Oil Prices: పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతాయా, ఇలా అయితే సామాన్యులకు కష్టాలే
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మరోసారి పెరిగాయి. సామాన్యులపై మళ్లీ ధరాభారం పడే అవకాశాలున్నాయి.
క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల
బండి తీయాలంటేనే భయపడే రోజులొచ్చేశాయి. సొంత వాహనమున్నా పక్కన పెట్టి ప్రజా రవాణాకే మొగ్గు చూపుతున్నారు చాలా మంది. ఇందుకు కారణం చమురు ధరలు మండిపోతుండటమే. దాదాపు ఆర్నెల్లుగా క్రమంగా పెరుగుతూ వచ్చాయి పెట్రో ధరలు. అంతర్జాతీయంగా ఉత్పత్తి తగ్గటం సహా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈ మధ్య కాలంలో ధరలు అమాంతం పెరిగాయి. లీటర్ పెట్రోల్ రూ. 120 కి చేరుకుంది.
ఇంకెన్ని రోజులో ఈ బాదుడు అని సామాన్య ప్రజలు ఆందోళనకు గురి అయ్యారు. వరుస వడ్డన తరవాత ఈ మధ్యే కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ సుంకాన్ని తగ్గించడం ద్వారా వాహనదారులకు భారీ ఊరట లభించింది. లీటరు పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింది. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఊరటనిచ్చిందని అనుకునేలోపే ఇప్పుడు మరో చేదు కబురు అందింది. అంతర్జాతీయంగా మరోసారి క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరుకుంది
అంచనాలకు తగ్గట్టుగానే ధరలు పెరిగాయి..
సౌదీ అరేబియా జులైలో విక్రయాలు పెంచుకుని పెద్ద మొత్తంలో ఆదాయం గడించేందుకు ఒక్కసారిగా ధరలు పెంచింది. ఇప్పటికే ఒపెక్ ప్లస్ దేశాలు డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా పెంచుతామని ప్రకటించింది. ఈ తరుణంలో ధరలు పెరగటం వల్ల మళ్లీ అంతర్జాతీయంగా ఆ ప్రభావం పడనుంది. ధరలు పెరుగుతాయని ముందుగానే అంచనా వేశారు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.8 డాలర్లు పెరుగుతుంది అంచనా వేయగా..కాస్తు అటు ఇటుగా అదే స్థాయిలో ధరలు పెరుగుదల కనిపించింది. మూడు నెలలుగా ఇవే పరిస్థితులు ఉన్నా గరిష్ఠంగా పెరిగింది మాత్రం ఇప్పుడే.
ధరలు పెంచటానికి కారణమిదేనా..
అఫీషియల్ సెల్లింగ్ ప్రైస్-OSPని పెంచేసింది సౌదీ అరేబియా. జులై, ఆగస్టులో రోజుకు 6 లక్షల 48 వేల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తామని ఒపెక్ ప్లస్ దేశాలు అంగీకరించాయి. అంతకు ముందే ఉత్పత్తి పెంచాలని భావించినా అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితితో ఆ నిర్ణయాన్ని పక్కనె పట్టేశాయి. ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నందున ఉత్పత్తి పెంచి అందుకు తగ్గట్టుగానే ధరలనూ పెంచుతున్నాయి. చైనాలో లాక్‌డౌన్‌లు ఎత్తివేయటం వల్ల మళ్లీ కార్యకలాపాలు జోరందుకున్నాయి. అటు అమెరికాలోనూ చమురు అవసరం బాగా పెరిగింది. ఈ డిమాండ్‌ను తట్టుకునేందుకే ఒపెక్ ప్లస్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆయా దేశాల కొనుగోళ్లను తగ్గించి తద్వారా డిమాండ్‌ను తగ్గించటంలో భాగంగానే సౌదీ క్రూడ్ ఆయిల్ ధరలను పెంచిందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా మళ్లీ సామాన్యులకు చమురు ధరల వడ్డన తప్పేలా లేదు.