Bhogi festival 2024: భోగి మంటలు చలికాచుకోవడానికి కాదు - ఆంతర్యం ఇదే!
Bhogi festival 2024: 2024 జనవరి 14 వ తేదీ భోగిపండుగ. ఈ రోజు తెల్లవారుజామునే చలిగాలుల మధ్య వెచ్చని భోగిమంట వేసుకుని సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం పలుకుతారు. అయితే భోగిమంటల్లో ఇవిమాత్రం అస్సలు వేయకండి.
![Bhogi festival 2024: భోగి మంటలు చలికాచుకోవడానికి కాదు - ఆంతర్యం ఇదే! Makar Sankranti 2024 importance and significance of bhogi mantalu Bhogi festival 2024: భోగి మంటలు చలికాచుకోవడానికి కాదు - ఆంతర్యం ఇదే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/2fa763766ec1453945b92c309c701fbf1704954859831217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Significance of Bhogi Mantalu : సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. చలి తారస్థాయిలో ఉంటుందనే భోగిమంటలు వేసుకోవాలని చెబుతారు. భోగినాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో భోగిమంటలు వాతావరణంలో వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతి నాటికి పంట కోతలు పూర్తవడంతో పొలాల నుంచి వచ్చే పురుగులను తిప్పికొట్టేందుకు కూడా భోగిమంటలు ఉపయోగపడతాయి. భోగి మంట వెనక మరో విశేషం ఏంటంటే సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి అడుగుపెడతాడు. ఈ రోజు నుంచి ఎండ చురుగ్గా ఉంటుంది. అంటే వాతావరణంలో ఒక్కసారిగా వచ్చే మార్పులను తట్టుకునేందుకు శరీరాన్ని సిద్ధం చేసేందుకే భోగి మంటలు.
Also Read: ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకంటారు!
అగ్నిని ఆరాధించే సందర్భం
భోగిమంటలు అంటే కేవలం చలిమంటలు కాదు. అగ్నిని ఆరాధించే ఓ సందర్భం. అందుకే హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగిమంటను అంతే పవిత్రంగా వెలిగించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించిన తర్వాతే భోగి మంట వెలిగించాలి. ఒకప్పుడు భోగిమంటల్లో చెట్టు బెరడు, పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బిళ్లను పిడకలుగా చేసి భోగిమంటలో వేసేవారు. ఇవి బాగా మండేందుకు ఆవు నెయ్యి వేసేవారు. పిడకలు, ఆవునెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధగుణాలు ఉంటాయి. పిడకలు, చెట్టు బెరడు ఉపయోగించలేని వారు కనీసం తాటి, కొబ్బరి ఆకులు , ఎండిన కొమ్మలతో భోగిమంట వేసేవారు.
Also Read: భోగిపళ్లు ఎందుకు పోయాలి - రేగుపళ్లే ఎందుకు!
పర్యావరణం కలుషితం చేస్తున్నారు
కాలం మారింది..పవిత్రమైన బోగిమంటలు కూడా ఫ్యాషన్ గా మారిపోయాయి. చెట్టు, పాత కలప కాకుండా..ఇంట్లో ఉన్న చెత్తా చెదారం, ప్లాస్టిక్ సామాన్లు మంటల్లో వేస్తున్నారు. అవి సరిగా మండకపోతే పెట్రోల్, కిరోసిన్ పోస్తున్నారు. దీంతో భోగిమంటల వెచ్చదనం, సంక్రాంతి సందడి మాటేమో కానీ వాతావరణం కలుషితం అవుతోంది. ఈ గాలి పీల్చితే అనారోగ్యం రావడం ఖాయం.
Also Read: సంక్రాంతికి నాన్ వెజ్ తింటున్నారా - పండుగ వేళ మీరు అస్సలు చేయకూడని పనులివే!
భోగిమంట వేయకపోయినా పర్వాలేదు కానీ..
పిడకలు, చెట్టు బెరడు, కలపతో భోగి మంటలు వేయాలి..అవి లేకపోతే భోగిమంటలు వేసుకోపోవడమే మంచిది కానీ ప్లాస్టిక్, చెత్తా-చెదారంతో భోగిమంట వేసి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పాడుచేయొద్దంటున్నారు పండితులు, ఆరోగ్య -పర్యావరణ నిపుణులు.
- 2024లో జనవరి 14 ఆదివారం భోగి
- జనవరి 15 సోమవారం సంక్రాంతి
- జనవరి 16 మంగళవారం కనుమ
- జనవరి 17 బుధవారం ముక్కనుమ
Also Read: ఇంటి ముందు ముగ్గు లేకపోతే అంత అపచారమా - సంక్రాంతికి మరింత ప్రత్యేకం ఎందుకు!
భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం, శ్రీ రంగనాథ స్వామిలో గోదా దేవి లీనమై భోగాన్ని పొందిందని..దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చిందని చెబుతారు. శ్రీ మహా విష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి గర్వం అణిచివేస్తూ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే .
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)