Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Kodangal News: లగచర్ల వివాదంలో కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదాన్ని వినిపిస్తోంది. అక్కడ వచ్చేవి ఫార్మా కంపెనీలు కావని ఇండస్ట్రీయల్ పార్క్‌లు అంటూ ప్రచారం చేస్తోంది.
Telangana News: తెలంగాణలో రాజకీయంగా కాక రేపుతున్న లగచర్ల ఘటనలో పెద్ద ట్విస్ట్ వెలుగు చూసింది. అక్కడ వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదని... ఇండస్ట్రీయల్, టెక్స్‌టైల్ పార్క్‌లు రాబోతున్నాయని స్థానిక వ్యక్తి నరసింహారెడ్డి వివిధ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. ఆయనను సమర్థిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ వీడియోలను షేర్ చేస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొండగల్‌లోని లగచర్లలో ఈ మధ్య జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్కడ ప్రభుత్వం చేపట్టే భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసి అధికారులను కొట్టారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులను వెంబడించారు. కార్లు ధ్వంసం చేశారు.
ఇది రాజకీయంగా తెలంగాణంలో తీవ్ర దుమారానికి కారణమైంది. అధికార ప్రతిపక్షాల మధ్య అగ్గిరాజేసింది. ప్రజల అభిప్రాయాన్ని కాదని ప్రభుత్వం దూకుడుగా వెళ్లడంతోనే ఈ సమస్య వచ్చిందని బీఆర్‌ఎస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి కావాలని అధికారులను కొట్టించారని ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. కేసులు పెట్టి ఏకంగా బీఆర్‌ెస్ మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసింది.
అక్కడ ప్రజలకు భూసేకరణ ఇష్టం లేదని చెప్పేందుకు ప్రతిపక్షం ప్రయత్నాలు చేస్తుంటే ఇదంతా బీఆర్‌ఎస్ కుట్రగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. ఈ విషయంలో అక్కడ ఫార్మా కంపెనీ వస్తుందని అంతా భావించారు. లగచర్ల, హకింపేట్, పోలేపల్లి గ్రామాల్లో ప్రజలకు కూడా ఇదే నమ్ముతున్నారు. ఫార్మా కంపెనీలు వస్తే తామంతా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని అనుకున్నారు.
తాజా కాంగ్రెస్ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. లగచర్ల, హకింపేట్, పోలేపల్లి గ్రామాల్లో వచ్చేది ఫార్మా కంపెనీ కాదని ప్రచారం చేస్తోంది. స్థానికంగా ఉండే వ్యక్తి నర్సింహా రెడ్డి ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ... లగచర్లలో వచ్చేది ఫార్మా కంపెనీ కాదని స్పష్టం చేశారు. సీఎంతో సమావేశం అయినప్పుడు ఈ విషయంపై క్లారిటీ తీసుకున్నట్టు చెప్పారు. ఇదే విషయంపై సీఎంను ప్రశ్నిస్తే ప్రజలకు ఇష్టం లేకపోతే ఇండస్ట్రీయల్ పార్క్ తీసుకొద్దామని అన్నట్టు వివరించారు.
🚨 Kodangal Facts
— Congress for Telangana (@Congress4TS) November 17, 2024
లగచర్ల, హకింపేట్, పోలేపల్లి గ్రామాలలో ఫార్మా కంపెనీ రావడం లేదు. ❌
ఇండస్ట్రియల్ పార్కు రాబోతుంది ✅#BRSExposed #LagcherlaIncident pic.twitter.com/OkDGMBEpYS
నర్సింహా రెడ్డి వివిధ ఛానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలని తెలంగాణ కాంగ్రెస్ తన అఫీషియల్ హ్యాండిల్ నుంచి షేర్ చేసింది. అవును అక్కడ వచ్చేవి ఫార్మా కంపెనీలు కావనే విషయాన్ని సమర్థించినట్టు రీ పోస్టు చేసింది. దీంతో ఇప్పటి వరకు జరుగుతున్న వివాదంలో ఇదే కొత్త మలుపుగా చెప్పుకొవచ్చు. ఎకరాకు రూ.18 లక్షల చొప్పున పరిహారం అదనంగా 150 గజాల ప్లాట్ కుటుంబంలో ఎన్ని జంటలు ఉంటే అన్ని జంటలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని అన్నారు.