AP Politics: టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు - కండువా కప్పిన చంద్రబాబు
Andhra Pradesh News | వైసీపీ మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఇద్దరు ఇటీవల వైసీపీకి, పదవులకు రాజీనామా చేశారు.
Mopidevi And Beeda Masthan Rao Joins TDP: సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkata Ramana), బీద మస్తాన్‌రావు అధికార పార్టీ టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి చంద్రబాబు వారిని టీడీపీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఆగస్టు నెలాఖరులో వీరిద్దరూ అటు రాజ్యసభ సభ్యత్వానికి, ఇటు వైసీపీకి రాజీనామా చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకిచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరి పచ్చ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కొందరు మంత్రులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ విజయంతో అన్ని రాజ్యసభ స్థానాలను ఒక్కొక్కటిగా వైసీపీ సొంతం చేసుకుంది. ఏపీకి రాజ్యసభలో మొత్తం 11 స్థానాలున్నాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక విడతల వారీగా అన్నీ రాజ్యసభ స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. ఓ దశలో సంఖ్యాపరంగా రాజ్యసభలో నాలుగో అతి పెద్ద పార్టీగా మాజీ సీఎం జగన్ పార్టీ వైసీపీ అవతరించింది. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో సీన్ రివర్స్ అయింది. వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా ఎంపీలు, ఎమ్మెల్సీలు టీడీపీ, జనసేనలో చేరుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. చివరగా ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి, బీద మస్తాన్ రావు పార్టీకి, పదవులకు రాజీనామా చేశారని తెలిసిందే.