Telangana News: అత్యంత దీనస్థితిలో మరుగుజ్జు దంపతులు- ప్రభుత్వాలు మారినా తమకు సాయం అందడంలేదని కన్నీళ్లు
Telangana : గాంధీభవన్ లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి వచ్చిన మరుగుజ్జు దంపతులు తమకు రేషన్ కార్డు, ఇల్లు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

Telangana : హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి వచ్చిన మరుగుజ్జు దంపతులు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన ఈ జంట.. తమ బాధలను వెల్లబోసుకున్నారు. ఫుట్ పాత్ పై ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుని జీవనం సాగించే ఈ దంపతులు.. తమకు ఉండడానికి ఇల్లు లేదని, రేషన్ కార్డ్ కూడా లేదని వాపోయారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. ఇద్దరు పిల్లలతో వచ్చిన ఈ మరుగుజ్జు దంపతులు అనేక బాధలు పడుతూ నగరంలో కాలం వెల్లబోస్తున్నారు. ఇంటి అద్దె కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. సర్కారు ఆఫీసుల చుట్టూ తిరిగి, తిరిగి అలసిపోయిన ఈ మరుగుజ్జు దంపతులు.. ఇప్పుడు మంత్రులతో ముఖాముఖి తలుపు తట్టారు.
బాధలు చెప్పుకుంటూ బోరున విలపించిన దంపతులు
మలక్ పేట నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చిన మరుగుజ్జు దంపతులు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి వచ్చి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. ఉండడానికి ఇల్లు లేదని, రేషన్ కార్డ్ లేదని ఆయనకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈ జంట.. ఫుట్ పాత్ పై ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుని జీవనం సాగిస్తున్నామని చెప్పారు. అంతకుముందు ప్రజాపాలనలోనూ రేషన్ కార్డ్, ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా.. తమకు మంజూరు కాలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పట్నుంచి తాము ఆఫీసులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నామన్నారు. వారి ఇద్దరు పిల్లలు సైతం అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారంలో రోజూ కేవలం రూ.200 మాత్రమే వస్తాయని, నెలకు ఇంటి అద్దె రూ.8వేలు కడుతున్నామన్నారు. తమ పరిస్థితిని చూసి ప్రభుత్వమే తమకు సహాయమందించాలని, ఆదుకోవాలని కోరారు.
మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం
ప్రజల సమస్యలతో పాటు పార్టీ కేడర్ ఇబ్బందులను నేరుగా తెలుసుకుని వాటిని అప్పటికప్పుడు పరిష్కారించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమమే మంత్రులతో ముఖాముఖి. పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన కేవలం వారం రోజుల్లోనే అంటే గతేడాది సెప్టెంబర్ చివరి వారంలో ఈ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. అందరికీ అందుబాటులో ఉండేలా వారంలో 2 సార్లు అంటే బుధ, శుక్రవారాల్లో గాంధీ భవన్ లో ఈ కార్యక్రమం నిర్వహించాలని పీసీసీ చీఫ్ నిర్ణయించారు. అలా ఒక్కో రోజు ఒక్కో మంత్రి పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. సీఎం కూడా నెలలో 2సార్లు హాజరు కావాలని కోరారు. అలా ఈ కార్యక్రమం 3 వారాల పాటు సజావుగా సాగింది. మొదట్లో దరఖాస్తులను నేరుగా మంత్రులే తీసుకుని అప్పటికప్పుడు పరిష్కరించగా, మరికొన్ని మాత్రం అధికారులకు సిఫార్సు చేసి ఆదేశాలు జారీ చేశారు.
ఆ తర్వాత వారంలో 2 సార్లకు బదులు 15 రోజులకు 2 సార్లు నిర్వహించడం మొదలుపెట్టారు. ఇలా 3 నెలల పాటు సాగింది. ఈ కార్యక్రమాన్ని చివరిసారిగా డిసెంబర్ 5, 2024లో నిర్వహించగా.. ఇందులో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖాముఖిలో పాల్గొన్నారు. అప్పట్నుంచి నెలన్నర తర్వాత మళ్లీ జనవరి 29న మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం గమనార్హం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

