AP Mega DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై ప్రభుత్వం కీలక ప్రకటన
Teacher Jobs in Andhra Pradesh | ఏపీలో మార్చి నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెలలో నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించారు.

AP DSC Notification | నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెగా డీఎస్సీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి నోటిఫికేషన్‌పై అప్ డేట్ ఇచ్చింది. ఈ మార్చిలో 16,247 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది జూన్ నెల పూర్తయ్యే నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది. జీఓ 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
టీచర్ల బదిలీలపై చట్టం..
గతంలో టీచర్లకు సంబంధించి 45 రకాల యాప్ లు ఉండేవి. మేం వాటిని మొత్తం కలిపి ఒకే యాప్ గా మార్చేశామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అలాగే త్వరలో టీచర్ల బదిలీల (AP Teacher Transfers) చట్టం తేనున్నట్లు పేర్కొన్నారు. టీచర్లకు ఒకే యాప్ తేవడం, టీచర్ల బదిలీలకు సంబంధించి చట్టం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వీటిపై బిల్లు పెడతారని తెలిపారు. రాష్ట్రంలో వీసీల నియామకం పూర్తయ్యాక అన్ని యూనివర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే..
విద్యాశాఖ మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. గతంలోలాగ కాకుండా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేలా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. కాగా, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 16,247 టీచర్ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు (School Assistants)- 7,725, సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) 6,371 పోస్టులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT) 1,781పోస్టులు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs) 286 పోస్టులు, వ్యాయామ ఉపాధ్యాయులు 132, ప్రిన్సిపాల్స్ పోస్టులు 52 ఉన్నాయి.
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. టీచర్ల బదిలీలలో అక్రమాలు జరిగాయని, పైగా పోస్టులు సైతం చాలా తక్కువగా ఉన్నాయని భావించిన చంద్రబాబు సర్కార్ మొదట గత జీవోలను, నోటిఫికేషన్లను రద్దు చేసింది. ఆపై టీచర్ల బదిలీలతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలుమార్లు స్పష్టం చేశారు.
Also Read: Pawan Kalyan: ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

