Aadavallu Meeku Joharlu Movie Review - 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' రివ్యూ: ఫస్టాఫ్ హిట్టు - సెకండాఫ్ గురించి మీకు అర్థమవుతోందా?
Aadavallu Meeku Joharlu Movie Review In Telugu - AMJ Review: శర్వానంద్, రష్మిక జంటగా నటించిన సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఎలా ఉంది?
తిరుమల కిషోర్
శర్వానంద్, రష్మిక, రాధిక, ఖుష్బూ, ఊర్వశి, 'వెన్నెల' కిషోర్ తదితరులు
సినిమా రివ్యూ: 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'
రేటింగ్: 2.5/5
నటీనటులు: శర్వానంద్, రష్మిక, రాధిక, ఖుష్బూ, ఊర్వశి, ఝాన్సీ, 'వెన్నెల' కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: తిరుమల కిషోర్
విడుదల తేదీ: మార్చి 4, 2022
'ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు' అన్నారు పెద్దలు. ఈ సామెత వెనుక అర్థం ఏమిటంటే... రెండు పనులూ చాలా కష్టమని! పెళ్లి చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ ఈ రోజుల్లో పెళ్లి కాని ప్రసాద్‌లు చాలా ఎక్కువ అవుతున్నారు. పెళ్లి నేపథ్యంలోని కథతో తెరకెక్కిన చిత్రమే 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' (aadavallu meeku joharlu). ఇంట్లో అబ్బాయికి పెళ్లి చేయడానికి మహిళలు అందరూ కలిసి ఏం చేశారు? అనేది చిత్రకథ. పెళ్లి విషయంలో ఈతరం అమ్మాయిల అభిప్రాయాలు ఏమిటి? వంటి అంశాన్నీ చర్చించారు. శర్వానంద్, రష్మిక (rashmika) జంటగా నటించిన ఈ 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' (aadavallu meeku joharlu movie review) ఎలా ఉంది?
కథ: చిరు అలియాస్ చిరంజీవి (శర్వానంద్)కి 36 ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. చిరు అమ్మతో (రాధికా శరత్ కుమార్)తో పాటు ఇంట్లో ఆడవాళ్ళు (ఊర్వశి, కల్యాణి నటరాజన్, సత్యకృష్ణన్ & కో) అందరూ వచ్చిన సంబంధాలు రిజెక్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేయడం కాదు, చిరును అమ్మాయిలు రిజెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు చిరుకు ఆద్య (రష్మిక) పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. మొదట ప్రపోజ్ చేయడానికి సందేహించినా... చివరకు చెప్పేస్తాడు. కానీ, ఆద్య ఒప్పుకోదు. తన తల్లి వకుళ (ఖుష్బూ) ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోనని, పెళ్లికి తన తల్లి ఒప్పుకోదని చెబుతుంది. ఆద్యను, ఆమె తల్లిని చిరంజీవి ఎలా ఒప్పించాడు? అందులో చిరు ఫ్యామిలీ రోల్ ఏంటి? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'... ఆల్రెడీ మీరు ట్రైలర్లు, సాంగ్స్ చూస్తే ఈ సినిమా జానర్ ఏంటి? అనేది అర్థమై ఉంటుంది. యాక్చువల్లీ... టీజర్, ట్రైలర్‌లో శర్వానంద్ క్యారెక్టర్ చాలా మందికి కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే... పెళ్లి కాని ప్రసాద్‌లు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. పెళ్లి సంబంధాల విషయంలో ప్రతి ఒక్కరిదీ ఒక్కో అనుభవం. తెరపై సన్నివేశాలు సమాజంలో ఎవరో ఒకరి పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఆ సన్నివేశాలు వినోదాత్మకంగా కూడా ఉన్నాయి. ప్రథమార్థం అంతా ఆసక్తికరంగా, సున్నితమైన హాస్యభరిత సన్నివేశాలతో సాగుతుంది. ద్వితీయార్థం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. కామెడీ బ్యాక్ సీట్ తీసుకుని... ఎమోషన్ ఫ్రంట్ సీట్ తీసుకుంది. అక్కడ అసలు సమస్య మొదలైంది.
