Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళే యజమాని - అక్టోబరు 3 నుంచి పైలెట్ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Telangana Family Digital Cards | తెలంగాణలో ప్రతి ఒక్కరికి డిజిటల్ కార్డులు అందించనున్నారు. కుటుంబానికి ఇచ్చే డిజిటల్ కార్డులో మహిళే యజమానికిగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
Family Digital Cards | హైదరాబాద్: కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మహిళ ఇంటి యాజమాని కాగా, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచనున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు (ఎఫ్‌డీసీ) సంబంధించి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం (సెప్టెంబర్ 28న) సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సెప్టెంబర్ 25 నుంచి 27 వ తేదీ వరకు కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానాల్లో పర్యటించిన అధికారులు చేసిన అధ్యయనంపై ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. డిజిటల్ కార్డుల రూపకల్పలో ఆయా రాష్ట్రాలు ప్రజల నుంచి సేకరించిన వివరాలు, కార్డు ద్వారా కలిగే ప్రయోజనాలు, లోపాలను అధికారులు సీఎంకు వివరించారు.
డిజిటల్ కార్డుల రూపకల్పనపై రేవంత్ ఆదేశాలు
అనంతరం ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాలలో కార్డుల రూపకల్పనతో పాటు వాటి జారీలో ప్రయోజనకరంగా ఉండే అంశాలను స్వీకరించాలన్నారు. ప్రజల నుంచి బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పని లేదని సీఎం రేవంత్ సూచించారు.
పూర్తి అంశాలతో సమగ్ర జాబితా
ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా రెండు ప్రాంతాల్లో డిజిటల్ కార్డులకు సమచారం సేకరించనున్నారు. డిజిటల్ కార్డుల్లో ఏయే వివరాలు పొందుపర్చాలి, అప్‌డేట్‌కు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహలతో కూడిన మంత్రివర్గ ఉప సంఘానికి ఆదివారం సాయంత్రంలోగా అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు డిజిటల్ కార్డుల్లో జత చేయాల్సిన, తొలగించాల్సిన అంశాలతో సమగ్ర జాబితా రూపొందించనున్నారు.
మొత్తం 119 నియోజకవర్గాల్లో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయనున్నారు. (పూర్తిగా గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గాల్లో 2 గ్రామాలు, పూర్తిగా పట్టణ/నగర ప్రాంతాలు ఉన్న నియోజకవర్గాల్లో రెండు వార్డులు/ డివిజన్లను అధికారులు ఎంపిక చేస్తారు.) కుటుంబాల నిర్ధరణ, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల (Family Digital Cards) వివరాల కోసం అందుబాటులో ఉన్న డాటాతో అక్టోబరు 3 నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి (Door To Door) పరిశీలన చేయించాలని సీఎం సూచించారు. పైలెట్ ప్రాజెక్టును పకడ్బందీగా చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి అధికారిని, పట్టణ/నగర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించాలని సూచించారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇటీవల వరదల వచ్చిన సమయంలో వేసిన సీనియర్ అధికారులు పర్యవేక్షకులుగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏ తప్పిదాలు లేకుండా చూడాలని సీఎం రేవంత్ హెచ్చరించారు. ఈ సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read: Hydra Ranganath: హైడ్రా సైలెంట్‌గా లేదు- మల్లారెడ్డి, ఒవైసీల కాలేజీలు కూల్చివేతపై రంగనాథ్ క్లారిటీ