Pant Failed Again In IPL 2025: మళ్లీ విఫలమైన పంత్.. ఈసారి సింగిల్ డిజిట్ కే పరిమితం.. ఆ ప్రెషరే ఫెయిల్యూర్ కి కారణమా..? లక్నోతో పోరుకు రోహిత్ మిస్
పంత్ మరోసారి విఫలమయ్యాడు. వరుసగా 4వ మ్యాచ్ లోనూ తను సత్తా చాటలేకపోయాడు. ఇప్పటివరకు ఓవరాల్ గాను తను 19 పరుగులు మాత్రమే చేశాడు. ఇక లక్నోతో మ్యాచ్ లో రోహిత్ బెంచ్ కే పరిమితమయ్యాడు.

IPL 2025, Rishabh Pant Vs Rohit Sharma: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. తాజాగా శుక్రవారం ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో కేవలం రెండు పరుగులకే విఫలమయ్యాడు. ఇప్పటికి మూడ మ్యాచ్ లు ఆడిన పంత్.. కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా ముంబైపై రెండు పరుగులు మాత్రమే సాధించడంతో నాలుగు మ్యాచ్ ల్లో కేవలం 19 పరుగులే చేసినట్లయ్యింది. దీంతో అతని సగటు.. ఐదు లోపలే ఉండటం గమనార్హం. ఇక తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై పోరుతో ఈ సీజన్ ను మొదలు పెట్టిన పంత్.. ఆ మ్యాచ్ లో ఏకంగా డకౌటయ్యాడు. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 15 పరుగులు సాధించాడు. ఇక పంజాబ్ కింగ్స్ తో రెండు మ్యాచ్ లు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో పంత్ పై సోషల్ మీడియాతో పాటు మాజీలు, విశ్లేషకులు విమర్వలు చేస్తున్నారు.
ప్రైస్ ట్యాగ్ ప్రెషర్..
గతేడాది మెగావేలంలో రిషభ్ పంత్ ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రూ.27 కోట్లకు లక్నో అతడిని సొంతం చేసుకుని, కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అయితే అటు సారథిగా, ఇటు వికెట్ కీపర్, బ్యాటర్ గా పంత్ రాణించలేకపోతున్నాడు. భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రైస్ ట్యాగ్ భారం అతనిపై ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే వేలంలో రూ.26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్, రూ.23.75 కోట్లకు వెంకటేశ్ అయ్యర్ అమ్ముడు పోయారు. అయితే వారు మాత్రం గాడిన పడినా, పంత్ మాత్రం రాణించడం లేదు. వీలైనంత త్వరగా తను రాణించకపోతే లక్నోకి మరిన్ని కష్టాలు తప్పవని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రోహిత్ కు గాయం..
ఇక లక్నోతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ప్రాక్టీస్ లో మోకాలి గాయం కావడంతో రోహిత్ ఈ మ్యాచ్ లో ఆడటం లేదని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. అతని స్థానంలో రాజ్ అంగద్ బావా ను జట్టులోకి తీసుకున్నారు. ఐపీఎల్లో అతనికిదే డెబ్యూ మ్యాచ్ కావడం విశేషం. అండర్ 19 2022 పురుషుల ప్రపంచకప్ లో ఐదు వికెట్లు తీసి అంగద్ ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చాడు. దీంతో వేలంలో అతడిని పిక్ చేసిన ముంబై తాజాగా ఐపీఎల్ ఎంట్రీకి మార్గం సుగమం చేసింది. ఇక లక్నో టీమ్ లోకి సీనియర్ పేసర్ ఆకాశ్ దీప్ పునరాగమనం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో గాయపడిన ఆకాశ్ ఫుల్ గా కోలుకుని , జట్టులోకి వచ్చినట్లు పంత్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 203 పరుగులు సాధించింది. ఓపెనర్లు మిషెల్ మార్ష్ (60) టాప్ స్కోరర్ గా నిలవగా, ఐడెన్ మర్క్రమ్ (53) అర్థ సెంచరీతో గాడిన పడ్డాడు. ఇక ముంబై కెప్టెన్ కెరీర్ లో తొలిసారి టీ20ల్లో ఫైవ్ వికెట్ హాల్ (5-36) సాధించాడు.




















