Swathi Muthyam Movie Review - 'స్వాతి ముత్యం' రివ్యూ : మండపంలో పెళ్లి ఆగితే అంత వినోదమా? బెల్లంకొండ గణేష్ సినిమా ఎలా ఉందంటే?
Swathi Muthyam Review : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా 'స్వాతి ముత్యం'. నిర్మాత బెల్లకొండ సురేష్ తనయుడు, సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్‌కు హీరోగా తొలి చిత్రమిది.
లక్ష్మణ్ కె కృష్ణ
బెల్లంకొండ గణేష్, వర్షా బొల్లమ్మ, రావు రమేశ్, గోపరాజు రమణ తదితరులు
సినిమా రివ్యూ : స్వాతి ముత్యం
రేటింగ్ : 2.75/5
నటీనటులు : బెల్లంకొండ గణేష్, వర్షా బొల్లమ్మ, రావు రమేశ్, నరేశ్ వీకే, గోపరాజు రమణ, 'వెన్నెల' కిశోర్, ప్రగతి, సురేఖా వాణీ, సుబ్బరాజు, దివ్య శ్రీపాద, శ్రీమన్నారాయణ తదితరులు
ఛాయాగ్రహణం : సూర్య
సంగీతం: మహతి స్వర సాగర్!
సమర్పణ : పీడీవీ ప్రసాద్
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
రచన, దర్శకత్వం : లక్ష్మణ్ కె కృష్ణ
విడుదల తేదీ: అక్టోబర్ 5, 2022
పెళ్లి నేపథ్యంలో రూపొందిన మరో సినిమా 'స్వాతి ముత్యం' (Swathi Muthyam 2022 Movie). బెల్లంకొండ సురేష్ తనయుడు, సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ (Bellamkonda Ganesh) కథానాయకుడిగా పరిచయమైన చిత్రమిది. వర్షా బొల్లమ్మ (Varsha Bollamma) హీరోయిన్. గోదావరి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది (Swathi Muthyam 2022 Review)?
కథ (Swathi Muthyam 2022 Story) : బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) స్వాతి ముత్యం లాంటి కుర్రాడు. ప్రభుత్వ ఉద్యోగి కూడానూ! చదువు పూర్తైన తర్వాత విద్యుత్ శాఖలో ఉద్యోగం అందుకున్నాడు. తల్లిదండ్రులు (రావు రమేశ్, ప్రగతి) పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతారు. కొన్ని సంబంధాలు చూశాక... ఈసారి అమ్మాయిని వాళ్ళింట్లో కాకుండా, కాఫీ షాపులో కలుస్తానని బాలమురళీ కృష్ణ చెబుతాడు. భాగ్య లక్ష్మి (వర్షా బొల్లమ్మ)ను చూడగానే ప్రేమలో పడతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నామాట. చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా... బాలమురళీ కృష్ణ, భాగ్య లక్ష్మి ఏడడుగులు వేయడానికి రెడీ అవుతారు. సరిగ్గా పెళ్లి రోజు చేతిలో చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. దాంతో పెళ్లి ఆగుతుంది.
వర్జిన్ కుర్రాడు తండ్రి ఎలా అయ్యాడు? ఆ శైలజ ఎవరు? ఆమెకు, బాలమురళీ కృష్ణకు సంబంధం ఏమిటి? తాను ప్రేమించిన యువకుడు ఓ బిడ్డకు తండ్రి అని తెలిశాక భాగ్య లక్ష్మి ఎలా స్పందించింది? ఇరు కుటుంబాల స్పందన ఏమిటి? చివరకు, మళ్ళీ బాల & భాగ్య ఎలా ఒక్కటి అయ్యారు? పెళ్లి పీటలు ఎక్కారు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Godfather Telugu Movie Review) : ప్రేమ, పెళ్లి... దాదాపుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అందుకని, ఆ నేపథ్యంలో వచ్చే చిత్రాలకూ ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. ప్రేమ, పెళ్లి నేపథ్యంలో వచ్చిన చిత్రమే 'స్వాతి ముత్యం'. కథ కంటే కథనం, కామెడీపై నమ్మకంతో రూపొందించిన చిత్రమిది.
'స్వాతి ముత్యం'లో కథ గొప్పగా ఉంటుందని చెప్పలేం. కానీ, కొన్ని క్యారెక్టర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. బంధువుల్లో, పెళ్లిలలో ఎక్కడో చూసినట్టు ఉంటాయి. ఉదాహరణకు... గోపరాజు రమణ క్యారెక్టర్. గొడవలు జరిగేటప్పుడు గోడ మీద పిల్లి తరహాలో ప్రవర్తించే అటువంటి వ్యక్తులను ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక చోటు చూసే ఉంటారు. సగటు తండ్రి పాత్రలో రావు రమేశ్ ప్రవర్తించే విధానం మన చుట్టుపక్కల ఎవరో ఒకరిని గుర్తు చేస్తుంది. కామెడీ, సెకండాఫ్ బావుంది కానీ... ఫస్టాఫ్ ప్రేక్షకులకు కొంత పరీక్ష పెడుతుంది.
