Ganesh Visarjan Anant Chaturdashi 2024: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!
Ganesh Visarjan 2024: గణేషుడిని ప్రతిష్టించేందుకు మాత్రమే కాదు నిమజ్జనానికి కూడా ముహూర్తం చూస్తారు. ఈ ఏడాది సెప్టెంబరు 17 మంగళవారం నిమజ్జనం తేదీ అని ప్రకటించారు.. ఆరోజు ప్రత్యేకత ఏంటంటే..
Ganesh Visarjan 2024 Date and Timings: భాద్రపద శుద్ధ చవితి రోజు మండపాల్లో కొలువుతీరే గణపయ్య.. భాద్రపద శుద్ధ చతుర్థశి రోజు గంగమ్మ ఒడికి చేరుకుంటారు. భాద్రపదమాసంలో పౌర్ణమి ముందు వచ్చే చతుర్థశిని అనంత చతుర్థశి అని పిలుస్తారు. ఏటా వినాయక నిమజ్జనం నిర్ణయించేది ఈ తిథిని ఆధారంగా చేసుకునే. సంకష్టహర చతుర్థి వ్రతానికి ప్రతి నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్థశి ముఖ్యం అయితే.. చవితిపూజలందుకునే గణపయ్య నిమజ్జనానికి పౌర్ణమి ముందు వచ్చే చతుర్థశిని ప్రధానంగా పరిగణలోకితీసుకుంటారు.
Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!
2024 భాద్రపద శుద్ధ చతుర్థశి తిథి వివరాలివే...
చతుర్థశి ప్రారంభ సమయం - సెప్టెంబరు 16 సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట 13 నిముషాలకు ప్రారంభం
చతుర్థశి ముగింపు ఘడియలు- సెప్టెంబరు 17 మంగళవారం ఉదయం 11 గంటల 08 నిముషాలు...
దుర్ముహూర్తం - సెప్టెంబరు 17 మంగళవారం ఉదయం 8.18 నుంచి 9.05...తిరిగి రాత్రి 10.44 నుంచి 11.31
వర్జ్యం - సెప్టెంబరు 17 మంగళవారం రాత్రి 8.31 నుంచి 10.01 వరకు...
Also Read: ఈ ఆలయంలో తప్పుడు ప్రమాణం చేస్తే.. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు!
సంకష్టహర చతుర్థి వ్రతానికి మాత్రమే సూర్యాస్తమయ సమయానికి ఉండే చతుర్థశిని పరిగణలోకి తీసుకుంటారు... చవితి పూజలకు అయినా, నిమజ్జనం చేసే చతుర్థశి అయినా సూర్యోదయానికి ఉండే తిథినే పరిగణలోకి తీసుకుంటారు. అందుకే ఈ ఏడాది వినాయక నిమజ్జనం సెప్టెంబరు 17 మంగళవారం వచ్చింది. మండపాల నుంచి గణనాథుడు బయటకు అడుగుపెట్టే ఘడియలే ప్రధానం..ఆ తర్వాత నిమజ్జనం అనేది ఆయా నగరాల్లో శోభాయాత్ర, భక్తుల రద్దీపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వర్జ్యం, దుర్ముహూర్తం ఉన్న సమయంలో మండపంలోంచి వినాయకుడిని కదిలించరు..అలా చేస్తే నిమజ్జనానికి ఆటంకాలు వస్తాయని భక్తుల విశ్వాసం..అందుకే వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయం చూసుకుని చతుర్థశి ఘడియలు మించిపోకుండా నిమజ్జనానికి తరలిస్తారు...
గణేష్ నిమజ్జనం 11 వ రోజే ఎందుకు ప్రధానం..
వినాయక చవితి పూజ చేసేవారు..గణేషుడి నిమజ్జనం ఒక్కొక్కరు ఒక్కోరోజు ఎంపిక చేసుకుంటారు. కొందరు ఉదయం పూజచేసి సాయంత్రానికి కదిలించేస్తారు. మరికొందరు మూడో రోజు, ఐదోరోజు నిమజ్జనం చేస్తారు. సాధారణంగా ఏడో రోజున నిమజ్జనం చేసేవారి సంఖ్య చాలా తక్కువ. మళ్లీ తొమ్మిదోరోజు నిమజ్జనాల సందడి సాగుతుంది. అయితే వినాయక నిమజ్జనానికి అత్యంత ముఖ్యమైన రోజు మాత్రం 11.... ఎందుకంటే భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు వచ్చే అనంత చతుర్థశి అత్యంత విశిష్టమైనరోజు. ఈ తిథి చవితి రోజు నుంచి సరిగ్గా 11వ రోజు వస్తుంది.. అందుకే వినాయక నిమజ్జనం పదకొండోరోజు ఆచరిస్తారు. చెరువులు, నదులు, సరస్సులు, కొలనులు..ఇలా నీరు కళకళలాడే ప్రదేశంలో గణపయ్యను విడిచిపెడతారు. పదకొండవ రోజున, గణేశ విగ్రహాన్ని నది, సరస్సు లేదా సముద్రం వంటి నీటి ప్రదేశాలకు.. మేళతాళాల మధ్య సంబరంగా శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం తర్వాత గణేషుడు తన తల్లిదండ్రులైన పరమేశ్వరుడు పార్వతిదేవి దగ్గరకు కైలాస పర్వతానికి వెళతాడని భక్తుల విశ్వాసం. అందుకే గణపయ్య ఆగమనం కన్నా వీడ్కోలు అంత సంబరంగా జరుగుతుంది.
Also Read: సముద్ర నురుగుతో గణేషుడు.. దర్శించుకున్నారా ఎప్పుడైనా!