Vasireddy Padma Comments On Jagan: బాధ్యత లేని జగన్ మరోసారి మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నారు- వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh: నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడికి ప్రజాస్వామ్యంలో చోటు లేదు, మొన్నటి ఎన్నికల్లో అదే స్పష్టమైందని జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు వాసిరెడ్డిపద్మ.
వైఎస్‌ఆర్‌సీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలకంగా ఉంటూ ప్రత్యర్థులపై మాటల దాడి చేసే వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. గుడ్‌బై చెబుతూనే జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన బాధ్యత లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు.
వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు మీడియాకు లేఖ విడుదల చేసిన వాసిరెడ్డి పద్మ... అందులో ఇలా రాసుకొచ్చారు."వైయస్ఆర్‌సీపీకి రాజీనామా చేస్తూ మీడియా ద్వారా తెలియచేస్తున్నాను. పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ ‘గుడ్ బుక్’, ప్రమోషన్లు అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్ బుక్’ కాదు “ గుండె బుక్ ”. వారికి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదు. జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ ‘గుడ్ బుక్’ పేరుతో మరోసారి మోసం చెయ్యడానికి సిద్ధపడుతున్నారు."అని విమర్శలు చేశారు.
బాధ్యతల లేని వ్యక్తి అని వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు చేశారు. "పార్టీని నడిపించడంలో జగన్‌కి బాధ్యత లేదు. పరిపాలన చేయడంలో బాధ్యత లేదు. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడిని ప్రజలు మెచ్చుకోరనే విషయం ఈ ఎన్నికల తీర్పుతో స్పష్టమైంది"
తనకు ఎన్ని అసంతృప్తులు ఉన్నప్పటికీ నిబద్దత కలిగిన నేతగా తాను పార్టీ కోసం పని చేశాను అన్నారు వాసిరెడ్డి పద్మ. "వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పని చేశాను. ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మథనం చెంది వైఎస్‌ఆర్‌సీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేస్తున్నాను. అని పేర్కొన్నారు.