IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
IBOMMA: ఐబొమ్మ రవి కస్టడీలో పోలీసులు కీలకమైన విషయాలు రాబట్టారు. విచారణలో సహకరించకపోయినా చాకచక్యంగా చాలా విషయాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది.

Police uncover crucial information in Ibomma Ravi custody: 'ఐబొమ్మ' ఇమ్మడి రవి పోలీస్ కస్టడీ ముగిసింది. సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని నాంపల్లి కోర్టు ముందు హాజరు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రవిని చంచల గూడ జైలుకు తరలించారు. నవంబర్ 27న మళ్లీ కోర్టు ముందు హాజరు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో రవి ఒక్కడే పైరసీ కార్యకలాపాలు నడిపాడని, రూ.100 కోట్లకు పైగా సంపాదించాడని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. మంగళవారం బెయిల్ విచారణ జరగనుంది.
తెలుగు సినిమాల పైరసీలో పెద్ద షేర్ కలిగిన 'ఐబొమ్మ' వెబ్‌సైట్‌ను ఇమ్మడి రవి (25) ఒక్కడే నడిపాడని పోలీసులు ధృవీకరించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసులో ఐదు కేసులు నమోదు చేశారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా సినిమాలు కొనుగోలు చేసి, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేవాడు. సినిమా లింక్ క్లిక్ చేస్తే 15 బెట్టింగ్ యాప్స్‌కు డైరక్ట్ అయి ఆ తర్వాత డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ కనిపించేది. ఈ విధంగా రవి రూ.100 కోట్లకు పైగా సంపాదించాడు. బ్యాంక్ లావాదేవీల్లో రూ.30 కోట్లు మాత్రమే ట్రాక్ అయ్యాయి.
1xbet వంటి బెట్టింగ్ యాప్‌ల ద్వారా మరింత డబ్బు సంపాదించి, స్నేహితుడికి క్రిప్టోకరెన్సీ ద్వారా బదిలీ చేసేవాడు. పోలీసుల విచారణలో రవి తన వెనుక ఎవరూ లేరని చెప్పాడు. సైబర్ క్రైమ్ పోలీసులు వెబ్‌సైట్, డొమైన్ నెట్‌వర్క్‌లు, IP మాస్కింగ్, టెక్నికల్ ఆపరేషన్లు, డేటా హైడింగ్, సర్వర్ యాక్సెస్ వంటివి దర్యాప్తు చేశారు. బ్యాంక్ అధికారుల సహాయంతో రూ.20 కోట్ల ట్రాన్స్‌ఫర్ వివరాలు సేకరించారు. రవిని సినిమా పైరసీ కేసుల్లో అరెస్ట్ చేసిన తర్వాత, పోలీసులు ఐదు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. కస్టడీలో కీలక సమాచారం సేకరించారు. మొత్తం ఐదు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో పీటీ వారంట్లు దాఖలు చేశారు. పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత రవిని నంపల్లి కోర్టు ముందు హాజరు చేశారు.
రవి ఐదు రోజుల కస్టడీ ముగిసింది. రిమాండ్ రెండో రోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాం. కస్టడీ మంజూరు తర్వాత దాఖలు చేయడం వల్ల ఆలస్యం అయింది. మంగళవారం బెయిల్ విచారణ జరుగుతుంది. అతనిపై మొత్తం సెక్షన్‌లలో కేవలం రెండు మాత్రమే వర్తిస్తాయి. మిగిలినవి కోర్టులో పోరాటం చేస్తాం. బెయిల్ వస్తుందని నమ్ముతున్నామని రవి తరపు లాయర్ చెబుతున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ నవంబర్ 25న ప్రెస్‌మీట్ నిర్వహించి, కేసు వివరాలు వెల్లడించనున్నారు.





















