Virushka Wedding Anniversary : విరుష్క బంధానికి ఆరేళ్లు.. అభినందనలు తెలుపుతున్న ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ట్రెండింగ్
Virushka 6 th Wedding Anniversary : విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వివాహం జరిగి 6 ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ స్టార్ జోడికి సంబంధించిన పోస్టులు ,సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ. పరిచయం అవసరమే లేని జంట. ప్రపంచ క్రికెట్‌లో తన ఆటతో స్టార్ గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇక తన నటనతో బాలీవుడ్‌లో ఒక ప్రత్యేకత సంపాదించుకుంది అనుష్క శర్మ. అభిమానులు ముద్దుగా విరుష్క అని పిలుచుకునే ఈ వివాహాబంధంతో ఒక్కటై నేటికి (డిసెంబర్ 11) ఆరేళ్లు పూర్తయ్యాయి. 2013లో ఓ షాంపు యాడ్‌లో మొదటిసారిగా కలుసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లు అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ప్రయాణం మొదలు పెట్టారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది.ప్రేమించుకునే సమయంలో కోహ్లీ ఏ దేశంలో మ్యాచ్‌లు ఆడినా అనుష్క కూడా అక్కడికి వెళ్ళేది. మూడేళ్ళ తారువాత ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహ బంధం లోకి అడుగుపెట్టారు. పెళ్లి సమాయానికి కోహ్లీ టీం ఇండియా కెప్టెన్ గా ఉన్నాడు. అనుష్క కూడా కెరియర్ లో మంచి స్థాయిలో ఉంది. అయితే పెళ్లి అనేది పూర్తిగా తమ వ్యక్తిగత విషయం అని భావించిన జంట సుమారు 50 మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఇటలీలోని టూస్కానీలో 800 ఏళ్ల నాటి వారసత్వ విల్లా వేదికగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా 2021 జనవరి 11న వీరికి వామిక జన్మించింది.
ఈ నేపథ్యంలో ఈ స్టార్ జోడికి సంబంధించిన పోస్టులు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇద్దరి ఫ్యాన్స్‌తో పాటు, నెటిజన్లు కోహ్లీ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విరాట్ కోహ్లీ ఆడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సైతం..ఈ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. సెలబ్రేటింగ్ ది పర్ఫెక్ట్ పార్ట్‌నర్‌షిప్.. అంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు పోస్టు చేసింది.
భారత్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అద్భుత ఆటతీరుతో ఆ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నవ చరిత్ర లిఖించాడు. సచిన్‌కు దరిదాపుల్లో నిలిచే బ్యాటర్ రావడం కష్టమని క్రీడా పండితులు తేల్చేశాక తానున్నానని దూసుకొచ్చిన విరాట్ కింగ్ కోహ్లీ... ఆ క్రికెట్ దేవుడి రికార్డును సగర్వంగా దాటేశాడు. ప్రపంచకప్ సెమీఫైనల్లో తీవ్ర ఒత్తిడిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత శతకంతో సచిన్ రికార్డును అధిగమించేశాడు. సచిన్ సృష్టించిన రికార్డులను తన పరుగుల ప్రవాహంతో బద్దలు కొట్టిన కోహ్లీ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా తిరగరాసి తన పేరిట లిఖించుకున్నాడు. ఇదే ప్రపంచకప్‌లో సచిన్ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లీ... 50 సెంచరీలతో దానిని అధిగమించాడు. తాను ఎంతటి గొప్ప ఆటగాడినో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇప్పుడు కోహ్లీ ఖాతాలో అరుదైన ఘనత మరొకటి చేరింది. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ రన్ మెషిన్ డిసెంబర్ నెలకు గానూ ప్రముఖ మ్యాగజైన్ ఔట్‌లుక్ బిజినెస్ రూపొందించిన ఛేంజర్ మేకర్స్-2023 జాబితాలో విరాట్ కోహ్లీకి చోటు దక్కించుకున్నాడు. భారత్‌లో అత్యంత ప్రభావవంతంగా మార్పు తీసుకురాగల వ్యక్తులతో ఔట్ లుక్ బిజెనెస్ ఈ జాబితా రూపొందించగా అందులో కోహ్లీకి స్థానం దక్కింది.