Pawan Kalyan: కోపాలు ఊరికే రావు, చర్చిలో ఇలాగే జరిగితే జగన్ ఊరుకుంటారా? - పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం
Pawan Kalyan on Tirumala: గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవన్ కల్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
![Pawan Kalyan: కోపాలు ఊరికే రావు, చర్చిలో ఇలాగే జరిగితే జగన్ ఊరుకుంటారా? - పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం AP Deputy Chief Minister Pawan Kalyan takes deeksha against Tirumala Laddu issue Pawan Kalyan: కోపాలు ఊరికే రావు, చర్చిలో ఇలాగే జరిగితే జగన్ ఊరుకుంటారా? - పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/22/ddc3a3ae13ea468bf2111a5c681053e51726982784417234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Deputy Chief Minister Pawan Kalyan: తిరుమల లడ్డూ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కేబినెట్ మద్దతుగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తిరుమల అపవిత్రత విషయంలో కేబినెట్ సమావేశం జరగాలని, అసెంబ్లీలో చర్చ జరగాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. ఇంకా గత ఐదేళ్లలో టీటీడీలో ఎన్ని అవకతవకలు జరిగాయో మొత్తం బయటికి రావాలని డిమాండ్ చేశారు.
కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ ఉద్యోగులకు విషయం తెలిసి కూడా ఇన్నాళ్లు మౌనంగా ఉండి ద్రోహం చేశారని పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో జరిగిన తప్పిదానికి తనకు ఏం సంబంధం లేకపోయినప్పటికీ, తాను బాధ్యతగా భావించి 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఒక హిందువుగా తాను గొంతెత్తి పోరాడాలనుకుంటే వైసీపీ ప్రభుత్వ హాయాంలో విగ్రహాల ధ్వంసం జరిగిన సమయంలోనే రోడ్డుపైకి వచ్చి ఉండేవాడినని గుర్తు చేశారు. దీన్ని రాజకీయం చేయాలని తాము అనుకోవడం లేదని అన్నారు. కానీ అపవిత్రం జరుగుతున్నప్పుడు చూస్తే ఊరుకున్నా చాలా తప్పు అవుతుందని అన్నారు.
తిరుమలలో ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ వైసీపీ హాయాంలో నియమించిన టీటీడీ బోర్డు ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఏం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ధర్మాన్ని పరిరక్షించడానికి టీటీడీ బోర్డును నియమించలేదని, ఇష్టారీతిన కాంట్రాక్ట్‌లు ఇచ్చుకుంటామంటే కుదరదని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎవరికీ కోపాలు, వేదన, బాధ ఊరికే రావు. మాకు వేదన ఉంది. తిరుమలలో జరిగిన అపవిత్రత ఒక చర్చిలో, లేదా ఒక మసీదులో జరిగితే గత ముఖ్యమంత్రి జగన్ ఊరుకుంటారా? తిరుమలలో జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తున్నారు. మేం ఏ మతానికి అన్యాయం జరిగినా మేమంతా మాట్లాడతాం? పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా అవసరం. దోషులకు కఠిన శిక్షలు పడాల్సి ఉంది.
ఇలాంటి విషయాలు గ్లోబల్ న్యూస్ అయిపోతుందని అన్నారు. ఇప్పుడు తిరుమల ప్రసాదం అపవిత్రం అవుతుంటే హిందువులంతా మాట్లాడాలని పిలుపు ఇచ్చారు. మతాన్ని గౌరవించడం ప్రతి హిందువు నేర్చుకోవాలని, తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవద్దని పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)