GHMC Meeting: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం, బడ్జెట్ పేపర్లు చింపి మేయర్ పై విసిరేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు
జీహెచ్ఎంసీ సమావేశం రసాబాసగా మారింది. మేయర్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో క్వశ్ఛన్ అవర్ కోసం బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుపట్టి పోడియం చుట్టుముట్టారు.

GHMC Mayor Gadwal Vijayalakshmi News | హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. పోడియం చుట్టుముట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు పేపర్లు చించి మేయర్ వైపు విసిరారు. క్వశ్చన్ అవర్ కు ఛాన్స్ ఇవ్వాలని పట్టుపట్టడంతో, కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూ.8440 కోట్ల బడ్జెట్ ను జీహెచ్ఎంసీ మేయర గద్వాల్ విజయలక్ష్మీ ప్రవేశపెట్టారు. నేటి సమావేశం సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు జీహెచ్ఎంసీ సమావేశంలో సభ్యులు నివాళులు అర్పించారు.
హామీలు నెరవేర్చలేదని ప్లకార్డులతో బీఆర్ఎస్ నిరసన
సమావేశం ప్రారంభం కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడం లేదంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫ్లకార్డులతో నిరసనకు దిగారు. మేయర్ పోడియం వద్దకు వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు యత్నించగా, వారిని కాంగ్రెస్ సభ్యులు అడ్డుకోవాలని చూడగా తోపులాట జరిగింది. బడ్జెట్ పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మీ సూచించారు. కానీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు క్వశ్ఛన్ అవర్‌కు పట్టుపట్టి, స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ఈ క్రమంలో మేయర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేపర్లను చింపి ఆమె వైపు విసిరివేయడంతో జీహెచ్ఎంసీ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లను మార్షల్స్ అడ్డుకున్నారు. మేయర్ విజయలక్ష్మీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ జీహెచ్ఎంసీ ఆఫీసు బయట రోడ్డుపై బైఠాయించారు.
మరోవైపు బీజేపీ నిరసన
మరోవైపు బీజేపీ సైతం నిరసనకు దిగింది. గోషామహల్ స్టేడియాన్ని కూల్చొద్దని, అక్కడ ఉస్మానియా హాస్పిటల్ నిర్మించవద్దని బీజేపీ కార్యకర్తలు జీహెచ్‌ఎంసీ ఆఫీసు వద్ద నినాదాలు చేశారు. ఉస్మానియా హాస్పిటల్ వెనక ఉన్న ఏరియాలోనే కొత్త హాస్పిటల్ భవనం నిర్మించాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. అంతకుముందు నిధుల కోసం బీఆర్ఎస్ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ జీహెచ్ఎంసీ ఆఫీసుకు చేరుకున్నారు. నేడు బడ్జెట్ సమావేశం ఉన్నందున జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

