కర్ణాటక రెండో స్థానంలో ఉంది. FY 2023-24లో ఈ సదరన్ స్టేట్ రూ. 2.35 లక్షల కోట్లను ప్రత్యక్ష పన్నుల రూపంలో చెల్లించింది. రూ. 2.03 లక్షల కోట్లను సెంట్రల్ గవర్నమెంట్ బొక్కసానికి అందించిన దేశ రాజధాని దిల్లీ మూడో స్థానంలో ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, రూ. 1.27 లక్షల కోట్ల కాంట్రిబ్యూషన్‌తో తమిళనాడు ఫోర్త్ ప్లేస్‌లో నిలిచింది.
రూ. 93,300 కోట్ల ప్రత్యక్ష పన్నుల సహకారంతో గుజరాత్ ఐదో స్థానంలో, రూ. 84,439 కోట్ల రికవరీతో తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నాయి. హరియాణా ఏడో స్థానంలో ఉంది, డైరెక్ట్ టాక్స్‌ల కింద రూ. 70,947.31 కోట్లు అందించింది. దీని తర్వాత పశ్చిమ బెంగాల్ రూ. 60,374.64 కోట్లతో 8వ గడిలో నిలబడింది. ఈ 8 రాష్ట్రాల తర్వాత గానీ ఉత్తరప్రదేశ్ వంతు రాలేదు. దేశంలోనే అత్యధిక జనాభాతో కిటకిటలాడుతున్న యూపీ, FY 2023-24లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
గత పదేళ్లలో 182% పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
CBDT డేటా ప్రకారం... 2014-15 ఆర్థిక సంవత్సరంలో (FY15) మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.96 లక్షల కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో (FY24) ఈ మొత్తం రూ.19.60 లక్షల కోట్లకు పెరిగింది. అంటే, మోదీ ప్రభుత్వ హయాంలోని ఈ పదేళ్లలో డైరెక్ట్ టాక్స్ కలెక్షన్స్ సుమారు రూ. 12.64 లక్షల కోట్లు పెరిగాయి. ఇది ఉప్పెన లాంటి 182 శాతం వృద్ధికి సమానం.
మరో ఆసక్తికర కథనం: బంగారం, వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పాత రికార్డ్‌లన్నీ గల్లంతు