YS Sharmila : అసలు విషయం వదిలేస్తున్నారు, నచ్చినట్టు వాడుకుంటున్నారు- మీడియాపై షర్మిల ఆగ్రహం
YS Sharmila : కొన్ని మీడియా సంస్థలపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాటలను అసలు విషయాలు వదిలేసి జగన్‌ను టార్గెట్ చేస్తున్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నాయని ఆరోపించారు.

YS Sharmila : కొన్ని మీడియా సంస్థలు తనను వాడుకుంటున్నాయని, తను మాట్లాడిన మాటల్లో కావాల్సిన వాటిని మాత్రమే ప్రసారం చేయడమో, పబ్లిష్ చేయడమో చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. తను మాట్లాడిన ముఖ్యమైన విషయాలు వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన విషయం మాత్రమే పేపర్లలో రాస్తున్నారు అంటూ షర్మిల విమర్శించారు.
అసలేం జరిగిందంటే...!
రెండు నెలల సుదీర్ఘ గ్యాప్ తర్వాత షర్మిల ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఆమె ఇటీవల ఏపీకి రాలేకపోయారు. గురువారం వచ్చిన వెంటనే అతి కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లును ఖండిస్తూ ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు.
విజయవాడలో ప్రెస్‌మీట్ అనంతరం జరిగిన మీడియా అడిన ప్రశ్నలకు సమధానం చెప్పారు. వివేకానంద రెడ్డి హత్య దర్యాప్తులో జరుగుతున్న ఆలస్యంపై షర్మిల అభిప్రాయం అడిగారు. దానికి ఆమె సమాధానం చెబుతూ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ప్రాణాలకు రక్షణ లేదనిపిస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వక్ఫ్ బిల్లులో సవరణలు తెచ్చి బీజేపీ @BJP4India మళ్ళీ పార్లమెంట్ వేదికగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఇది ముస్లిం కమ్యూనిటీ మీద, దేశ ఐక్యత మీద, రాజ్యాంగం మీద జరిగిన దాడి. బీజేపీ క్రూరత్వానికి నిదర్శనం. వక్ఫ్ బిల్లు సవరణలు ముస్లింలకు మేలు చేసేవి కావు. మతం,కులం పేరు చెప్పి బీజేపీ… pic.twitter.com/cr2t8LfCU1
— YS Sharmila (@realyssharmila) April 3, 2025
శుక్రవారం ఉదయం షర్మిల మాట్లాడిన వివేకానంద రెడ్డి హత్య దర్యాప్తులో ఆలస్యం విషయం హైలైట్ అయింది. ఆమె వక్ఫ్ సవరణ బిల్లుపై మాట్లాడిన విషయాలు హైలెట్ కాలేదు. కొన్ని పేపర్లు అయితే అసలు పట్టించుకోలేదు. దీనితో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరగడంతో ఆమె మరోసారి ప్రెస్‌మీట్ పెట్టి తనను కొన్ని మీడియాలు వాడుకుంటున్నాయి అన్నట్టుగా మాట్లాడారు. దానివల్ల తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రజల దృష్టికి తెస్తున్న అనేక విషయాలు పక్కకు పోయి ఎంతసేపు తన పోరాటం జగన్‌పైనే అన్నట్టు ప్రొజెక్ట్ అవుతుందని ఆమె ఆరోపించారు.
ఇకపై ప్రత్యేక హోదా పోలవరం వంటి ప్రజా సమస్యలపై మాట్లాడిన మాటలకు మీడియాలో ప్రాతినిధ్యం కల్పిస్తేనే వారు అడిగే ఇతర ప్రశ్నలకు సమాధానం చెబుతానని షర్మిల స్పష్టం చేశారు. ఇది తనకు మీడియాకు మధ్య ఒక డీల్‌గా ఉండాలంటూ ప్రెస్‌మీట్‌కి హాజరైన మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఉదయం ప్రెస్‌మీట్ పెట్టిన షర్మిల చాలా విషయాలపై మాట్లాడారు. "రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. బీజేపీ గత 10 ఏళ్లుగా మోసం చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు పోలవరం అంతే ముఖ్యం. పోలవరం ఆంధ్ర జీవనాడి. వరకు ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. దీనికి బాధ్యత ఎవరు? పోలవరం దివంగత YSR కల. YSR సీఎం అయ్యాక అన్ని అనుమతులు తీసుకువచ్చి పనులు ప్రారంభించారు. 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు... 22 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యం. YSR పనులు ప్రారంభించినప్పుడు అంచనా వ్యయం రూ.10,151 కోట్లు. ప్రాజెక్ట్ సామర్ధ్యం 194 టీఎంసీలు. ఆనాడు ప్రాజెక్ట్ ఎత్తు 45.7 మీటర్లు. ఇప్పుడు పోలవరం ఎత్తు 41 మీటర్లకు కుదించారు. ఇలా కడితే పోలవరం జీవనాడి అవ్వదు. YSR హయంలో 33 శాతం పనులు అయ్యాయి. ఆ తర్వాత ఎవరు కూడా పోలవరం పనులను పట్టించుకోలేదు." అని అన్నారు.