దర్శకుడు తిరుమల కిషోర్ సినిమాలు చూస్తే... కథ కంటే కథనం, సన్నివేశాలపై ఎక్కువ దృష్టి పెడతారు. ఆయన రాసే సంభాషణలు ప్రేక్షకుడి హృదయం నుంచి వచ్చినట్టు ఉంటాయి. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాలో అది లోపించింది. అందుకు కారణం కిషోర్ తిరుమల అని చెప్పాలి. ఎందుకంటే... ఈ సినిమా ద్వితీయార్థంలో ఆయన తీసిన హిట్ సినిమా 'నేను శైలజ' ఛాయలు కనిపిస్తాయి. ఆ మాటకు వస్తే... హీరోయిన్ ఇంటికి హీరో వెళ్లడం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. పాత కథను కొత్తగా చెప్పడంతో విఫలమయ్యారు.
'నేను శైలజ'లో కీర్తీ సురేష్ ఇంటికి రామ్ వెళ్ళడం, పరిస్థితి అర్థం చేసుకుని ప్రవర్తించడం జరుగుతాయి. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'లో రష్మిక ఇంటికి శర్వా వెళ్తారు. ఆ సినిమాకు, ఈ సినిమాకు వ్యత్యాసం ఏంటంటే... అక్కడ కీర్తీ సురేష్‌కు పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఇక్కడ రష్మికకు పెళ్లి ఫిక్స్ కాదు. తండ్రి కోసం కీర్తీ సురేష్ ప్రేమను కాదనుకుంటుంది. ఇక్కడ తల్లి కోసం రష్మిక ప్రేమను కాదనుకుంటుంది. మిగతాదంతా ఇంచుమించు ఒకేలా అనిపిస్తుంది. అది సినిమాకు మైనస్. అలాగని, రెండు సినిమాలు ఒక్కటే అని చెప్పడం లేదు. 'నేను శైలజ', 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'... రెండు సినిమాల మధ్య, కథల పరంగా వ్యత్యాసం ఉంటుంది. 'నేను శైలజ' సినిమాలో ప్రదీప్ రావత్ కామెడీ వర్కవుట్ అయినట్టు... 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'లో వర్కవుట్ అవ్వలేదు. సత్య - ప్రదీప్ రావత్ ట్రాక్ నవ్వించలేదు.
కథ పక్కన పెడితే... ఎప్పటిలా తిరుమల కిషోర్ మంచి మాటలు రాశారు. వాడుక భాష నుంచి బయటకు వెళ్ళకుండా మంచి మాటలు రాయడం ఆయన శైలి. ఈ సినిమాలోనూ అటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ పాటలు సోసోగా ఉన్నప్పటికీ... నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టు ఉంది. వినోదాత్మక సన్నివేశాల్లో ఆయన నేపథ్య సంగీతం బావుందని చెప్పాలి.
శర్వానంద్, రష్మిక జోడి బావుంది. పాత్రలకు పర్ఫెక్ట్ సెట్. రాధిక, ఖుష్బూ, ఊర్వశి, ఝాన్సీ... ప్రతిభావంతులైన ఆర్టిస్టులు ఉండటంతో తెర నిండుగా కనిపించింది. నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే... వాళ్ళకు బలమైన పాత్రలు, సన్నివేశాలు పడలేదు. 'వెన్నెల' కిషోర్ - శర్వా మిడ్ నైట్ ఫోన్ కాల్ సీన్, ఉర్వశి జిలేబీ డబ్బా అడిగే సన్నివేశాలు నవ్విస్తాయి. సెకండాఫ్‌లో రవిశంకర్ ఇంటి దగ్గర శర్వా, 'వెన్నెల' కిషోర్ చేసే హంగామా కూడా బావుంటుంది. సినిమా అంతా సున్నితమైన హాస్యభరిత సన్నివేశాలతో సాగుతుంది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా కావడం 'ఆడవాళ్ళు...'కు ప్లస్ పాయింట్.
Also Read: 'సెబాస్టియన్ పీసీ 524' రివ్యూ: సెబా కామెడీ బావుంది కానీ
'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా గురించి చెప్పాలంటే... ఫస్టాఫ్ హిట్టు! సెకండాఫ్ గురించి చెప్పింది మీకు అర్థమవుతోందా? అదీ సంగతి! ఫస్టాఫ్ కోసం సినిమాను ఒకసారి చూసే ప్రయత్నం చేయవచ్చు. సెకండాఫ్ కథకు వస్తే ఆలోచించాలి.