Ram Mohan Naidu Yashas Jet Flight Journey | జెట్ ఫ్లైట్ నడిపిన రామ్మోహన్ నాయుడు | ABP Desam
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తన కలను నెరవేర్చుకున్నారు. బెంగుళూరులో జరుగుతున్న ఏరో ఇండియా 2025లో భాగంగా యశస్ అనే యుద్ధవిమానాన్ని నడిపారు రామ్మోహన్ నాయుడు. హెచ్ఏఎల్ తయారు చేసిన హెచ్ జే టీ 36 యుద్ధవిమానం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన జెట్ ఫ్లైట్. ఆత్మనిర్భర భారత్ లక్ష్యసాధనలో ప్రధానమంత్రి మోదీ ఆదేశాల మేరకు ఇలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మనమే సొంతంగా యుద్ధ విమానాలు చేసుకోవటం గొప్పవిషయమన్న రామ్మోహన్ నాయుడు..యశస్ లో ప్రయాణించటం తన జీవితంలో మర్చిపోలేరన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ " ఏరో ఇండియా-2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపడం.. మరచిపోలేని అనుభూతినిచ్చింది. హెచ్ఏఎల్ స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన హెచ్ జేటీ-36 'యశస్' అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించింది. విమానయాన, రక్షణ తయారీలో రోజురోజుకూ పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనం. ప్రధాని నరేంద్రమోదీ గారి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉంది" అన్నారు.





















