Bangladesh: షేక్ హసీనాకి భారత్ ఎందుకు ఆశ్రయమివ్వడం లేదు? ఒకవేళ ఇస్తే ఏం జరుగుతుంది?
Bangladesh Crisis: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకి ఆశ్రయమిచ్చేందుకు భారత్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
Bangladesh Crisis Updates: బంగ్లాదేశ్‌లో అల్లర్లు (Bangladesh Unrest) తీవ్రతరమైన వెంటనే ఆ దేశ ప్రధాని షేక్ హసీనా భారత్‌కి వచ్చేశారు. పరిస్థితులు చక్కబడేంత వరకూ ఇక్కడే తలదాచుకోవాలని భావించారు. కానీ ఆమె అనుకున్నట్టుగా జరగలేదు. ఆమెకి ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ అంగీకరించలేదు. ప్రస్తుతానికి ఆమె భారత్‌లోనే ఉన్నప్పటికీ ఎప్పుడో అప్పడు ఇక్కడి నుంచి వెళ్లిపోక మాత్రం తప్పదు. ఆశ్రయమివ్వాలని ఆమె యూకేని కూడా కోరారు. కానీ...ఆ దేశమూ అందుకు సుముఖంగా లేదు. ఇక అగ్రరాజ్యం అమెరికా అయితే ఆమె తమ దేశానికి రాకుండా ఆంక్షలు విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఎక్కడికి వెళ్తారన్నదే కీలకంగా మారింది. మరో 48 గంటల పాటు ఆమె భారత్‌లోనే ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే...ఇప్పటి సంక్షోభాన్ని చూస్తుంటే 1975 నాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఆ సమయంలోనూ బంగ్లాదేశ్‌లో ఇదే స్థాయిలో అల్లర్లు జరిగాయి. షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబర్ రహమాన్ హతమయ్యారు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక షేక్ హసీనా భారత్‌కి వచ్చారు. ఆమెతో పాటు ఆమె భర్త, పిల్లలూ భారత్‌లోనే ఆశ్రయం పొందారు. 1975 నుంచి 1981 వరకూ అంటే దాదాపు ఆరేళ్ల పాటు తలదాచుకున్నారు. కానీ...ఇప్పటి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌ని భారత్ మిత్రదేశంగానే భావిస్తున్నప్పటికీ మోదీ సర్కార్ మాత్రం ఆమెకి ఆశ్రయం ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. (Also Read: Bangladesh News: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు- మహమ్మద్ యూనస్ నేతృత్వంలో పాలన)
బంగ్లాలో షేక్ హసీనాపై ఓ నియంత అనే ముద్ర పడిపోయింది. పౌర హక్కుల్ని అణిచివేశారన్న అపవాదునీ మూటగట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఆమెకి ఆశ్రయమివ్వడానికి భారత్ వెనకడుగు వేస్తోంది. పైగా దేశ భద్రతనూ దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకోలేకపోతోంది. అయితే..అసలు కారణాలు వేరే ఉన్నాయి. ఎప్పుడైతే షేక్ హసీనా భారత్‌తో మైత్రిని బలపరుచుకున్నారో అప్పటి నుంచి అక్కడ భారత్‌పై వ్యతిరేకత పెరిగింది. పైగా ఇప్పుడు బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి భవిష్యత్ కార్యాచరణనూ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రధాని పదవిలో ఎవరున్నా తమ మైత్రి మాత్రం కచ్చితంగా కొనసాగుతుందన్న సంకేతాలివ్వాలి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో షేక్ హసీనాకి ఆశ్రయమిస్తే బంగ్లాదేశ్ అల్లర్లకు పరోక్షంగా కారణమైన ఇస్లామిస్ట్ గ్రూప్‌లు ఇంకా చెలరేగిపోయే ప్రమాదముంది.
అంతే కాదు. భారత్ కారణంగానే బంగ్లాదేశ్‌లో ఈ సంక్షోభం తలెత్తిందన్న అసత్య ప్రచారమూ చేసే అవకాశముంది. భారత్ అనవసరంగా ఈ అపవాదు మోయాల్సి వస్తుంది. జమాతే ఇస్లామీ గ్రూప్ దాదాపు మూడేళ్లుగా అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అందుకే ఇదంతా ఆలోచించే భారత్ ఈ వివాదాలకు దూరంగా ఉంటోంది. పైగా షేక్ హసీనా తరవాత ఏ దేశానికి వెళ్లాలనుకున్నా అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇస్తున్నట్టు సమాచారం. అటు షేక్ హసీనా మాత్రం భారత్‌లో ఉండేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Also Read: Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఎందుకీ దాడులు? కోటి మంది బెంగాల్‌కి వలస వస్తున్నారా?