Pushpa Movie In Russia: రష్యాలో ‘పుష్ప‘కు గట్టి ఎదురుదెబ్బ, మూవీ డిజాస్టర్ - రూ.3 కోట్లు నష్టం?
ఇండియాలో సత్తా చాటిన ‘పుష్ప‘ రష్యాలో మాత్రం హిట్ కొట్టలేకపోయింది. కనీస ఆదరణ దక్కించుకోలేకపోయింది. కలెక్షన్ల మాట అటుంచితే రూ.3 కోట్ల మేర నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇండియాలో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, తాజాగా ఈ సినిమాను రష్యాలో విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ. హీరో, హీరోయిన్, దర్శకుడు సహా పలువు రష్యాకు వెళ్లి భారీగా సినిమా ప్రమోషన్స్ చేశారు. ఈ ప్రచారం కోసం భారీగా ఖర్చు చేశారు. కానీ, ‘పుష్ప’ టీమ్ ప్రయత్నాలు ఫలించలేదు.
రష్యాలో ‘పుష్ప’ డిజాస్టర్
రష్యాలో ఈ సినిమా ఓ రేంజిలో సక్సెస్ అవుతుందని చిత్ర బృందం భావించినా, కనీస ఆదరణ దక్కించుకోలేదని తెలుస్తోంది. భారీ స్థాయిలో విడుదలై అదే స్థాయిలో కలెక్షన్లు రాబట్టడంలో ఈ చిత్రం విఫలం అయ్యింది. ఈ సినిమా విడుదలైన థియేటర్లలో కనీసం ఆదరణ కనిపించలేదని తెలిసింది. రష్యాలో సరైన ఓపెనింగ్స్ రాలేదు. తొలి రోజు ఫర్వాలేదు అనిపించినా, రోజు రోజుకు ఈ సినిమాకు ఆదరణ తగ్గిపోయింది. కేవలం మూడు రోజుల్లోనే థియేటర్ల నుంచి ఈ సినిమాను తీసేసినట్లు తెలుస్తోంది. ఈనెల 8న ‘పుష్ప’ సినిమా రష్యాలో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్ కోసం ‘పుష్ప’ టీమ్ మాస్కోకు వెళ్లింది. అక్కడి మీడియాకు వరుస బెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ప్రమోషన్స్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకపోయినా, థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో సక్సెస్ కాలేకపోయింది. మొత్తంగా ఈ సినిమా రష్యాలో డిజాస్టర్ గా మిగిలింది.
రష్యాలో ఇప్పుడు ‘పుష్ప’ విడుదలే తప్పు!
వాస్తవానికి రష్యాలో ‘పుష్ప’ సినిమాను విడుదల చేయాలి అనుకోవడమే సినిమా యూనిట్ చేసిన తొలి తప్పు అని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. రష్యాలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఉక్రెయిన్ తో వార్ నేపథ్యంలో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ప్రజలు ఆందోళనలో ఉన్నారు. వారి దగ్గరున్న ఆర్థిక వనరులు కూడా రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాను చూసి ఎంజాయ్ చేసే పరిస్థితిలో అక్కడి ప్రజలు లేరు. రష్యాలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే ‘పుష్ప’ ఫ్లాప్ అయ్యిందని క్రిటిక్స్ అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఖర్చు చేసిన రూ. 3 కోట్లు కూడా తిరిగి రాలేదని తెలుస్తోంది.
కొనసాగుతున్న ‘పుష్ప-2’ నిర్మాణ పనులు
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-ది రైజ్’ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ముత్తంశెట్టి మీడియా, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తగా ఈ సినిమాను నిర్మించారు. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రూ. 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ‘పుష్ప2’ సినిమా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
Read Also: ఒక్కో కుటుంబంలో పది మంది హీరోలున్నారు - టాలీవుడ్‌పై అడవి శేష్ వివాదాస్పద వ్యాఖ్యలు