Sri Sita Ramula Kalyanam 2024: రామయ్య ఆకాశం సీతమ్మ పుడమి - ఇద్దరి కళ్యాణం ప్రకృతికి పులకరింత!
Sri Rama Navami 2024: కొట్లాది దేవతలుండగా సీతారాముల కళ్యాణమే లోకకళ్యాణం ఎందుకైంది? వాడవాడలా వీరి కళ్యాణమే ఎందుకు ప్రత్యేకంగా జరుపుకుంటారు? దీనివెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా...
![Sri Sita Ramula Kalyanam 2024: రామయ్య ఆకాశం సీతమ్మ పుడమి - ఇద్దరి కళ్యాణం ప్రకృతికి పులకరింత! Sri Sita Ramula Kalyanam 2024 significance of Sri SeethaRamula Kalyanam occasion of Sri Rama Navami 2024 Sri Sita Ramula Kalyanam 2024: రామయ్య ఆకాశం సీతమ్మ పుడమి - ఇద్దరి కళ్యాణం ప్రకృతికి పులకరింత!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/14/769bd0c43a3c7fb4ee76c6f2296462021713070345759217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sri Sita Ramula Kalyanam 2024: వాల్మీకి రామాయణంలో ఉండే ప్రతి ఘట్టం అద్భుతమే. వాటిలో అత్యంత ముఖ్యమైనది లోక కళ్యాణంగా భావించే సీతారాముల కళ్యాణం. వీరి కళ్యాణమే లోకకళ్యాణం ఎందుకైందో వివరంగా తెలియజేసే కథనం ఇది...
పెళ్లి తర్వాత ప్రేమ
బంధం కలిస్తే బంధుత్వం ఇద్దరు వ్యక్తుల మధ్య అనురాగ ముడులువేసే ప్రక్రియే వివాహం. గతంలో ఎలాంటి పరిచయం లేని ఇద్దరు వ్యక్తుల మధ్య ఆత్మీయ అనురాగాలకు కారణం అవుతుంది వివాహం. రెండు కుటుంబాలను కలుపుతుంది. నూటికి నూరుశాతం సంప్రదాయబద్ధంగా జరిగిన సీతారాముల కళ్యాణం లోకానికి ఆదర్శం, ఓ సంప్రదాయం. సీతారాములది ప్రేమ వివాహం కాదు...నిజానికి సీతాదేవిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో రామయ్య శివధనస్సు ఎక్కుపెట్టలేదు...కేవలం తన గురువు విశ్వామిత్రుడు ఆదేశం మేరకే శివధనుర్భంగం చేశాడు. ఆ తర్వాత కూడా నేరుగా సీతాదేవి మెడలో దండవేసేయలేదు. తన తండ్రి దశరథమహారాజుకి కబురుపెట్టి పెళ్లి గురించి మాట్లాడమని జనకమహారాజుకి చెప్పాడు.
Also Read: చెప్పుడు మాటలు విని తర్వాత పశ్చాత్తాప పడితే ఏ లాభం - అయోధ్యకాండలో ఆసక్తికర విషయాలివే!
దశరథుడి కుటుంబానికి ఘన స్వాగతం
విశ్వామిత్రుడు అందించిన సమాచారంతో మిథిలానగరం చేరుకున్న రామచంద్రుడి కుటుంబానికి ఘనంగా స్వాగత సత్కారాలు పలికాడు జనకమహారాజు. శివధనుర్భంగం విషయం చెప్పి తన కుమార్తెను కోడలిగా స్వీకరించమని అడుగుతాడు...
ప్రతిగృహో దాతృవశః శ్రుతం ఏతత్ మయా పురా।
యథా వక్ష్యసి ధర్మజఞ తత్ కరిష్యామహే వయం ।।
జనకుడి మాటలు విన్న దశరథుడి సమాధానం ఇదే
అయ్యయ్యో! జనకమహారాజా...అలా అంటారేంటి...అసలు ఇచ్చేవాడంటూ ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది. నీ కుమార్తెను నా కోడలిగా చేస్తానంటున్నావు. నువ్వు దాతవు...నేను పుచ్చుకునేవాడిని..అంటూ ఎంతో ఆప్యాయంగా జనకుడి ఆహ్వానాన్ని స్వీకరించాడు. అలా వైశాఖ శుద్ధ దశమి ఉత్తర ఫల్గుణి నక్షత్ర శుభముహూర్తాన్ని సీతారాముల కల్యాణానికి ముహూర్తం నిర్ణయించారు. ఆకాశమంత పందిరి, భూదేవంత వేదిక సిద్ధం చేశారు.
