Maharashtra Municipal Election Result: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేటి సాయంత్రానికి రానున్నాయి. BMC ఎన్నికల్లో 227 సీట్ల కోసం 1700 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 29 కార్పొరేషన్లలో 15,931 మంది భవితవ్యం నేడు తేలుతుంది.

Maharashtra Municipal Election Result | ముంబై: మహారాష్ట్రలో 29 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం గురువారం (జనవరి 15)న ఎన్నికలు నిర్వహించారు. పండుగ నాడు మహారాష్ట్ర ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 893 వార్డులలోని 2,869 సీట్ల కోసం ఉదయం 7:30 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5:30 గంటలకు ముగిసింది. నేడు (జనవరి 16న) ఓట్ల లెక్కింపు జరిపి విజేతల్ని ప్రకటించనున్నారు. 15,931 మంది అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు మరికొన్ని గంటల్లో తేలనుంది.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలలో 227 సీట్ల కోసం మొత్తం 1,700 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారి భవితవ్యం EVMలలో నిక్షిప్తమైంది. 2022లో శివసేన విభజన తర్వాత జరిగిన మొదటి BMC ఎన్నికలు ఇవి. అవిభాజ్య శివసేన దేశంలోని అత్యంత ధనికమైన BMCని 25 సంవత్సరాల పాటు పాలించింది. 2017 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ అత్యధికంగా 1099 సీట్లను గెలుచుకుంది.
2017 ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు
గతంలో మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2017లో నిర్వహించారు. రాష్ట్రంలోని 1099 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. ఇది మొత్తం సీట్లలో 31.3 శాతం. గత ఎన్నికల్లో అవిభాజ్య శివసేన 489 సీట్లకు పరిమితమైంది. ఇది 18.49% శాతం. కాంగ్రెస్ 439 సీట్లు గెలుచుకుంది. మొత్తం సీట్లలో ఇది 15.53 శాతం. అవిభాజ్య NCP 294 సీట్లు నెగ్గింది. ఇది 11.06 శాతం. ఇతర పార్టీలు 294 సీట్లు గెలుచుకున్నాయి.
- బీజేపీ-1099- (31.3%)
- శివసేన- 489(18.49%)
- కాంగ్రెస్- 439 (15.53%)
- ఎన్సీపీ- 294 (11.06%)
- ఇతరులు- 415
6 సంవత్సరాల తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు
మహారాష్ట్రలో మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆరు సంవత్సరాల తర్వాత జరిగాయి. ఎన్నికల పోరులో ఛత్రపతి శంభాజీనగర్, నవీ ముంబై, ముంబై, వసాయి-విరార్, కళ్యాణ్-డోంబివలి, కొల్హాపూర్, నాగ్‌పూర్, సోలాపూర్, అమరావతి, అకోలా, నాసిక్, థానే, పింప్రి-చించ్‌వాడ్, పూణే, ఉల్హాస్‌నగర్, చంద్రపూర్, పర్భాని, మీరా-భయందర్, నాందేడ్-వాఘాలా, పన్వేల్, పాండే భివాండి-నిజాంపూర్, జల్గావ్, అహ్లియానగర్, లాతూర్, మాలేగావ్, సాంగ్లీ-మిరాజ్-కుప్వాడ్, ధూలే, జల్నా, ఇచల్కరన్జీ ఉన్నాయి.
BMCలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసింది?
ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంపిణీ ప్రకారం బీజేపీ 137 సీట్లలో, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 90 సీట్లలో పోటీ చేశాయి. మహాయుతి భాగస్వామి అజిత్ పవార్ నేతృత్వంలోని NCP 94 సీట్లలో స్వతంత్రంగా పోటీ చేసింది. శివసేన (UBT) 163 మంది అభ్యర్థులను, MNS 52, కాంగ్రెస్ 143, VBA 46 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాంగ్రెస్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 1,263 మంది అభ్యర్థులను నిలబెట్టింది. నేడు (జనవరి 16న) మరికొన్ని గంటల్లో అభ్యర్థులు అందరి భవితవ్యం ఈవీఎం ఓట్ల లెక్కింపు ద్వారా తేలనుంది.























