Single Bank Country: దేశం మొత్తానికి ఒకే బ్యాంక్, ఒక్క ATM కూడా లేదు, లావాదేవీలన్నీ క్యాష్‌లోనే
No ATM Country In the World: దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ దేశంలో ఒక్క ATM కూడా లేదు. ఆర్థిక లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరుగుతాయి.

Not A Single ATM In The Entire Country: మన దేశంలో నగరాలతో పాటు చిన్న పట్టణాలు, గ్రామాలలో కూడా ఏదోక బ్యాంక్ శాఖ కనిపిస్తుంది. ఈ బ్యాంకులు ఎప్పుడు చూసినా ఖాతాదార్లతో రద్దీగా కనిపిస్తాయి. బ్యాంకు సిబ్బంది కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కస్టమర్లతో బిజీగా ఉంటారు. దేశంలోని ఏ మూలకు వెళ్లినా బ్యాంకింగ్ ఫెసిలిటీ ఏదోక రూపంలో కనిపిస్తుంది. బ్యాంక్ వ్యవహారాల విషయంలో ప్రజలకు కనీస అవగాహన ఉంది. మన దగ్గర ఇప్పుడంతా UPI (Unified Payments Interface) గాలి వీస్తోంది. చిన్న పల్లెల్లో ఉన్న ప్రజలు కూడా భౌతిక డబ్బు బదులు యూపీఐని విరివిగా వినియోగిస్తున్నారు. టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి చెందిన ఈ యుగంలోనూ... ఒకే ఒక్క బ్యాంక్ ఉండి & ఒక్క ATM కూడా లేని ఒక దేశం ప్రపంచంలో ఒకటి ఉంది. అక్కడ అన్ని ఆర్థిక లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతాయి. మీరు నమ్మలేకపోయినా, ఇది నిజం.
నేషనల్ బ్యాంక్ మాత్రమే
దేశం మొత్తానికి ఒకే ఒక్క బ్యాంక్ ఉన్న దేశం పేరు "టువలు" (Tuvalu). ఇది ఒక ద్వీప దేశం, అంటే ఎనిమిది దిక్కుల్లోనూ నీళ్లు ఉన్న ప్రాంతం. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఓషియానియాలోని పాలినేషియా ఉపప్రాంతంలో ఈ దేశం ఉంది. దేశ జనాభా గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. టువలు దేశ జనాభా కేవలం 11,000 నుంచి 12,000 మధ్య ఉంటుంది. ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన దేశాలలో ఇది ఒకటి. ఈ దేశ వైశాల్యం కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది, కేవలం 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో టువలు విస్తరించి ఉంది. తొమ్మిది చిన్న పగడపు దీవులు (అatolls) & పగడపు దిబ్బలను కలిగి ఉంది.
టువలు రాజధాని నగరం పేరు "ఫనాఫుటి" (Funafuti). ముందే చెప్పుకున్నట్లు, ఈ దేశం మొత్తానికి ఒకే ఒక్క బ్యాంక్ ఉంది. దేశ కేంద్ర బ్యాంక్ అయిన "నేషనల్ బ్యాంక్ ఆఫ్ టువలు" (National Bank of Tuvalu) మాత్రమే బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడర్. బార్‌క్లేస్ బ్యాంక్ (Barclays) అనుబంధ సంస్థగా 1980లో ఏర్పాటైంది. ఆస్ట్రేలియన్ డాలర్ (Australian Dollar) ఇక్కడ ప్రధాన కరెన్సీ. దీంతో పాటు, టువలుకు సొంత నాణేలు కూడా చెలామణిలో ఉన్నాయి.
ఆంగ్లేయుల పాలనలో ఉన్న దేశం
టువలు, 2000 సెప్టెంబర్ 05న ఐక్యరాజ్యసమితిలో 189వ సభ్య దేశంగా చేరింది. ఈ దేశానికి కామన్వెల్త్‌లో కూడా సభ్యత్వం ఉంది. బ్రిటిష్ కాలనీలో భాగమైన టువలును గతంలో ఎల్లిస్ ఐలాండ్స్ (Ellis Islands) అని పిలిచేవారు. 01 అక్టోబర్ 1978న, టువలు బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది & రాజ్యాంగ రాచరిక (constitutional Monarchy) దేశంగా ఉద్భవించింది, ఇది నేటికీ అమలులో ఉంది.
టువలు ఆదాయ వనరులు
టువలు రాజు చార్లెస్ III దేశాధినేత. టువలుకు ప్రధాన ఆదాయ వనరు దాని ఇంటర్నెట్ డొమైన్ .tv. దీనిని అమ్మడం ద్వారా ఈ దేశం డబ్బు సంపాదిస్తుంది. దీంతోపాటు, టువలు ఇతర దేశాలకు ఫిషింగ్ లైసెన్స్‌లు విక్రయిస్తుంది. దీని వల్ల కూడా మంచి ఆదాయం ఆర్జిస్తుంది. ఈ చిన్న దేశానికి విదేశీ సాయం కూడా అందుతుంది.
వాతావరణ మార్పుల ప్రమాదం
ఆకాశం నుంచి చూస్తే, దాదాపు 90 డిగ్రీల వంపు తిరిగిన కోణంతో ఈ దేశం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే, వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాలలో ఒకటిగా టువలును గుర్తించారు. సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఈ చిన్న దేశం అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

