Operation Sagar Kavach: ఏపీ తీరప్రాంతంలో అలజడి.. మోహరించిన పోలీసు, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు.. తీరా చూస్తే
2008 నవంబర్ 26 కసబ్ ఉదంతం గుర్తుండే ఉంటుంది.సముద్ర జలాలమీదుగా దేశంలోకి చొరబడిన ముష్కరులు నరమేథాన్ని సృష్టించారు. ఆ ఉదంతంతో తీర ప్రాంత భ్రదతపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.

Andhra Pradesh News | ఏపీ సముద్రతీర ప్రాంతంలో ఒక్కటే అలజడి.. ఎక్కడికక్కడే తీరప్రాంతం అంతా మోహరించిన పోలీసు, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు.. మరో పక్క సముద్ర జలాల్లో కోస్ట్‌గార్డు సెక్యూరిటీ పోలీసులు పహరా.. సముద్రతీర ప్రాంతం అంతా ఒక్కటే అలజడి.. సముద్రతీర ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో స్థానికులు... కాసేపటికి సముద్రంలోనుంచి ఓ అపరిచిత బోటులో తీరభూభాగంలోకి చొరబడిన అగంతకులు.. వారిని చాటుగా గమనించి ఆయుధాలతో చుట్టుముట్టిన పోలీసులు.. సముద్ర జలాల్లోంచి మన భూభాగంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్నంతగా సీన్ క్రియేషన్.. ఇదంతా ఆపరేషన్ సాగర్ కవచ్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు తీరప్రాంత ప్రజలు.. తీర ప్రాంత భద్రతకు పోలీస్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, కోస్టుగార్డు సిబ్బంది కలిపి సంయుక్తంగా నిర్వహించే ఈ మాక్‌డ్రిల్‌నే సాగర్ కవచ్ అంటారు.. ఇది ప్రతీ ఏటా ఏప్రిల్ నెలలోనూ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో నిర్వహిస్తుంటారు..
సాగర్ కవచ్ అంటే ఏమిటి..?
తీరప్రాంత భద్రతతోపాటు, సముద్ర జలాలనుంచి భారత భూభాగంలోకి ముష్కరుల అక్రమ చొరబాట్లును అడ్డుకట్ట వేసే ప్రక్రియలో భాగంగా ప్రతీ ఏటా ఈ మాక్ డ్రిల్‌ను కేంద్ర హోంశాఖ ఆదేశాలతో నిర్వహిస్తుంటారు. దీనికి కోస్ట్‌గార్డు విభాగం నుంచి ప్రత్యేక బృందాలను అపరిచిత వ్యక్తులుగా సముద్రంలోకి పంపిస్తారు. వీరు సముద్రంలో బోటు ద్వారా ప్రయాణిస్తూ ఏదో ఓ ప్రాంతంలో తీరానికిచేరుకుంటారు.. అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నంను అక్కడే తీరప్రాంతంలో అప్పటికే గస్తీ కాస్తున్న పోలీసు సిబ్బంది గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంటారు.. తీరప్రాంతంలో గస్తీ ప్రక్రియ అంతా స్థానిక పోలీసులతోపాటు కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు(మెరైన్ పోలీసులు) బాద్యత వహిస్తారు.
కోస్ట్‌గార్డు సెక్యూరిటీ సిబ్బంది సముద్రంలో అపరిచిత వ్యక్తులుగా తిరుగుతున్న వారిని గుర్తించి వారిని వెంబడిరచడమే కాకుండా వారి కదలికలను ఎప్పటికప్పుడు తీరంలో గస్తీ కాస్తున్న పోలీసులకు సమాచారం అందిస్తారు. సముద్ర జలాల్లోంచి తీరంలోకి చొరబడిన అపరిచిత వ్యక్తులను అరెస్ట్‌చేయడంతో ఆపరేషన్ సాగర్ కవచ్ ప్రక్రియ ముగుస్తుంది.. ఈప్రక్రియలో మత్స్యకారులకు కూడా అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా తీర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తారు. తీరప్రాంతంలో అపరిచిత వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించి సూచిస్తారు..
ముంబై ఘటనతో అప్రమత్తం..
ముంబై కసబ్ ఉదంతం గుర్తుండే ఉంటుంది.. పాకిస్తాన్‌కు చెందిన లష్కర్ తోయిబా ఉగ్రవాదులు ముంబైలోని తాజ్‌హోటల్, ఒబెరాయ్, చత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, నరిమన్ హౌస్ వంటి ప్రదేశాలపై దాడులకు తెగబడి మరణకాండ సాగించారు. 2008 నవంబర్ 26న ముష్కరులు చేసిన ఈదాడుల్లో 166 మంది మరణించగా 300 మందికిపైబడి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఉగ్రవాదులంతా సముద్ర జలాలమీదుగా ముంబైలోకి చొరబడిన నేపథ్యంలో ఈదాడి భారత్‌లోని భద్రతా చర్యలను మరింత బలోపేతం దిశగా నడిపించింది.
ఆనాటి నుంచి తీరప్రాంత భద్రతలను భారత ప్రభుత్వం మరింత పటిష్టం చేసింది.. తీరప్రాంతాల్లో కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లు నిర్మించింది.. తీరప్రాంతంలో ఆపరేషన్ హమ్లా పేరుతో ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించి అపరిచిత వ్యక్తుల ప్రవేశంపై స్థానికులకు, మత్స్యకారులకు అవగాహన కల్పించింది.. అయితే ఇప్పుడు ఆపరేషన్ హమ్లా పేరు సాగర్ కవచ్‌గా మార్పుచేశారు.



















