Radhe Shyam Review - ‘రాధే శ్యామ్’ రివ్యూ: విక్రమాదిత్య మెప్పించాడా?
Radhe Shyam Review Telugu: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'రాధే శ్యామ్' నేడు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?
రాధాకృష్ణ కుమార్
ప్రభాస్, పూజా హెగ్డే, భాగ్యశ్రీ తదితరులు
సినిమా రివ్యూ: రాధే శ్యామ్
రేటింగ్: 2.75/5
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, భాగ్యశ్రీ, జగపతిబాబు, మురళీ శర్మ తదితరులతో పాటు ప్రత్యేక పాత్రలో కృష్ణంరాజు
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
నేపథ్య సంగీతం: ఎస్. తమన్
స్వరాలు: జస్టిన్ ప్రభాకరన్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ
కథ, దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్
విడుదల తేదీ: మార్చి 11, 2022
ప్రభాస్ (Prabhas) లో మాసూ ఉంది, క్లాసూ ఉంది! ఆయన్ను 'బాహుబలి' (Prabhas - Baahubali) జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకు దగ్గర చేసింది. అయితే, ఆ సినిమా కంటే ముందు తెలుగులో ఆయన మాస్, కమర్షియల్, యాక్షన్ చిత్రాలు చేశారు. ప్రేమకథా చిత్రం 'డార్లింగ్' చేశారు. 'మిస్టర్ పర్‌ఫెక్ట్' లాంటి ఫ్యామిలీ టచ్ ఉన్న లవ్ స్టోరీ కూడా చేశారు. 'బాహుబలి', 'సాహో' తర్వాత... 'రాధే శ్యామ్' (Radhe Shyam Movie) అంటూ ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమ కథ చేశారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. రాధాకృష్ణ కుమార్ (Radha Krishna Kumar - Radhe shyam director) దర్శకత్వం వహించారు. ప్రచార చిత్రాలు చూస్తే... విజువల్ పరంగా గ్రాండ్‌గా ఉన్నాయి. మరి, సినిమా ఎలా ఉంది? రివ్యూ (Radhe Shyam Review) చూడండి.
కథ: విక్రమాదిత్య (ప్రభాస్) వరల్డ్ ఫేమస్ పామిస్ట్. అతను ఓసారి చెయ్యి చూసి జాతకం చెప్పాడంటే తిరుగు ఉండదు. ఎమర్జెన్సీ విధిస్తారని ఇందిరా గాంధీతో చెప్పిన ఘనుడు. అతను చెప్పినవన్నీ జరుగుతాయి. తన చేతి రేఖల్లో ప్రేమ, పెళ్లి లేవనేది విక్రమాదిత్య చెప్పే మాట. అటువంటి అతడు ప్రేరణ (పూజా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. ప్రేరణ కూడా ప్రేమిస్తుంది. ఆమె ఒక డాక్టర్. పెదనాన్న చక్రవర్తి (సచిన్ ఖేడేకర్) కూడా డాక్టర్. వాళ్ళిద్దరూ జాతకాలను నమ్మరు. మరి, విక్రమాదిత్యను ఎలా నమ్మారు? ప్రేరణకు క్యాన్సర్. ఆమె మరణిస్తుందని వైద్యులు, బతుకుతుందని విక్రమాదిత్య చెబుతారు. ఎవరి మాట నిజం అయ్యింది? విధిని వీళ్ళ ప్రేమ జయించిందా? బలి అయ్యిందా? విక్రమాదిత్య, ప్రేరణ కలిశారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: 'రాధే శ్యామ్' కంటే ముందు హీరో ప్రభాస్ గురించి చెప్పాలి. 'బాహుబలి' తర్వాత ఆయన నుంచి మాస్, యాక్షన్, కమర్షియల్ చిత్రాలను అభిమానులు, ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇటువంటి సమయంలో స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం చేయడం రిస్క్. అయినా సరే... అటువంటి ఆలోచనలను పక్కన పెట్టి 'రాధే శ్యామ్' చేశారు. ఓ ఇమేజ్‌కు బందీ కాకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ప్రభాస్‌ను అభినందించాలి. ఇక, సినిమాకు వస్తే... ఆయన లుక్స్ సూపర్.
అవును... 'రాధే శ్యామ్'లో ప్రభాస్ చాలా అందంగా ఉన్నారు. లవర్ బాయ్‌గా చాలా అదరగొట్టారు. జాతకాలు చెప్పేవాళ్ళు ఇంత అందంగా ఉంటారా? అనేలా స్టైలిష్ డ్రస్, లుక్స్‌తో మెస్మరైజ్ చేశారు. చెయ్యి చూసి భవిష్యత్ చెప్పే సన్నివేశాల్లో ప్రభాస్ లుక్స్, యాటిట్యూడ్ వల్ల హీరోయిజం ఎలివేట్ అయ్యింది. అయితే... 'నాకు రెండోసారి చూసే అలవాటు లేదు' అని ట్రైలర్‌లో డైలాగ్ చూసి, అటువంటి సన్నివేశాలు ఎక్కువ ఉంటాయని ఆశిస్తే నిరాశ తప్పదు. ప్రేమకథ అనేది మాత్రమే మైండ్‌లో పెట్టుకుని వెళితే మంచిది. ప్రభాస్‌కు జంటగా నటించిన పూజా హెగ్డే సైతం అందంగా కనిపించింది. ఇద్దరి జోడీ బావుంది. అందంగా కనిపించింది. కెమిస్ట్రీ కుదిరిందనే చెప్పాలి.
దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఎంపిక చేసుకున్న కథాంశం కొత్తగా ఉంది. విధిరాత- నేపథ్యంలో తెలుగులో కొన్ని చిత్రాలు వచ్చాయి. బహుశా... ఓ ప్రేమకథ రావడం తొలిసారి అనుకుంట! కథలో చాలా డెప్త్ ఉంది. దాన్ని ప్రేమకథకు మాత్రమే దర్శకుడు పరిమితం చేశారు. సినిమాను కళాత్మకంగా మలిచే క్రమంలో కథనంలో వేగంపై దృష్టి పెట్టలేదు. దాంతో నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. ప్రేమకథ మీద పెట్టిన దృష్టి ఇతర సన్నివేశాలపై పెట్టలేదు. ఉదాహరణకు... హీరో తల్లిగా భాగ్యశ్రీ నటించారు. ప్రభాస్, ఆమె మధ్య సన్నివేశాల్లో ఎమోషన్ మిస్ అయ్యింది. అలాగే... ప్రభాస్‌కు, ఆయన గురువు పరమహంస పాత్రలో నటించిన కృష్ణంరాజుకు మధ్య సన్నివేశాలు కూడా పేలవంగా ఉన్నాయి. అభిమానులకు ఓకే ఫ్రేములో ప్రభాస్, కృష్ణంరాజును చూడటం హ్యాపీ మూమెంట్. ఆ సీన్స్ మరింత బలంగా ఉంటే బావుంది. అయితే... కృష్ణంరాజు ద్వారా ప్రభాస్ పాత్రను పరిచయం చేయడం బావుంది. మిగతా నటీనటుల్లో ప్రభాస్ స్నేహితుడిగా హిందీ నటుడు కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేడేకర్, జయరామ్, ప్రియదర్శిలకు మంచి రోల్స్ దక్కాయి. జగపతిబాబు, రిద్ధి కుమార్ చెరో రెండు సన్నివేశాలకు పరిమితం అయ్యారు.
సాంకేతిక అంశాల విషయానికి వస్తే... ప్రొడక్షన్ డిజైన్, ప్రొడక్షన్ వేల్యూస్, తమన్ నేపథ్య సంగీతం బావున్నాయి. 1979లో ఇటలీని కళ్ళ ముందు ఆవిష్కరించినట్టు 'రాధే శ్యామ్' తీశారు. 'సంచారి...' పాటను చిత్రీకరించిన విధానం బావుంది. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన స్వరాల్లో సిద్ శ్రీరామ్ పాడిన 'నగుమోము తారలే...' బావుంది. విజువల్ పరంగా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. కొన్ని సన్నివేశాలకు సడన్‌గా కట్ పడినట్టు తెలుస్తుంది. అది మైనస్. బలమైన పతాక సన్నివేశాలు, భావోద్వేగాలు ఉండి ఉంటే... సినిమాకు మరింత బలం చేకూరేది.
Also Read: సూర్య ఈటి - ఎవరికీ తలవంచడు మూవీ రివ్యూ: తమిళ ప్రేక్షకుల కోసమేనా? తెలుగు గురించి ఆలోచించరా?
'రాధే శ్యామ్'కు బలం, బలహీనత... రెండూ ప్రభాసే. ఎందుకంటే... సినిమాలో ఆయన నుంచి ఆశించే మాస్ అంశాలు లేవు. అది బలహీనత. ప్రేక్షకులను కొంచెం డిజప్పాయింట్ చేసే అంశం. ప్రేమకథకు అవసరమైన లుక్స్, ఫీల్‌తో సినిమాకు ప్రభాస్ బలంగా నిలిచారు. విధిరాత బాలేదని నిరాశకు లోను కాకుండా పోరాడితే... మన రాత మనమే రాసుకోవచ్చని అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఇచ్చారు. చివరగా చెప్పేది ఏంటంటే... ప్రభాస్ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకోకుండా ఒక స్వచ్ఛమైన ప్రేమకథను చూడాలనుకుని వెళితే? 'రాధే శ్యామ్' నచ్చుతుంది. 'రాధే శ్యామ్' ఒక విజువల్ వండర్. మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను ఎక్కువ ఆకర్షించే సీన్స్ ఉన్నాయి. ఇదొక క్లాసిక్ ఫిల్మ్.
Also Read: 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' రివ్యూ: ఫస్టాఫ్ హిట్టు - సెకండాఫ్ గురించి మీకు అర్థమవుతోందా?