"2014లో కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. 2014లో అధికారంలో వచ్చిన చంద్రబాబు కేవలం 17 శాతం పనులు చేశారు. ప్రాజెక్ట్ అంచనాను అమాంతం రూ.50వేల కోట్లకు పెంచేశారు. జగన్ అధికారంలో వచ్చాక పోలవరం పనులు 3 శాతం దాటలేదు. తండ్రి ఆశయాన్ని జగన్ ముందుకు తీసుకువెళ్ళలేదు. రివర్స్ టెండర్ల పేరుతో ప్రాజెక్ట్ నాశనం చేశారు. మొత్తంగా 10 ఏళ్లలో 50 శాతం పనులు దాటలేదు. అందరు కలిసి పోలవరం ప్రాజెక్ట్ స్వరూపం మార్చేశారు. జగన్, బాబు ఇద్దరు బీజేపీకి లొంగిపోయారు. 41 మీటర్ల ఎత్తులో మాత్రమే R&R ఇవ్వాలని చూస్తున్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2 అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. "
"41 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఎన్ని ఎకరాలకు నీరు ఇస్తారో చెప్పడం లేదు. 41.15 మీటర్లు ఎత్తులోనే నిర్మాణం అని కేంద్రం పోలవరం వెబ్‌సైట్‌లో పెడితే ఎంపీలు నోరు మూసుకొని కూర్చున్నారు. ప్రాజెక్ట్ బ్యారేజ్‌గా...లిఫ్ట్ ఇరిగేషన్‌గా మిగిలి పోయే ప్రమాదం ఉంది. ఇది రాష్ట్రంపై బీజేపీ చేస్తున్న కుట్ర. ఈ కుట్రలో భాగం బాబు, జగన్, పవన్. ఫేజ్ 1లో ఎన్ని ఎకరాలు... ఫేజ్ 2లో ఎన్ని ఎకరాలు అనేది కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పోలవరంలో R&R ప్యాకేజీ ఇవ్వాలి అంటే రూ.33 వేల కోట్లు కావాలి. దాదాపు 96 వేల కుటుంబాలకు ఇంకా రీహాబిలిటేషన్ చేయాలి. 85 వేల కుటుంబాలకు R&R ఇవ్వకుండా ఎత్తు తగ్గించడం కుట్ర. కేవలం 20 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇచ్చి మోసం చేశారు. మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. 45.7 మీటర్ల ఎత్తు కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుంది." అని ధ్వజమెత్తారు.
నిజంగానే మీడియా వాడుకుంటుందా?
అవునన్నా కాదన్నా ప్రస్తుతం కొన్ని మీడియాలు కొన్ని పార్టీలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్‌కు వ్యతిరేకంగా ఉండే మీడియా సంస్థలు జగన్‌ను షర్మిల విమర్శిస్తూ మాట్లాడితే వాటిని మాత్రమే హైలెట్ చేస్తున్నాయని షర్మిల అభిప్రాయం. ఇక జగన్‌కు అనుకూలంగా ఉండే మీడియాలు అసలు షర్మిల వార్తలనే కవర్ చేయడం లేదనేది ఆమె వర్గం చెబుతోంది. న్యూట్రల్‌గా ఉండే మీడియా మాత్రమే ఆమె ఏం మాట్లాడినా పబ్లిష్ చేస్తూ వస్తోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని షర్మిల ఈ విధంగా మాట్లాడారని ఆమె వర్గం చెబుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

