Shopping Rush In America: ఫెస్టివ్ సీజన్ కాదు, ఆఫర్లేమీ లేవు - అయినా అమెరికన్ షాపుల్లో ఫుల్ రష్
Donald Trump Tariff Policy: అమెరికాలో టీవీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌ల నుంచి సాల్ట్ అండ్ పెప్పర్ వరకు ప్రతిదీ కొనడానికి ప్రజలు పోటీ పడుతున్నారు. ముందే వస్తువులు కొని నిల్వ చేసుకుంటున్నారు.

Donald Trump Reciprocal Tariff Policy: ప్రస్తుతం, అగ్ర దేశం అమెరికాలో షాపింగ్ కోసం ప్రజలు భారీగా పోటీలు పడుతున్నారు. ఉప్పు & పప్పుల నుంచి ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మద్యం వరకు చాలా పెద్ద మొత్తంలో షాపింగ్ జరుగుతోంది. మాల్స్, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ (సూపర్ మార్కెట్లు) జనంతో కిటకిటలాడుతున్నాయి. ప్రతీ వస్తువు కోసం అక్కడ పోటీ కనిపిస్తోంది. సాధారణంగా, అమెరికాలో ఇలాంటి రష్ న్యూ ఇయర్, క్రిస్మస్, థాంక్స్ గివింగ్ డే వంటి సందర్భాల్లో ఉంటుంది. ఆ సమయంలో భారీ స్థాయిలో ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో ఫెస్టివ్ సీజన్ కాదు, ఎలాంటి ఆఫర్లు & డిస్కౌంట్లు లేవు. అయినా మాల్స్, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో రద్దీ కనిపిస్తోంది.
అమెరికాలో ప్రస్తుత షాపింగ్ రద్దీకి కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). ట్రంప్ టారిఫ్ (Trump Tariff) విధానంపై అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు & ద్రవ్యోల్బణం గురించి భయపడుతున్నారు. కాబట్టి, ధరలు పెరగకముందే, ఇంటికి అవసరమైన వస్తువులను ముందస్తుగా కొనుగోలు చేసి దాచుకోవడంలో బిజీగా ఉన్నారు. ట్రంప్ సుంకాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని అక్కడి ఆర్థికవేత్తలు కూడా భావిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందనే భయాన్ని ఇప్పటికే కొంతమంది ఎకనమిక్ ఎక్స్‌పర్ట్స్ వ్యక్తం చేశారు.
అమాంతం పెరిగిన కార్ల అమ్మకాలు
వాస్తవానికి, అమెరికాలో షాపింగ్ సందడి ఇప్పుడే మొదలు కాలేదు, గత రెండు నెలలుగా కొనసాగుతోంది. ట్రంప్ సుంకాల కారణంగా, మార్చి నెలలోనే ఆటోమొబైల్ రంగంలో భారీ వృద్ధి కనిపించింది. విదేశీ వాహనాలు & వాహనాల విడిభాగాలపై ట్రంప్ 25 శాతం సుంకాన్ని ప్రకటించిన వెంటనే ప్రజలు డీలర్‌షిప్‌లకు (వాహన షోరూమ్‌లు) పోటెత్తారు. కొత్త సుంకాలు అమల్లోకి రాకముందే కొత్త వాహనాలు బుక్ చేసుకున్నారు & విడిభాగాలు కొనుక్కున్నారు. ఫలితంగా, మార్చిలో కార్ల అమ్మకాలు 11.3 శాతం పెరిగాయి. ఈ సుంకం ఈ నెల (ఏప్రిల్ 2025) 03వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
న్యూయార్క్‌లోని క్వీన్స్‌కు చెందిన 50 ఏళ్ల నోయెల్ పెగ్యురో, ట్రంప్ సుంకం అమల్లోకి రాకముందే, కారు విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ & తోట పని సామాగ్రి కోసం దాదాపు 3,500 డాలర్లు ఖర్చు చేశానని వెల్లడించారు. తన కుమారుడి కోసం 40 అంగుళాల హిస్సెన్స్ టెలివిజన్ & మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్ కూడా కొన్నారు. ABC న్యూస్‌తో మాట్లాడిన నోయెల్, "ఈ వస్తువులు కొనాలని నేను చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నా. కానీ, ట్రంప్ సుంకాల వల్ల ఆకస్మిక ధరల పెరుగుదల నుంచి తప్పించుకోవడానికి వాటిని ఇప్పుడే కొనాలని నిర్ణయించుకున్నా" అన్నారు.
మొదట బేస్‌లైన్, ఇప్పుడు ప్రతీకారం
కొత్త టారిఫ్‌లు అమల్లోకి రాకముందే కొన్ని వస్తువులను ముందస్తుగా కొనుగోలు చేయడం తెలివైన పనే అయినప్పటికీ, భవిష్యత్ కోసం వాటిని దాచుకోవాలని అనుకున్నప్పుడు రుణాలు తీసుకోకుండా ఉండటం కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం బేస్‌లైన్ సుంకం విధించింది. దీంతో పాటు, తన 60కి పైగా వాణిజ్య భాగస్వాములపై (దేశాలు) ప్రతీకార సుంకం (Reciprocal Tariff) విధిస్తూ గత వారంలో ప్రకటన చేసింది, ఇవి ఏప్రిల్ 09 నుంచి అమలులోకి వస్తాయి.





















