YS Jagan News : రౌడీ షీటర్ చేతిలో హత్యకు గురైన యువతి ఫ్యామిలీకి జగన్ సాయం- ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్
Andhra Pradesh News: రౌడీ షీటర్ చేతిలో గాయపడి మృతి చెందిన ఫ్యామిలీని వైఎస్ జగన్ పరామర్శించారు. పది లక్షలు సాయం చేస్తానని ప్రకటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం క్షమాణ చెప్పాలని డిమాండ్ చేశారు.
YS Jagan Visits Guntur: గుంటూరు జీజీహెచ్‌లో సహానా కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఆమె ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆసుపత్రి ఎదుట మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బాధిత కుటుంబానికి వైసీపీ తరఫున పది లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు.
రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలకు సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత జగన్. ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని ఎవరికీ రక్షణ లేదని ఆరోపించారు. రెడ్‌బుక్ పాలన సాగుతోందని పోలీసు అధికారులు కూడా వాళ్లకే వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. అందుకు సహానా ఉదంతమే ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఆ కుటుంబానికి చంద్రబాబు క్షమాపణ చెప్పి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ధైర్యంగా ఉండేదని అన్నారు వైఎస్ జగన్. దిశ యాప్ ద్వారా వాళ్లకు భరోసా కల్పించామని ఫోన్ చేసిన క్షణాల్లో సాయం అందేదని చెప్పుకొచ్చారు. వైసీపీకి మంచి పేరు వస్తుందని ఆ యాప్‌ను పక్కన పడేశారని ఆరోపించారు. కక్ష సాధింపుల్లో ఉన్న ప్రభుత్వం... శాంతిభద్రతలను పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే టీడీపీ మద్దతుదారులు రెచ్చిపోయి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు.
Also Read: బాధ్యత లేని జగన్ మరోసారి మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నారు- వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు
సహానా కేసులో నిందితుడు నవీన్‌ను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతన్నాయని ఆరోపించారు జగన్. చంద్రబాబుతో నిందితుడు కలిసి దిగిన ఫొటోలను మీడియాకు చూపించారు. స్థానిక ఎంపీతో కూడా కలిసి ఉన్న విషయాన్ని వివరించారు. యువతిపై పాశవికంగా దాడి చేసి గాయపరిచినా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని అన్నారు. దీనిపై స్థానికి మంత్రిగా, హోంమంత్రిగా స్పందించలేదన్నారు. తన టూర్ ఖరారు అయిన తర్వాత స్థానిక లీడర్ ఆలపాటి రాజా వచ్చి బాధితులను పరామర్శించారని ఎద్దేవా చేశారు.
ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో చోట జరుగుుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. బద్వేలులో, శ్రీకాకుళం జిల్లాలో ఇలా ప్రతి చోటా కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. టీడీపీకి చెందిన వ్యక్తులే పలాసలో బాలికలపై, జనసేన మద్దతుదారులు పిఠాపురంలో మహిళపై అత్యాచారం చేశారని తెలియజేశారు. హిందూపురంలో అత్తాకోడలిపై అత్యాచారం చేశారని ఇలా రోజూ ఇలాంటివి చూస్తున్నా వారికి ధైర్యం చెప్పే పరిస్థితి లేదన్నారు. బాధితులను పరామర్శించేందుకు కూడా నాయకులకు తీరిక లేదా అనిప్రశ్నించారు. స్థానిక నాయకుల ఒత్తిడితో పోలీసులు ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదని ఆరోపించారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో 77 మంది మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయని లెక్కలతో వివరించారు. ఏడుగురిని హత్య చేశారని మరో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.దిశ యాప్ ఉంటే పది నిమిషాలల్లో సాయం అందేదని... తమ హయాంలో అలా 31వేల మందిని కాపాడామన్నారు జగన్. 18 దిశ పోలీస్ స్టేషన్లు, 13 పోక్సో కోర్టులు ఏర్పాటు చేశారమని ప్రతీ జిల్లాకు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను పెట్టామని వివరించారు. ఇలా చేసిందుకే దిశ యాప్‌కు 19 అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. అలాంటి దిశ యాప్‌ను ప్రభుత్వం పక్కన పెట్టేసి మహిళలకు భరోసా ఇవ్వలేకపోతోందని ఆరోపించారు.
మూడు రోజుల క్రితం రౌడీషీటర్ నవీన్ చేతిలో గాయపడిన యువతి మధిర సహాన చికిత్స పొందుతూ మృతి చెందింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సహానను నవీన్ దాడి చేశారు. ఈ దాడిలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఆమె గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.