China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
Indian Health Agency: చైనాలో మెటానిమోవైరస్ వ్యాప్తి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భారత హెల్త్ ఏజెన్సీ డీజీహెచ్ఎస్ తాజాగా ప్రకటించింది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లుంటే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
DGHS Responds On China HMPV Virus: చైనాలో మరో వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా కలవరపాటుకు గురి చేస్తోంది. దీని ప్రభావంతో అక్కడి ప్రజలు భారీగా ఆస్పత్రులకు క్యూ కట్టారంటూ వస్తోన్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో భారత హెల్త్ ఏజెన్సీ డీజీహెచ్ఎస్ (DGHS) తాజాగా దీనిపై స్పందించింది. హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) వ్యాప్తి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని డీజీహెచ్ఎస్ ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆయన ఏం చెప్పారంటే..?
'చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్ సాధారణ జలుబుకు కారణమయ్యే ఇతర శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే ఉంటుంది. వృద్ధులు, పిల్లల్లో ఫ్లూ వంటి లక్షణాలు చూపిస్తుంది. మన దేశంలో శ్వాసకోశ సంబంధిత వైరస్‌ల వ్యాప్తికి సంబంధించిన డేటాను విశ్లేషించాం. గతేడాది డిసెంబర్ వరకూ ఉన్న సమాచారంలో గణనీయమైన మార్పులేమీ లేవు. మా సంస్థల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నమోదైన కేసులేవీ రాలేదు. శీతాకాలంలో శ్వాసకోశ వైరస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. ఇందుకోసం సాధారణంగా ఆస్పత్రులు ఇతర సామగ్రి, పడకలను సిద్ధంగా ఉంచుకోవాలి. అన్నీ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నియంత్రణకు ప్రజలు సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్న వారు ఎక్కువ మందితో కలవకూడదు. దీని ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాపించదు. మామూలుగా దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు రుమాలు లేదా టవల్‌ను అడ్డు పెట్టుకోండి. జలుబు, జ్వరం ఉంటే అవసరమైన మందులు తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.' అని అతుల్ గోయల్ పేర్కొన్నారు.
కాగా, చైనాలో మరోసారి వైరస్ వాప్తి కథనాలతో ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. చైనా ఉత్తర ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీన్ని 2001లోనే గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వైరస్ సంబంధిత లక్షణాలతో అక్కడి ప్రజలు ఆస్పత్రులకు క్యూ కట్టారంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సరత్రా ఆందోళన నెలకొంది. ఆసియా దేశాలు కూడా దీనిపై దృష్టి సారించాయి.
లక్షణాలివే..
- హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు (HMPV Virus Sympotms) సైతం ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మారిదిగానే ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు.
- దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయి.
- వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే నిమోనియా, బ్రాంకైటిస్‌కు దారితీయవచ్చు. 3 నుంచి 6 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడొచ్చు.
- చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ.
- దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లు, వైరస్ బారిన పడిన వారితో సన్నిహతంగా మెలిగితే ఇది వ్యాపించవచ్చు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- సబ్బుతో 20 సెకన్ల పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. వైరస్ బారిన పడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.
- తరచూ తాకాల్సి వచ్చే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
- దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు కవర్ చేసుకోవాలి. అనంతరం చేతులు శుభ్రం చేసుకోవాలి.