Supreme Court Serious on HCU Lands | కంచ గచ్చిబౌలి 400 ఎకరాల వివాదంలో రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ | ABP Desam
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో రేవంత్ రెడ్డి సర్కారుకు ఊహించని షాక్ తగలింది. గచ్చిబౌలి భూములు గురించి కొద్దిరోజులుగా మీడియాలో వస్తున్న కథనాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ ఇష్యూ ను సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది. ఇదే సమయంలో కొన్ని సామాజిక స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టు కంచ గచ్చిబౌలి 400ఎకరాల్లో జరుగుతున్న విధ్వంసం మీద వేసిన పిటీషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ భూముల వివాదంపై విచారణ జరిపింది. ఈ ఒక్కరోజే మొత్తం రెండు దఫాలుగా విచారణ చేసింది సుప్రీంకోర్టు. ముందు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ను హెచ్ సీయూకి వెళ్లి అక్కడ జరుగుతున్న పనులు ఏంటీ ఓ రిపోర్ట్ తయారు చేసి మధాహ్నం 3.30 గంటల్లోపు నివేదిక పంపాలని ఆదేశించింది. అప్పటివరకూ హెచ్ సీయూలో జరుగుతున్న పనులను తక్షణం ఆపాలని ఒక్క చెట్టును నరికినా ఊరుకునే ప్రసక్తే లేదని సంచలన ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు అందుకున్న రిజిస్ట్రార్ హుటాహుటిన హెచ్ సీయూకి బయలుదేరి వెళ్లి అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించి ఓ మధ్యంతర నివేదికను రూపొందించి సుప్రీంకోర్టుకు పంపించారు. ఈ సారి ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా విచారణకు హాజరయ్యారు. హైకోర్టు రిజిస్ట్రార్ పంపించిన రిపోర్టు మొత్తం పరిశీలించిన ద్విసభ్య ధర్మాసనం సీఎం రేవంత్ రెడ్డి సర్కారు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. అసలు వందల ఎకరాల్లో ఉన్న చెట్లను నరికేసేందుకు మీరు ఎవరి నుంచి అనుమతులు తీసుుకన్నారని సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ కు అక్యూజ్డ్ గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉంచింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
చెట్లు నరకొద్దని, వన్య ప్రాణాలు చనిపోతున్నాయని అంత మంది స్టూడెంట్స్, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు...పర్యావరణ, అటవీశాఖ అనుమతులు తీసుకోకుండా ఎలా చెట్లను కూల్చివేస్తున్నారని ప్రశ్నించింది. కూల్చివేతలు జరుగుతున్న ప్రదేశం అటవీశాఖ భూమి కాదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు చెప్పే ప్రయత్నం చేసినా...సుప్రీంకోర్టు చెట్లను నరికొద్దని చెప్పటానికి అటవీ ప్రాంతమే కానక్కర్లేదని రిప్లై ఇచ్చింది. ఈ అంశంపై విచారణను ఈ నెల 16వ తారీఖుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈలోపు ఒక్క చెట్టు కూల్చినా ఓ వన్యప్రాణికి ఏదైనా జరిగినా సీఎస్ నే ఫుల్ రెస్పాన్స్ బుల్ చేస్తామని హెచ్చరించింది సుప్రీంకోర్టు. అంతే కాదు అసలు ఈ భూములను వేలం వేయొచ్చా లేదా తేల్చటానికి ఓ నిపుణుల కమిటీ వేసి దానికి ఆరునెలల సమయం ఇవ్వాలని కూడా విచారణలో పేర్కొంది సుప్రీంకోర్టు. సో తిరిగి విచారణ 16వ జరిగినప్పుడు ఎక్స్ పర్ట్ కమిటీని సుప్రీంకోర్టు వేసే అవకాశమైతే కనిపిస్తోంది. మరో వైపు ఇదే కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ కూడా ఈనెల 7వ తారీఖుకు వాయిదా పడింది.
హెచ్ సీ యూ భూములపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు రావటంతో...హెచ్ సీయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. జోరువానలో తడుస్తూనే విద్యార్థులు సుప్రీంకోర్టును తీర్పును స్వాగతిస్తూ నృత్యాలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు రేవంత్ సర్కార్ కు పెద్ద దెబ్బ అని ఇప్పటికైనా పచ్చటి అడవిని నరికే పనులను ప్రభుత్వం మానుకోవాలని సూచించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటనలు విడుదల చేశారు.





















