Telangana Latest News: ఒత్తిడి లేని నైపుణ్యాలతో కూడిన విద్య అవసరం- విద్యా కమిషన్ సమీక్షలో సీఎం కీలక వ్యాఖ్యలు
Telangana Latest News: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యావిధానంపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఒత్తిడి లేని నైపుణ్యాలు కల్పించే విద్య కావాలని ఆకాంక్షించారు.

Telangana Latest News: నైపుణ్యాలు పెంపొందించే మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విద్యా కమిషన్‌ను ఆదేశించారు. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత వ్యయమైనా వెనుకాడబోమని సీఎం తెలిపారు.
క్షేత్ర స్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా విధానపత్రం ఉండాలని సీఎం సూచించారు. ఆచరణకు దూరంగా ఉండకుండా చూసుకోవాలని హితవు పలికారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలు.. తీసుకురావల్సిన సంస్కరణలపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఐసీసీసీలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
విద్యా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత వివరించారు. ఉపాధ్యాయుల నియామకం, అమ్మ ఆదర్శ కమిటీలు, పుస్తకాలు, యూనిఫాంల పంపిణీగురించి తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల నిర్మాణ ప్రాముఖ్యత గుర్తు చేశారు. ప్రాథమిక దశలో అందే విద్యతోనే పునాది బలపడుతుందని వివరించారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తే ఉన్నత చదువుల్లో విద్యార్థులు మెరుగ్గా రాణిస్తాను సీఎం అభిప్రాయపడ్డారు.
అందుకే అంగన్‌వాడీలు, ప్రాథమిక పాఠశాల స్థాయిలో కీలక మార్పులు తీసుకురావాలని సీఎం తెలిపారు. సమాజంలోని వివిధ సంఘాలు, ప్రముఖులతో చర్చించి మెరుగైన విధాన పత్రం రూపొందించాలని సూచించారు. మనకు ఉన్న వనరులు సద్వినియోగం చేసుకోవాలని, విద్యా వ్యవస్థలో తెలంగాణ అగ్రగామిగా ఉండేందుకు దోహదపడేలా సూచనలు, సలహాలు ఉండాలని సీఎం సూచించారు.
వివిధ రాష్ట్రాల్లోని పర్యటనలు, ఆయా రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ప్రాథమిక విద్యలో అనుసరిస్తున్న విధానాలను విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ సీఎంకు వివరించారు. 1960 దశకం నుంచి ప్రస్తుతం వరకు విద్యా వ్యవస్థలోని తీసుకువచ్చిన పలు సంస్కరణలు క్రమేణా విద్యార్థుల సృజనాత్మక శక్తి, ఆలోచనాధోరణిని ఎలా హరించి వేశాయో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్ నారాయణ వివరించారు. విద్యా వ్యవస్థలో మార్పులకు పరీక్షల విధానం, పాఠశాలల్లో తనిఖీలు, జీవన నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు విద్యా కమిషన్‌ను ఆదేశించారు. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి పరిస్థితులకు… pic.twitter.com/NofLmfccpg
— Telangana CMO (@TelanganaCMO) April 4, 2025





















