బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం, ప్రధాని రిషి సునాక్ పై టోరీ ఎంపీ అవిశ్వాస లేఖ
యూనైటెడ్ కింగ్ డమ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని రిషి సునాక్ పై సొంత పార్టీకి చెందిన ఓ ఎంపీ అవిశ్వాస లేఖను పంపడం చర్చనీయాంశంగా మారింది.
యూనైటెడ్ కింగ్ డమ్ (United Kingdom) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak)పై సొంత పార్టీకి చెందిన ఓ ఎంపీ అవిశ్వాస లేఖ (No Confidence Letter)ను పంపడం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకున్న సువెల్లా బ్రేవర్మన్‌ను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆ పదవిని విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీకి కట్టబెట్టింది. మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్‌కు కేబినెట్‌లో చోటు కల్పించింది. ఆయనకు విదేశాంగ, కామన్వెల్త్, అభివృద్ధి వ్యవహారాల శాఖ బాధ్యతలు అప్పగించింది. కేబినెట్‌లో మార్పులు చేసిన గంటల వ్యవధిలోనే ఆయనపై అవిశ్వాస గళం వినిపించడం సంచలనం రేపుతోంది. రిషి సునాక్ (Rishi Sunak)కు వ్యతిరేకంగా టోరీ ఎంపీ ఆండ్రియా జెన్‌కిన్స్ (Andrea Jenkyns)అవిశ్వాస లేఖ అస్త్రం సంధించారు. హౌస్ ఆఫ్ కామన్స్ వ్యవహరాలను చూసే 1922 కమిటీ ఛైర్మన్ గ్రాహమ్ బ్రాడీకి లేఖను పంపించారు. రిషి సునాక్‌ను పదవి నుంచి దింపి, ఆయన స్థానంలో నిజమైన కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే సమయం వచ్చిందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఎంపీ ఆండ్రియా జెన్‌కిన్స్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు నమ్మినబంటు. మంత్రివర్గం నుంచి సువెల్లా బ్రేవర్మన్‌ను తొలగించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఆమె అవిశ్వాస లేఖను సమర్పించారు. కేబినెట్‌లో నిజాలు మాట్లాడే ఏకైక వ్యక్తి సువెల్లాపై వేటు వేశారని ఆండ్రియా జెన్‌కిన్స్ ఆగ్రమం వ్యక్తం చేశారు. సువెల్లా బ్రేవర్మన్ పై వేటును తీవ్రంగా ఖండించారు. రిషి సునాక్ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస లేఖలు సమర్పించాలని తోటి టోరీ ఎంపీలను కోరారు. రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆయనపై అవిశ్వాస లేఖ రావడం ఇదే తొలిసారి. అవిశ్వాస పరీక్షను సునాక్ ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. పార్టీకి చెందిన మొత్తం ఎంపీల్లో 15శాతం మంది తాము కొత్త నాయకుడిని కోరుకుంటున్నామంటూ లేఖలు పంపితినే అది సాధ్యమవుతుంది. ఆ తర్వాతే కన్జర్వేటివ్ పార్టీలో రిషి నాయకత్వంపై విశ్వాస పరీక్ష ఓటింగ్ నిర్వహిస్తారు.
బ్రిటన్ కేబినెట్‌లో సుయెల్లా బ్రేవర్మన్ సీనియర్ మంత్రి. గతంలో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ మంత్రివర్గంలో కూడా ఆమె పనిచేశారు. అప్పట్లో లిజ్ ట్రస్ ప్రభుత్వం గందరగోళ సమయాన్ని ఎదుర్కొంటోందని విమర్శలు చేశారు. అదే సమయంలో మైగ్రేషన్ అంశంపై అధికారిక పత్రాలకు సంబంధించి నిబంధనలను ఉల్లఘించినందుకు బాధ్యత వహిస్తూ.. ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. ఆమెకు మద్దతుగా నిలిచి, ఇంటీరియర్ మినిస్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆమె ప్రచురించిన కథనం వివాదాస్పదం కావడంతో మరోసారి పదవి కోల్పోయారు. గతంలో ఆమె వలసదారులపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి.
సామాన్యుడిగా మొదలైన రిషి సునాక్ తన కృషి, పట్టుదలతో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. కన్జర్వేటివ్ పార్టీలో కొత్త తరం నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన బ్రిటన్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. బ్రిటన్ సంక్షోభం వేళ ఆర్థిక మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్ నగరంలో రిషి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఉష, యశ్‌వీర్. భారత్‌లోని పంజాబ్‌లో రిషి సునాక్ తల్లిదండ్రుల మూలాలు ఉన్నాయి. వారు టాంజానియా, కెన్యా నుంచి బ్రిటన్‌కు వలస వచ్చారు.