Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
Telangana News | తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం లేదని కిషన్ రెడ్డి లేఖ రాశారు.

BJP leaders not attends all parties meeting | హైదరాబాద్: తెలంగాణ ఎంపీల సమావేశానికి తాము హాజరు కావడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)కు లేఖలో ఈ విషయం వెల్లడించారు. తనకు లేఖ చాలా ఆలస్యంగా వచ్చిందని, పార్టీ పనులు, అధికారిక, అనధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నందున సమావేశానికి హాజరు కాలేమని కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజా భవన్ లో అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. అయితే చివరి నిమిషంలో తమకు ఆహ్వానం అందిందని, బిజీ షెడ్యూల్ కారణంగా అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం లేదని బీజేపీ స్పష్టం చేసింది. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.
కిషన్ రెడ్డి రాసిన లేఖలో ఏముందంటే..
‘తెలంగాణ ఎంపీల సమావేశానికి మీరు పంపిన ఆహ్వానం అందింది. ఆహ్వానానికి ధన్యవాదములు. ఈ లేఖ నిన్న ఆలస్యంగా అందిన కారణంగా మా పార్టీలో అంతర్గతంగా చర్చించుకునేందుకు సమయం లేదు. ఇప్పటికే నిర్ణయించుకున్న అధికార, అనధికార కార్యక్రమాల కారణంగా ఈ సమావేశానికి మేం హాజరుకాలేకపోతున్నాం. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు నిర్వహించాలని అనుకుంటే కాస్తముందుగానే తెలియజేయండి. అయితే, తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, బీజేపీ కట్టుబడి ఉంది. తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధి, అంకితభావంతో మేం కృషిచేస్తూనే ఉంటాం అని’ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తన లేఖలో స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి విమర్శలు..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ అక్షయపాత్ర అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పులు ఉన్నాయంటూ చేతులు ఎత్తేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గ్యారంటీల పేరుతో గారడీ చేసి, ప్రజలను మభ్యపెట్టి అధికారం తెచ్చుకున్నప్పుడు తెలంగాణకు అప్పులు ఉన్నాయని తెలియదా అని ప్రశ్నించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే ప్రజా ప్రభుత్వం వద్ద నిధులు లేవని సాకుగా చూపించి.. గ్యారంటీలను ఎగ్టొట్టే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తెలంగాణ అక్షయపాత్ర అని, ఏలే రాజు తెలివి ఉన్నవాడు అయితే కాంగ్రెస్ ప్రకటించిన హామీలన్నింటికీ సరిపోయే సంపద తెలంగాణ సృష్టించగలదని నమ్మబలికి, ప్రజలను మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకున్న రేవంత్ రెడ్డి.. ఈ రోజు ఏ హామీని పూర్తిగా అమలు చేయలేని స్థితి కి… pic.twitter.com/XiBOCSka88
— G Kishan Reddy (@kishanreddybjp) March 7, 2025
తెలంగాణ ఖజానాలో నిధులు ఉన్నాయని భావించి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వద్ద నిధులు లేవని తెలిసిందంటూ కల్లిబొల్లి కబుర్లు చెబుతున్నారంటూ రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

