Liver Health: సమయానికి తినకపోతే చనిపోతారా? నటి సుబీ సురేష్ మరణానికి కారణాలివే!
కాలేయంలో కొవ్వు పేరుకుపోతే అది తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే జీవనశైలిలో తప్పకుండా మార్పులు చేసుకోవాలి.
ప్రముఖ మలయాళ హాస్యనటి సుబీ సురేష్ కాలేయ సంబంధిత సమస్యతో పోరాడుతూ ప్రాణాలు విడిచింది. కేవలం 41 సంవత్సరాల వయస్సులోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గతంలో పలు ఇంటర్వ్యూస్ లో సుబీ మాట్లాడుతూ తన అనారోగ్య జీవనశైలి కారణంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పుకొచ్చారు. సమయానికి తినలేకపోవడం, ఇతరత్రా ఆరోగ్య సమస్యల కారణంగా మందులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. తన అనారోగ్య జీవనశైలి కారణంగా ఆమె కాలేయంపై తీవ్ర ప్రభావం చూపింది. అందుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. కాలేయం దెబ్బతినడం వల్ల ప్రాణాలు విడిచింది.
శరీరంలో అతిపెద్ద రెండో అవయవం కాలేయం. శరీర విధులు సక్రమంగా జరగాలంటే కాలేయం ఆరోగ్యంగా ఉండాలి. కానీ హానికరమైన అలవాట్ల, అనారోగ్యపు జీవనశైలి కారణంగా కాలేయాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలేయాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ పనులు, అలవాట్లు వెంటనే మానుకోవాలి.
అధిక మద్యపానం
అతిగా ఆల్కాహాల్ తీసుకోవడం శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. ఆల్కహాల్ లో హానికర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయంలో కొవ్వు ఏర్పడటానికి దారితీస్తుంది. దీని వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది తీవ్రంగా ఉంటే ప్రాణాంతకం కూడా కావచ్చు.
ధూమపానం
జర్నల్ ఆఫ్ హెపటాలజీలో ప్రచురించబడిన 2022 అధ్యయనం ప్రకారం కాలేయ వ్యాధి ఉన్న రోగులలో 40 శాతం మందికి ధూమపాన అలవాటు ఉందని తేలింది. ధూమపానం శరీరానికి విషాన్ని జోడించడమే కాకుండా కాలేయంపై భారాన్ని పెంచుతుంది. దీని వల్ల హృదయ సంబంధ సమస్యలు, ఎక్స్‌ట్రాహెపాటిక్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.
ఊబకాయం
మద్యం సేవించడం వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తే.. ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ కారణంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. అందుకే చక్కెర వంటి సాధరణ కార్బోహైడ్రేట్లని తగ్గించడం చాలా అవసరం. ఎక్కువగా పండ్లు, కూరగాయాలు, ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
డైట్
అధిక కొవ్వు, కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, తగినంత విటమిన్స్ తీసుకోకపోవడం, ఇన్సులిన్ నిరోధకత కాలేయంపై ప్రతికూల ప్రభావాలని చూపిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడకుండా ఉండాలంటే పోషకాలు నిండిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మరణాల ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
టాక్సిన్స్
రక్తం నుంచి విషాన్ని తొలగించే బాధ్యత కాలేయానిదే. కానీ టాక్సిన్స్ ఎక్కువగా ఉంటే మాత్రం అది కాలేయాన్ని ప్రమాదంలో పడేస్తుంది. అందుకే బయట నుంచి కొనుగోలు చేసే ప్రతి పదార్థాలు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. పండ్లు, కూరగాయలపై ఉపయోగించే పురుగుమందుల్లో కనిపించే టాక్సిన్స్ శరీరంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవడం చాలా అవసరం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మధుమేహులు ఒంటె పాలు తీసుకోవచ్చా? వాటి ఖరీదు తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే!