IND vs BAN Test: కోహ్లీతో జోక్సా! టీమ్‌ఇండియా నిర్ణయాలకు ఓ దండం - గావస్కర్
IND vs BAN Test: క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ టీమ్‌ఇండియా యాజమాన్యంపై విమర్శలు కురిపించాడు. రెండో ఇన్నింగ్సులో విరాట్ కోహ్లీ కన్నా అక్షర్ పటేల్‌ను ముందుగా పంపించడం ఏంటని ప్రశ్నించాడు.
IND vs BAN Test Axar Patels promotion:
క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ టీమ్‌ఇండియా యాజమాన్యంపై విమర్శలు కురిపించాడు. రెండో ఇన్నింగ్సులో విరాట్ కోహ్లీ కన్నా అక్షర్ పటేల్‌ను ముందుగా పంపించడం ఏంటని ప్రశ్నించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడైన విరాట్‌కు ఇది చెడు సంకేతం పంపిస్తుందని హెచ్చరించాడు. ఇకనైనా కుడి, ఎడమ కాంబినేషన్‌ను పక్కన పెడితే మంచిదని సూచించాడు. భారత్, బంగ్లా రెండో టెస్టు మూడో రోజు తర్వాత సన్నీ మీడియాతో మాట్లాడాడు.
'ఇది విరాట్ కోహ్లీకి ప్రతికూల సంకేతాలను పంపిస్తుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిని బ్యాటింగ్ ఆర్డర్లో కిందకు పంపించడం సరికాదు. కోహ్లీయే స్వయంగా అడిగితే అప్పుడు వేరే సంగతి. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాను. అయితే అక్షర్ పటేల్ బాగా ఆడాడు' అని సునిల్ గావస్కర్ అన్నాడు.
టీమ్‌ఇండియా (Team India) కుడి, ఎడమ కూర్పును పక్కన పెట్టాలని సన్నీ అన్నాడు. నాలుగో రోజు ఎవరు ఔటైనా రిషభ్ పంత్‌తో బ్యాటింగ్ చేయించాలని సూచించాడు. 'కుడి-ఎడమ కాంబినేషన్‌ను పట్టించుకోకుండా రేపు రిషభ్‌ను బరిలోకి దించండి. అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నా అతడినే పంపించండి. కుడి-ఎడమ ప్రయోగాలను ఆపేయండి' అని ఆయన పేర్కొన్నాడు. మైదానంలో టీమ్‌ఇండియా ఫీల్డింగ్ అస్సలు బాగాలేదని ఆయన విమర్శించాడు.
'ఆటగాళ్లు క్యాచులు వదిలేస్తే స్పిన్నర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. క్యాచులు మీదకే వచ్చాయి కదా! ఫీల్డర్ల చేతులు మోకాళ్ల ఎత్తులోనే ఉన్నాయి. ఇలాంటి ఫీల్డింగ్ చేస్తున్న జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచంటే నమ్మలేక పోతున్నా. ఎందుకంటే అతడు స్లిప్‌లో 200కు పైగా క్యాచులు పట్టిన ఒకే ఒక్క భారతీయుడు. అందులోనూ అద్భుతమైన ఫీల్డర్' అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
అక్షర్ పటేల్‌ను ముందుగా పంపించడం వెనకున్న వ్యూహాన్ని మహ్మద్ సిరాజ్ వివరించాడు. 'జట్టు యాజమాన్యం నిర్ణయం ఇది. కుడి-ఎడమ కాంబినేషన్ కోసమే ఇలా చేసుంటారు. అలాగైతే బౌలర్లకు ఇబ్బందిగా మారుతుంది' అని మూడో రోజు ఆట ముగిశాక సిరాజ్ పేర్కొన్నాడు.
View this post on Instagram