హీరో హీరోయిన్స్ మధ్య సన్నివేశాలను లిటిల్ క్యూట్ రొమాంటిక్ మూమెంట్స్‌తో రాసిన దర్శకుడు... హీరో అంటే హీరోయిన్‌కు ఎందుకంత ప్రేమ? అనేది బలంగా చూపించి ఉంటే? ఫస్టాఫ్‌లో బలమైన సన్నివేశాలు రాసుకుని ఉంటే? ప్రేక్షకులకు మరోలా సినిమా కనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా పెద్దగా కథ ఏమీ ఉండదు. పెళ్లి చూపులు, పెళ్లి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చూసినట్టు ఉంటాయి. తర్వాత సన్నివేశం ఎలా ఉంటుంది? కథనం ఏంటి? అనేది ప్రేక్షకుడు సులభంగా ఊహించవచ్చు. సింపుల్ కథ కావడం మైనస్. సింపుల్ కథను వినోదాత్మకంగా తెరకెక్కించడం, మెలో డ్రామా లేకుండా చూసుకోవడం ప్లస్. సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు పర్వాలేదు. లో బడ్జెట్ సినిమాకు బెటర్ అవుట్‌పుట్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించారు. సరోగసీ నేపథ్యంలో హిందీలో 'మిమి' వచ్చింది. సినిమాకు కీలకమైన అంశం ఒక్కటే గానీ... కథ, కథనాలు, పాత్రలను నడిపించిన తీరు వేర్వేరు.
నటీనటులు ఎలా చేశారు? : సినిమాలో అసలైన హీరోలు అంటే... గోపరాజు రమణ, రావు రమేశ్. వాళ్ళిద్దరి తర్వాత సీనియర్ నరేశ్. సిట్యువేషన్ కుదిరిన ప్రతిసారీ చెలరేగిపోయారు. సెకండాఫ్‌లో, మరీ ముఖ్యంగా పతాక సన్నివేశాలకు ముందు అరగంట సేపు చక్కటి వినోదం పండించారు. హీరోగా పరిచయమైన బెల్లంకొండ గణేష్ విషయానికి వస్తే... ఎక్కడా మొదటి సినిమా హీరోలా కనిపించలేదు. పాత్రలో ఒదిగిపోయారు. గణేష్ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. పక్కింటి కుర్రాడిలా కనిపించారు. వర్షా బొల్లమ్మకు ఇటువంటి క్యారెక్టర్ చేయడం కష్టమేమీ కాదు. లవ్, ఎమోషనల్ సీన్స్ గతంలో చేశారు. మరోసారి చక్కటి అభినయం కనబరిచారు. 'వెన్నెల' కిశోర్, సుబ్బరాజు, హర్షవర్ధన్, శ్రీమన్నారాయణకు మధ్యలో కొన్ని మంచి సన్నివేశాలు పడ్డాయి. తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నవ్వించారు. ప్రగతి, సురేఖా వాణీ రెగ్యులర్ తల్లి పాత్రల్లో కనిపించారు.
Also Read : ది ఘోస్ట్ రివ్యూ: సంక్రాంతి హిట్‌ను నాగార్జున దసరాకు రిపీట్ చేశారా?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'స్వాతి ముత్యం'... ఓ చక్కటి కుటుంబ కథా చిత్రం. కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా, స్వచ్ఛమైన వినోదం కల సినిమా. అయితే, 'స్వాతి ముత్యం'లో సమస్య ఏంటంటే... ఫస్టాఫ్! సాధారణ కథ కావడంతో పెద్దగా ఎంగేజ్ చేయదు. అప్పటి వరకు కథలో కొత్తదనం కూడా ఉండదు. ఏదో అలా అలా ముందుకు వెళుతుంది. సెకండాఫ్ తర్వాతే అసలు సిసలైన కథ గానీ, వినోదం గానీ మొదలవుతుంది. కథ, కథనాల కంటే సిట్యువేషనల్ ఫన్ ఆకట్టుకుంటుంది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా, ఏమీ ఆశించకుండా థియేటర్లకు వెళితే... సరదాగా కాసేపు నవ్వుకోవచ్చు. లేదంటే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు.
Also Read : 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?