Bollywood legend Dharmendra Passed Away | బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర అస్తమయం | ABP Desam
అరవై ఏళ్ల పాటు బాలీవుడ్ ను హీ మ్యాన్ లా ఏలిన దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యం, వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ధర్మేంద్ర ఈరోజు ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర తిరిగి కోలుకుంటున్నారనుకుంటున్న తరుణంలో ఆయన మరణవార్త అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. హైసెక్యూరిటీ మధ్య ధర్మేంద్రను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 1935లో పంజాబ్ లోని నస్రాలీలో జన్మించిన ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కేవల్ క్రిషన్ డియోల్. 1960లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ధర్మేంద్ర...హిందీ సినిమాపై చెరగని ముద్ర వేశారు. ప్రత్యేకించి 1960 నుంచి 1980 వరకూ ఆయన బాలీవుడ్ లో తిరుగులేని మహారాజుగా ఎదిగారు. ఏడాదిలో తొమ్మిది సినిమాలు చేసి తొమ్మిది హిట్ గా నిలబెట్టిన ఘనత నేటికీ ధర్మేంద్ర పేరు మీదే ఉంది. మొత్తం 300 సినిమాల్లో నటించిన ధర్మేంద్ర చివరిగా నటించిన ఇక్కీస్ సినిమా ఈ డిసెంబర్ 25 న విడుదల కావాల్సింది. సినిమాల్లోకి రాకముందే ప్రకాశ్ కౌర్ ను పెళ్లి చేసుకున్న ధర్మేంద్రకు సన్నీడియోల్, బాబీ డియోల్, విజేతాడియోల్, అజీతా డియోల్ జన్మించారు. సన్నీ, బాబీ ఇద్దరూ తండ్రి వారసత్వాన్ని బాలీవుడ్ లో కొనసాగించారు. ఆ తర్వాత 1980లో హేమామాలినీని వివాహం చేసుకున్న ధర్మేంద్రకు మరో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఇషా డియోల్, అహనా డియాల్ లో ఇషా కూడా హీరోయిన్ గా రాణించారు. ధర్మేంద్ర సినీ రంగానికి అందించిన సేవలకు గానూ 2012 లో భారత ప్రభుత్వ పద్మభూషణ్ తో గౌరవించింది. కొద్ది కాలం పాటు రాజకీయాల్లోనూ ఉన్న ధర్మేంద్ర 2004లో బికనీర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచి ప్రజాసేవలోనూ గడిపారు.






