ముహూర్త ఘడియలు సమీపించగానే..జనకమహారాజు వేదికపైకి వచ్చి.. కుమార్తె సీతాదేవి చేయిపట్టుకుని రామయ్యకు అందిస్తూ...
అత్తవారింట ఆడపిల్ల ఎలా నడచుకోవాలో జనకమహారాజు చెప్పిన శ్లోకం
ఇయం సీతా మమసుతా సహ ధర్మచరీ తవ ।
ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణి గృహ్ణీష్వ పాణినా ।
పతివ్రతా మహాభాగా ఛాయా ఇవ అనుగతా సదా ।।
రామయ్యా! ఇదిగో...నా కుమార్తె సీత. సహధర్మచారిణిగా స్వీకరించు. ఈమె రాకతో నీకు శుభాలు కలుగుతాయి. మహా పతివ్రతగా నిన్ను నీడలా అనుసరిస్తుందని చెప్పాడు
ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి ।
గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిః భూయోభివర్థత ।।
పెద్దలు కుదిర్చిన వివాహం అనే గౌరవంతో రాముడు సీతాదేవిపై ప్రేమ పెంచుకుంటే తన గుణాలతో ఆ ప్రేమను రెట్టింపయ్యేలా చేసుకుంది సీతమ్మ. పుట్టింటిని వదిలి తనను నమ్మి వచ్చిన స్త్రీని ఎంతగా ప్రేమించాలో, ఎంత గౌరవం ఇవ్వాలో శ్రీరాముడు చూపిస్తే... కేవలం అనురాగంతో మాత్రమే భర్తను తనవాడిగా చేసుకోవాలని సీతమ్మ నిరూపించింది. అందుకే సీతారాములు ఆదర్శదంపతులయ్యారు.
వివాహ తిథి దశమి అయితే నవమి రోజు కళ్యాణం ఎందుకు!
సీతారామ కల్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అని చెబుతుంది ఆగమ శాస్త్రం. అంటే మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి రోజు ఆ నక్షత్రంలో భక్తులు కల్యాణం జరిపించాలని శాస్త్రవచనం. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో జన్మించాడు శ్రీరాముడు. ఆ పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటున్నారు. ఊరూవాడ చలువ పందిళ్లు వేసి అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది.
Also Read: ఈ ఏడాది మే 1 నుంచి నర్మదానది పుష్కరాలు - ఘాట్ల వివరాలివే!
అందుకే లోక కళ్యాణం
- రాముడు నీలమేఘశ్యాముడు..నీలవర్ణం పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి సంకేతం
- సీతాదేవి భూమి దున్నుతుండగా ఉద్భవించింది...పంచభూతాల్లో భూమికి సంకేతం సీతమ్మ
ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో...ఆకాశం భూమిని చేరడం అంటే వాన చినుకుగా మారి భూమిని చేరుకుంటుందో అప్పుడు పుడమి పులకరిస్తుంది. పంటను అందిస్తుంది, జీవులకు ఆహారంగా మారి శక్తినిస్తుంది. అంటే ఎప్పుడైతే రామయ్య-సీతమ్మ కళ్యాణం జరుగుతుందో అప్పుడు లోకానికి శక్తి పెరుగుతుంది. అందుకే సీతారాముల కళ్యాణాన్ని లోక కళ్యాణం అని చెబుతారు.
Also Read: రామచంద్రుడి నుదుట సూర్యుడు - అయోధ్య రామ మందిరంలో అద్భుతం ఈ ఏడాది శ్రీరామ నవమికే!
సీతారాములిద్దరూ యజ్ఞ ప్రసాదమే
సీతారాములు ఇద్దరి పుట్టుకా యజ్ఞం ద్వారానే జరిగింది. సంతానం కోసం దశరథుడు పుత్రకామేష్ఠి యాగం ఫలితంగా రామచంద్రుడు జన్మించాడు. యజ్ఞం చేసేందుకు భూమి దున్నుతుండగా నాగలి చాలుకి తగిలి సీతాదేవి ఆవిర్భవించింది. అంటే ఇద్దరూ యజ్ఞప్రసాదాలే. అందుకే వారిద్దరి కల్యాణం కూడా లోక కళ్యాణ యజ్ఞానికి పునాది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)