ICC Champions Trophy: ఆసీస్ కు కొత్త కెప్టెన్.. జట్టును వేధిస్తున్న గాయాలు.. కొత్త ఆటగాళ్లతో బరిలోకి..
2009లో రికీ పాంటింగ్ నాయకత్వంలో చివరిసారిగా ఈ టోర్నీ నెగ్గిన కంగారూలు.. ఆ తర్వాత ఫైనల్ కు కూడా చేరుకోలేకపోయారు. ఈసారి ఎలాగైనా టోర్నీని గెలుద్దామనుకున్నా, గాయాలు టీమ్ ను సతమతం చేస్తున్నాయి.

Steve Smith Captain: మూడోసారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న ఆస్ట్రేలియాకు అన్ని అపశకునాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్ గాయాల కారణంగా మెగాటోర్నీకి దూరమవ్వగా, తాజాగా వ్యక్తిగత కారణాలతో స్టార్ పేసర్ మిషెల్ స్టార్క్ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అలాగే స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డాన చందాన మరో స్టార్ ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ కూడా గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. దీంతో దాదాపు కొత్త ముఖాలతోనే ఈ మెగాటోర్నీలో ఆసీస్ ఆడనుంది.
2009లో రికీ పాంటింగ్ నాయకత్వంలో చివరిసారిగా ఈ టోర్నీ నెగ్గిన కంగారూలు.. ఆ తర్వాత కనీసం ఫైనల్ కు కూడా చేరుకోలేకపోయారు. ఈసారి ఎలాగైనా టోర్నీని దక్కించుకుందామని భావించినా, ఆటగాళ్ల గాయాలు టీమ్ ను సతమతం చేస్తున్నాయి. ఇక కమిన్స్ దూరం కావడంతో జట్టు కెప్టెన్ అనుభజ్ఞుడైన స్టీవెన్ స్మిత్ ను ప్రకటించారు.
Mitchell Starc Withdraws From Champions Trophy, Steve Smith To Lead Reshuffled Australia Squad#MitchellStarc #ChampionsTrophy #SBM https://t.co/FTycqWHM2q
— SBM Cricket (@Sbettingmarkets) February 12, 2025
ప్రైవసీని గౌరవిస్తాం..
మెగాటోర్నీకి స్టార్క్ దూరం కావడం చాలా బాధకరమని, అయితే అతని వ్యక్తిగత ప్రైవసీని గౌరవించి, కారణాలు బయటకు చెప్పడం లేదని ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ వ్యాఖ్యానించాడు. ఇక జట్టులో కొత్త ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని వారిని సీనియర్లు నడిపిస్తారని, సత్తా చాటుకోవడానికి ఇది మంచి తరుణమని తెలిపాడు. టోర్నీలో వివిధ ప్రత్యర్థులకు తగినట్లుగా జట్టు కూర్పు చేసేంత ఆటగాళ్లు తమ వద్ద ఉన్నారని పేర్కొన్నాడు. బుధవారం నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే రెండు వన్డేల సిరీస్ కు కూడా స్టార్క్ దూరమయ్యాడని తెలిపాడు.
గతేడాది భారత్ తో 5 టెస్టుల సిరీస్ నుంచి మొదలుకుని, ఇటీవల లంకతో జరిగి రెండు టెస్టుల సిరీస్ వరకు స్టార్క్ నిరంతరాయంగా ఆడాడని గుర్తు చేశాడు. ముగ్గురు ప్రధాన పేసర్లు దూరం కావడంతో సీన్ అబాట్ తోో కలిసి స్పెన్సర్ జాన్సన్, నాథన్ ఎల్లిస్, బెన్ డ్వార్షియస్ లు పేస్ బాధ్యతలు మోస్తారు. సీమ్ ఆల్ రౌండర్ గా ఆరోన్ హార్డీ ని జట్టులోకి తీసుకున్నారు. ఈనెల 19 నుంచి పాక్ లో ప్రారంభమయ్యే ఈ మెగాటోర్నీలో గ్రూప్-బిలో ఆసీస్ ఆడనుంది. ఇందులో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్గానిస్థాన్ జట్లు ఆడుతున్నాయి.
ఆస్ట్రేలియా స్క్వాడ్: స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కేరీ, బెన్ డ్వార్‌షియస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేసర్ మెక్ గర్క్, ఆరోన్ హార్డి, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, తన్వీర్ సంఘా, మథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.




















