Arvind Kejriwal: ఆ వార్తలు అవాస్తవం, మనీశ్ సిసోదియా పేరు నేను చెప్పలేదు - కోర్టులో కేజ్రీవాల్ వాదనలు
Delhi Liquor Policy Scam: లిక్కర్ స్కామ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అధికారికంగా అరెస్టు చేసింది. కేజ్రీవాల్, సీబీఐ తమ వాదనలు కోర్టు ముందు వినిపించారు.
Arvind Kejriwal Case: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్, సీబీఐ ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించారు. అంతకుముందు మంగళవారం సీబీఐ అరవింద్ కేజ్రీవాల్ ను విచారించింది. ఢిల్లీలోని మద్యం దుకాణాల ప్రైవేటీకరణకు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా సిఫార్సు చేశారని కేజ్రీవాల్ పేర్కొన్నట్లు సీబీఐ కోర్టుకు తెలింది. అయితే ఈ ఆరోపణలను కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు.
నేను నిర్దోషిని
ఈ కేసులో తాను నిర్దోషినని కేజ్రీవాల్ కోర్టులో వాదించారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు తాను ఏ తప్పు చేయలేదన్నారు. “లిక్కర్ పాలసీలో మొత్తం పాత్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాదే అంటూ వాంగ్మూలం ఇచ్చానని సీబీఐ అధికారుల ప్రచారం చేస్తున్నారు. దీనిపై మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. సిసోదియాపై గానీ, ఇతర వ్యక్తులపై గానీ నేను ఎలాంటి నిందలు మోపలేదు. నేను, మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ అంతా నిర్దోషులం. మీడియాలో మాపై దుష్ప్రచారం చేయాలని సీబీఐ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. అందుకే విశ్వసనీయ వర్గాల పేరుతో ఫేక్ ప్రచారం చేసి సంచలనం సృష్టించాలని చూస్తోంది. దీనిపై స్పష్టత రావాలి” అని కోర్టులో కేజ్రీవాల్ వాదించారు.
సీబీఐ సమాధానం
తాను వాస్తవాలనే కోర్టులో వాదించానని, ఏజెన్సీలోని ఎవరూ ఏమీ చెప్పలేదని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఏ హెడ్‌లైన్‌కైనా మీడియా ప్రాధాన్యత ఇస్తుందని న్యాయమూర్తి అన్నారు. ఈ విషయంలో మీడియాను కంట్రోల్ చేయడం చాలా కష్టమన్నారు. ఈ కేసులో దాగి ఉన్న కుట్రను వెలికితీసేందుకు కేజ్రీవాల్ ను ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం ఉందని.. కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాక్ష్యాలు, ఈ కేసులో ఇతర వ్యక్తులతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. హవాలా మార్గంలో గోవా వెళ్లిన సుమారు రూ.44 కోట్ల జాడను తాము గుర్తించామని, ఆధారాలున్నాయిని సీబీఐ తరఫున హాజరైన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీపీ సింగ్ తెలిపారు. గోవాలో కేజ్రీవాల్ ఉండడానికి ఈ సొమ్ము నుంచే చరణ్‌ప్రీత్ సింగ్ చెల్లింపులు జరిపాడని పేర్కొన్నారు.
పిటిషన్ పూర్తిగా ఆధారరహితం
సీబీఐ దాఖలు చేసిన ఈ రిమాండ్ పిటిషన్ పూర్తిగా ఆధారరహితమని కేజ్రీవాల్ తరఫు లాయర్ విక్రం చౌదరి పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి ఇదో పెద్ద ఉదాహరణ అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ కీలక విషయాలను ప్రస్తావించింది. కరోనా రెండో దశలో లిక్కర్ పాలసీని తెచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఎక్సైజ్ పాలసీని త్వరగా రూపొందించాలని అడిషనల్ సెక్రటరీని కేజ్రీవాల్ ఆదేశించినట్లు సీబీఐ ఆరోపించింది. కేబినెట్ సమావేశాల్లో త్వరగా మద్యం పాలసీ పై నిర్ణయం తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారని పేర్కోంది. సౌత్ గ్రూప్ నుంచి ఆయనను కాంటాక్ట్ చేశారని, ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి సౌత్ సభ్యులు గోరంట్ల బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లైలు అందరూ కలిసి ఢిల్లీకి వచ్చారని సీబీఐ పేర్కొంది.