KKR vs DC Match Highlights: పరుగుల వరద పారించిన కేకేఆర్, 106 రన్స్ తేడాతో ఢిల్లీపై ఘన విజయం
IPL 2024 KKR vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ పై పరుగుల వరద పారించిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ 106 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయాలతో కేకేఆర్ జోరు కొనసాగిస్తోంది.
![KKR vs DC Match Highlights: పరుగుల వరద పారించిన కేకేఆర్, 106 రన్స్ తేడాతో ఢిల్లీపై ఘన విజయం IPL 2024 KKR vs DC Kolkata Knight Riders beats Delhi Capitals by 106 Runs in Vizag KKR vs DC Match Highlights: పరుగుల వరద పారించిన కేకేఆర్, 106 రన్స్ తేడాతో ఢిల్లీపై ఘన విజయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/03/cb5d8a319dc7102e669f83acb460bf4f1712166447566233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విశాఖపట్నం: విశాఖ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక స్కోరు. 273 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో 166 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో 106 పరుగుల భారీ తేడాతో ఢిల్లీపై కేకేఆర్ గెలుపొందింది.
మన సాగరనగరం వైజాగ్ లో సునామీ వచ్చింది. కానీ అది కేవలం పీఎం పాలెం స్టేడియంలో మాత్రమే. కోల్ కతా బ్యాటర్లు వీరవిహారం చేశారు. వారి ధాటికి తమ ముందు పోస్ట్ అయిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ బ్యాటర్లు అద్భుతాలేం చేయలేదు. పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయారు. ఇక అంతే. మ్యాచ్ అక్కడే అయిపోయింది. చివరకు ఢిల్లీ 17.2 ఓవర్లలో 166 స్కోర్ చేసి, 106 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ వరుసగా రెండో మ్యాచ్ లో ఫిఫ్టీ కొట్టటం, అది కూడా తనదైన అటాకింగ్ స్టయిల్ లో ఆడటం, ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఫిఫ్టీ చేయటంతో.... ఓటమి అంతరం కాస్త తగ్గింది అంతే. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్ రెండు, సునీల్ నరైన్, రస్సెల్ చెరో వికెట్ తీశారు.
Match 16. Kolkata Knight Riders Won by 106 Run(s) https://t.co/SUY68b95dG #TATAIPL #IPL2024 #DCvKKR
— IndianPremierLeague (@IPL) April 3, 2024
కానీ అంతకముందు కోల్ కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దగ్గర్నుంచి ఒకటే బాదుడు. మొదటి రెండు ఓవర్లు కాస్త సైలంట్ గా ఉన్నారు కానీ, అప్పట్నుంచి నరైన్... బీభత్సం సృష్టించాడు. కుర్ర బౌలరా లేక అనుభవజ్ఞుడా అని చూడలేదు. ప్రతి ఒక్కరికీ బౌండరీ దారి చూపించాడు. 7 ఫోర్లు, 7 సిక్సులతో 85 స్కోర్ చేశాడు. ఇది తన అత్యధిక వ్యక్తిగత స్కోర్. మరోవైపు... కుర్ర బ్యాటర్ ఆంగ్ క్రిష్ రఘువంశీ... 200 స్ట్రయిక్ రేట్ తో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక చివర్లో రసెల్ తన మజిల్ పవర్ చూపించాడు. రింకూ సింగ్ కూడా చిన్నపాటి రచ్చ చేశాడు. రసెల్ 41, రింకూ 26 స్కోర్ చేశాడు. మొత్తం మీద కోల్ కతా 272 పరుగులు చేసి సన్ రైజర్స్ రికార్డ్ స్కోర్ 277కి ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయింది. వరుసగా మూడు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించడమే కాక, ఈ భారీ విజయంతో నెట్ రన్ రేట్ ను అద్భుతంగా మెరుగుపర్చుకున్న కోల్ కతా... పాయింట్స్ టేబుల్ లో టాప్ కు దూసుకెళ్లింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)