Telangana Bhu Bharati Scams: ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
Telangana Land Disputes: తెలంగాణలో భూ పరిపాలనను సంస్కరించే లక్ష్యంతో ధరణి కి ప్రత్యామ్నాయంగా భూభారతిని తీసుకువచ్చారు. ఈ పోర్టల్ ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది.

Dharani Vs Bhu Bharati: బీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి ఒక ప్రధాన కారణమైన ధరణి పోర్టల్‌లోని లోపాలను సరిదిద్ది, పారదర్శకమైన భూ రికార్డుల నిర్వహణ కోసం ప్రస్తుత ప్రభుత్వం భూభారతి ని ఎంతో ఆర్భాటంగా తీసుకువచ్చింది. అయితే, ఆచరణలో ఈ కొత్త వ్యవస్థ కూడా పాత రోగాలనే ప్రదర్శిస్తుండటం ఇప్పుడు రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల జనగామ, యాదాద్రి జిల్లాల్లో వెలుగుచూసిన చలాన్ల కుంభకోణం ఈ వ్యవస్థలోని సాంకేతిక లొసుగులను బట్టబయలు చేసింది. పేరు మార్చారు కానీ, అక్రమార్కులు చొరబడే మార్గాలను మాత్రం మూసివేయలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సాంకేతిక లొసుగులు - అక్రమార్కులకు వరప్రసాదం
భూభారతి వెబ్‌సైట్‌లో ఎడిట్ ఆప్షన్లను వాడుకుని నిందితులు ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల గండి కొడుతున్నారు. కేవలం సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో ఉన్న లోపాల వల్ల అక్రమార్కులు చలాన్ల విలువను మార్చి, ప్రభుత్వానికి తక్కువ డబ్బు చెల్లిస్తూ రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సింది పోయి, సమస్య బయటపడినప్పుడు మాత్రమే స్పందిస్తూ అండర్ ప్లే చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. లోపాలను ఆదిలోనే గుర్తించి అరికట్టడంలో ఐటీ విభాగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
రైతుల ఇక్కట్లు - తీరని భూ సమస్యలు
క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భూముల మార్పిడి, వారసత్వ సంక్రమణ, పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పుల సవరణ వంటి అంశాల్లో భూభారతి ఇంకా వేగం పుంజుకోలేదు. స్లాట్ బుకింగ్ దొరకకపోవడం, డాక్యుమెంట్లు అప్‌లోడ్ కాకపోవడం వంటి సాంకేతిక సమస్యలతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ధరణిలో ఉన్న సమస్యలే ఇక్కడా కొనసాగుతున్నాయి, మాకు ఒరిగిందేమిటి అని రైతులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ లోపించడం వల్ల మధ్యవర్తులు మళ్లీ రంగప్రవేశం చేసి రైతులను నిలువునా దోచుకుంటున్నారు.
రాజకీయ మూల్యం - ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుంటుందా
గత ఎన్నికల్లో ధరణిపై ఉన్న ప్రజా వ్యతిరేకతను బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువ అంచనా వేసి భారీ మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు అదే బాటలో భూభారతి వల్ల వచ్చే ఫిర్యాదులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భూమి అనేది సగటు మనిషికి అత్యంత సెంటిమెంట్ , ఆర్థిక మూలాధారం. అక్కడ చిన్న తప్పు జరిగినా అది పాలనపై తీవ్ర వ్యతిరేకతకు దారి తీస్తుంది. భూభారతి పట్ల పెరుగుతున్న అసంతృప్తిని ప్రభుత్వం సకాలంలో గుర్తించకపోతే, అది రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వానికి చేదు అనుభవాలను మిగిల్చే అవకాశం ఉంది.
అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థ ఎప్పుడు?
అసలు ఇలాంటి స్కాములు ఎందుకు జరుగుతున్నాయి? వ్యవస్థలో పారదర్శకత ఎక్కడ లోపిస్తోంది? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక పోర్టల్‌ను మార్చి మరొకటి తీసుకురావడం వల్ల ప్రయోజనం ఉండదు. అది పటిష్టమైన భద్రతతో, సామాన్యుడికి అర్థమయ్యేలా ఉండాలి. అధికారులు, ఐటీ నిపుణులు నిరంతరం పర్యవేక్షించని పక్షంలో ఏ వ్యవస్థ అయినా అక్రమార్కులకు అడ్డాగా మారుతుందన్న ఆందోళన కనిపిస్తోంది.





















