Harish Rao Letter: వెంటనే 50 లక్షల వ్యాక్సిన్ లు పంపండి - కేంద్రానికి మంత్రి హరీష్ రావు లేఖ
Harish Rao Letter: తక్షణమే 50 లక్షల కరోనా వ్యాక్సిన్లు పంపమంటూ మంత్రి హరీష్ రావు కేంద్ర మంత్రి మాన్ సుక్ మాండవీయకు లేఖ రాశారు. డిమాండ్ కి తగ్గ మొత్తంలో కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో లేవని తెలిపారు.
Harish Rao Letter: రాష్ట్రానికి తక్షణమే 50 లక్షల కొవిషీల్డ్ టీకాలు పంపాలని కేంద్రానికి తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. వెంటనే వ్యాక్సిన్ డోసులు పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయకు రాసిన లేఖలో కోరారు. దేశంలో ప్రస్తుతం ప్రికాషనరీ కొవిడ్19 డోసులు ఇస్తుండటంతో డిమాండ్ కి తగిన మొత్తంలో కరోనా టీకా డోసులు అందుబాటులో లేవని కేంద్రానికి హరీష్ రావు తెలిపారు. వ్యాక్సినేషన్ విషయంలో దేశ వ్యాప్తంగా తెలంగాణ ముందంజలో ఉందని హరీశ్ రావు వెల్లడించారు.
కేవలం ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రమే అనుమతి..
భవిష్యత్తులో కొత్త వేరియంట్ల ద్వారా కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందనే అంచనాల సమయంలో రెండు డోసులు పూర్తి చేసుకున్న.. అర్హులైన వారికి ప్రికాషనరీ కొవిడ్19 డోస్ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని మంత్రి హరీష్ రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ప్రికాషన్ డోస్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతిని ఇచ్చింది. కానీ 18 ఏళ్ల పైబడిన వారికి ఈ డోస్ ఇచ్చేందుకు కేవలం ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది.
ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఇచ్చేందుకు అనుమతివ్వండి..
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రైవేటు ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ కేంద్రాల్లోనూ 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారికి ప్రికాషన్ డోస్ ఇచ్చేందుకు అనుమతించాలని మంత్రి హరీష్ రావు కేంద్రానికి రాసిన లేఖలో కోరారు. ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఏప్రిల్ 10 నాటికి దాదాపు 9 లక్షల 84 వేల 24 మంది ఈ డోసు పొందేందుకు అర్హులుగా ఉన్నారని మంత్రి వివరించారు. 18 ఏళ్లు పైబడి వారికి మొదటి డోసును 106 శాతం, 104 శాతం రెండో డోసు, పంపిణీ చేసినట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయం..
ప్రికాషనరీ డోస్ కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో డిమాండ్ మేరకు ప్రతిరోజూ 3 లక్షల డోసులు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నా... వ్యాక్సిన్ కొరత వల్ల రోజుకు కేవలం 1.5 లక్షల డోసులు మాత్రమే ఇవ్వగల్గుతున్నట్లు కేంద్రానికి రాసిన లేఖలో వివరించారు. అంతే కాకుండా 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ అందించడంలో దేశంలోనే రాష్ట్రం తొలి స్థానంలో నిలించిందని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత డిమాండ్ మేరకు వ్యాక్సిన్ సరఫరా కావడం లేదని చెప్పారు. రాష్ట్రంలో కేవలం 2.7 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే 50 లక్షల కొవిషీల్డ్ డోసులను వెంటనే రాష్ట్రానికి పంపాలని కోరినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.